నిధులు లేకున్నా.. వారు చేసిన ఒక్క ఆలోచన.. సిద్ధిపేటను బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దింది. చెత్త నుంచి ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ మహిళా బృందం కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ పురస్కారాన్ని అందుకున్నది.
మహిళలమే కదా.. వంటింటికే పరిమితమని అనుకోలేదు. కుటుంబ సేవలకే అంకితం అనే ఆలోచన అస్సలు చేయలేదు. ప్రతి పనిలో మేమూ సగమంటూ ప్రతి మహిళా నడుం బిగించి మహిళామణుల శక్తిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పింది. అన్నింటా మేముంటామని అన్ని రంగాల్లో రాణిస్తామని ప్రతిన బూనింది. ఉద్యోగం, వ్యాపారం, విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు ప్రజాసేవ, సంఘసేవా వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఇవాళ్టి సమాజంలో మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందని.. చక్కటి ఆలోచన చేసి అక్షరాల ఆ మాటల్ని సిద్ధిపేట సాయితేజ స్లమ్ మాహిళా సమాఖ్య బృందం నిజం చేసింది. మన సిద్ధిపేట మహిళల పేట అని నిరూపించింది.
” ఇల్లాలు సంపాదించగలిగితే ఆ ఇళ్లు బంగారం అవుతుంది” అనే సూత్రాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళల కోసం ఏర్పాటైన సిద్ధిపేట పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మెప్మా లోని శ్రీ సాయితేజ స్లమ్ మహిళా సమాఖ్య ఇవాళ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది.
మామిడాల రాము
సిద్ధిపేట.. ఇటు అభివృద్ధిలో, అటు స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో కీర్తి కిరీటాల్ని కైవసం చేసుకున్న పట్టణం. ఈ స్వచ్ఛ విజయం నిజంగా సిద్ధిపేట పట్టణ మహిళలదేనని చెప్పాలి. ఈ విజయంలో మహిళా సంఘాల పాత్రే కీలకం. 2015లో సిద్ధిపేటను బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా మార్చాలని మంత్రి హరీశ్ రావు సంకల్పించారు. దీన్ని స్వీకరించిన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్ధిపేట-మెప్మా విభాగంలోని శ్రీ సాయితేజ స్లమ్ మహిళా సమాఖ్య ప్రజల్ని మరుగుదొడ్లు కట్టుకునేలా చైతన్యవంతుల్ని చేసింది. ఇదంతా ఏ ఒక్కరోజులోనో జరగలేదు. పైగా మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా మరుగుదొడ్లు కట్టించడం వీరికి పెద్ద సవాల్ గానే మారింది. ఈ సవాల్ ను స్వీకరించిన ఈ గ్రూపు మహిళా సభ్యులు పట్టణ వాసులను ఆ దిశగా ఒప్పించి వారి నుంచే ఇతరులు స్ఫూర్తి పొందేలా చేశారు.
ముందు డబ్బులిచ్చారు..!
శ్రీ సాయితేజ స్లమ్ సమాఖ్య పరిధిలో ఉన్న 32 సంఘాల్లోని 345 మంది మహిళా సభ్యులతో సభాసమావేశాలు నిర్వహించారు. ఇళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి కట్టుకునేలా చేయడం ఈ సమాఖ్య బాధ్యత. అయితే దీనికి గ్రామీణులు ఆసక్తి చూపలేదు. ఇందుకు డబ్బే ప్రధాన సమస్య అని తెలుసుకుని, అలాంటి వారిని గుర్తించి వీరి సమాఖ్య నిధి నుంచి ముందు కొంత డబ్బును కేటాయించారు. మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తి అయ్యాక ప్రభుత్వ నిధులు తిరిగి తీసుకునేలా తీర్మాణాలు చేయించు కుని.. అలా మొత్తం 126 మరుగు దొడ్లు కట్టించి సత్ఫలితాలు పొందారు. వీరి స్ఫూర్తితో రాష్ట్రంలోని ఇతర జిల్లాల సమాఖ్యలు సైతం వీరి బాటను అనుసరించడం మొదలు పెట్టాయి. ఈ దరిమిలా 2016 సంవత్సరంలో బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా సిద్ధిపేట ఆవిర్భవించడంలో వీరు చేసిన కృషి ఎనలేనిది.
తడి, పొడి చెత్త వేర్వేరు చేస్తూ..
మరుగుదొడ్లు కట్టించడంతోనే మా కర్తవ్యం పూర్తి అయ్యిందని అనుకోలేదు. పరిశుభ్రత విషయంలోనూ ఆదర్శంగా నిలువాలని శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఏ ఒక్కచోట చెత్తా చెదారం కనిపించకుండా
ఉండేలా మహిళా సమాఖ్య సభ్యులే నడుం బిగించారు. స్వచ్ఛత కోసం ఉద్యమంలా ప్రచారాన్ని కొనసాగించారు. తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ సహా వాటిని వినియోగించడంలో ఆదర్శంగా నిలిచారు. ఈ సమాఖ్యకు రిసోర్స్ పర్సన్ గా పని చేస్తున్న సంతోషి, శ్రీ సాయి తేజ స్లమ్ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలిగా కాస విజయ, కార్యదర్శి నవ్య, ఇతర సభ్యులందరితో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. పట్టణంలోని అన్ని కాలనీల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. తడి చెత్తతో మందపల్లిలోని రిసోర్స్ పార్కులో సేంద్రీయ ఎరువులు తయారీ చేయడం, పొడి చెత్తను ఒక్క దగ్గరికి చేర్చి పేపర్ పరిశ్రమ (ఐటీసీ సంస్థ) కు విక్రయాలు జరుపుతూ మున్సిపాలిటీకి ఆదాయం సమకుర్చేలా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛత ఎక్స్ లెన్స్ పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో మార్చి నెల 23న జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ పురస్కారాన్న్ని ప్రథమ బహుమతిగా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్ధిపేట సమాఖ్య ప్రతినిధులు అందుకున్నారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన- జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో 196 నామినేషన్లను కేంద్ర బృందం పరిశీలించింది. ఎట్టకేలకు సిద్ధిపేట మున్సిపాలిటీ-మెప్మా శ్రీ సాయి తేజ స్లమ్ మహిళా సమాఖ్యను ఎంపిక చేసింది. దేశం మొత్తం నుంచి 26 స్లమ్ మహిళా సమాఖ్యలను ఎంపిక చేయగా వాటిలో సిద్ధిపేటదే ప్రథమ స్థానం. ఇందుకు గానూ రూ.1.50 లక్షల నగదు పారితోషికంతో పాటు పురస్కారాన్ని సమాఖ్య ప్రతినిధులకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అందించారు. అనుకున్న సంకల్పాన్ని సాధించేందుకు సవాలక్ష అడ్డంకుల్ని అధిగమించారు. మహిళా సాధికారతకు దారి చూపుతున్న ”శ్రీ సాయితేజ మహిళా సమాఖ్య” ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేటి తరం ఆధునిక మహిళలు ప్రగతిబాటలో సాగడానికి ఇలాంటి స్లమ్ సమాఖ్యలు చేయూతనిస్తున్నాయి. ఈ మేరకు సిద్ధిపేట కోమటి చెరువు కళా క్షేత్రం-ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఈ సమాఖ్య సభ్యులను మంత్రి హరీశ్ రావు అభినందన సభతో ఘనంగా సన్మానించారు.
సిద్ధిపేట లక్ష మంది ప్రజల విజయం
– నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేట మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ప్రథమ స్థాయి బహుమతి రావడం సిద్ధిపేటకే గర్వకారణం. ఇది సిద్ధిపేట లక్ష మంది ప్రజల విజయం. ప్రజల సహకారం చాలా గొప్పది. ఇవాళ సిద్ధిపేట ప్రజలు ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వడం, సిద్ధిపేట ప్రజలు చూపించిన స్ఫూర్తే ఇవాళ యావత్ దేశ ప్రజల ప్రశంసలు పొందుతున్నది. ఎన్నో అవార్డులు సాధించిన సిద్ధిపేట మున్సిపాలిటీకి ఈ ఎక్స లెన్స్ అవార్డు జాతీయ స్థాయిలో ప్రథమ స్థాయిలో రావడం నిజంగా సంతోషకరమైన విషయం. మున్సిపల్ పాలక వర్గం, అధికారులు, మెప్మా బృందం, అవార్డు పొందిన శ్రీ సాయి తేజ స్లమ్ సమాఖ్య సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు.