పరిచయం అవసరం లేని పేరు సిద్ధిపేట..! ఇక్కడ అమలవుతున్న ఎన్నో ప్రభుత్వ పథకాలే స్ఫూర్తిదాయకం..! ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. సీఎం సీేఆర్ తర్వాత ఇక్కడి పగ్గాలు చేపట్టిన మంత్రి హరీశ్ రావు పనితీరుకు తలమానికంగా నిలుస్తున్న సెగ్మెంట్ ఇది. ఈ క్రమంలో పచ్చని మొక్కలతో.. పట్టణానికి పచ్చతోరణాలు తొడిగింది. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మంత్రి హరీశ్ సూచనలతో.. మున్సిపల్, అగ్నిమాపక, ఫారెస్ట్ అధికారులంతా నిత్యం నీరుపోస్తూ.. కలుపు తీస్తూ కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవతో.. హరిత సైనికుల్లా పని చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కృషితో.. ఆకుపచ్చని తోటలా సిద్ధిపేట పట్టణం మారింది. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్ధిపేట హరిత మిత్ర అవార్డును కైవసం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని మొదటి, రెండో విడతలో విజయవంతంగా పూర్తి చేయడమే గాక.. వాటి సంరక్షణ బాధ్యతను సైతం తమ భుజాలపై వేసుకుని.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ గోల్కోండ కోటలో జరిగిన సన్మాన సభలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్ధిపేట కమిషనర్ .వీ.రమణాచారి హరిత మిత్ర అవార్డు పొందారు.
వానలు వాపసు రావాలే.. కోతులు అడవులకు పోవాలే.. అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా హరిత ఉద్యమం ప్రారంభించింది. 1997-98లో కేసీిఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సిద్ధిపేటలో హరిత ఉద్యమం మొదలైంది. ఇదే క్రమంలో సిద్ధిపేట ఎమ్మెల్యేగా తన్నీరు హరీశ్‌రావు ఏడేళ్లుగా హరిత ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు మున్సిపల్ పరిధిలో పచ్చదనం.. విస్తీర్ణం 28శాతానికి చేరింది. ఏడేళ్ల కిందట డివైడర్లపై మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించే బాధ్యతను సైతం మంత్రి హరీశ్ ప్రణాళిక బద్ధంగా చేపట్టారు. నిత్యం నీళ్లు పోసి కాపాడితేనే ఇది సాధ్యమవుతుందని.. వివిధ విభాగాలకు చెందిన అధికారులందర్నీ సమన్వయపర్చారు. మెదక్, కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే కీలక రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించేలా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్ల కిందట 50వేలు, గతేడాది 2.08లక్షలు.., ప్రస్తుతం కొనసాగుతున్న హరిత హారంలో 2.32లక్షల మొక్కలు నాటారు. దీంతో పట్టణంలో చెట్ల విస్తీర్ణం పెరగటమే కాదు.. శాటిలైట్ ద్వారా లెక్కలు తీస్తే 28శాతం విస్తీర్ణానికి చేరింది.
మొక్కలపై ప్రత్యేక దృష్టి..
మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ
సిద్ధిపేట పట్టణం ఆకుపచ్చని తోరణంగా మారింది. నాటిన ప్రతి మొక్క ఎండిపోకుండా కొత్త చిగురులు తొడుగుతూ.. ఏపుగా పెరుగుతున్నాయి. పలు రకాల పూల మొక్కలకు పువ్వులు పూసి స్వాగతం పలుకుతున్నాయి. ఇకపోతే.. సిద్ధిపేట మున్సిపల్, అగ్నిమాపక, ఫారెస్ట్ అధికార యంత్రాంగం మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నీరు పోయడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తూ.. సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి హరీశ్ రావు పట్టణానికి వచ్చిన ప్రతిసారీ.. రోడ్డుకిరువైపులా.. డివైడర్ల మధ్యన, రోడ్డు పక్కన, కార్యాలయాల స్థలాల్లో నాటిన ప్రతి మొక్కను ప్రత్యక్షంగా పరిశీలించి.. అప్పటికప్పుడే ఫోన్‌ద్వారా అధికారులకు పలు సూచనలు చేస్తూనే ఉంటారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ట్రీగార్డ్, మొక్క వంగిపోయినా.. వెంటనే కాన్వాయ్ కారులో నుంచి దిగి వంగిన మొక్కను కర్రను సరిజేస్తారు. ఇలా మంత్రే స్వయంగా.. హరిత హారంపై ఇంతలా.. చొరవ చూపడంతో.. అధికారులంతా మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు వాటి సంరక్షణ చర్యలకు సంసిద్ధులవుతున్నారు.
మొక్కల సంరక్షణకు నిత్యం 1.96 లక్షల లీటర్ల నీరు..
స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్ధిపేట కమిషనర్ .వీ.రమణాచారి
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సిద్ధిపేటలో తప్ప.. ఈ స్థాయిలో మరెక్కడా ఇంత శాతం విస్తీర్ణంలో పచ్చదనం లేదు. ప్రధాన రహదారులు, వీధులు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ దవాఖానలు, మార్కెట్ యార్డు, ప్రభుత్వ కార్యాలయ ఆవరణలు, పోలీస్ స్టేషన్లు.. ఇలా ఎక్కడ చూసినా మొక్కలతో.. హరితమయ మైంది..! మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో.. హరిత సిద్ధిపేటగా మార్చేందుకు మున్సిపల్ యంత్రాంగం, కౌన్సిలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలంతా ఒక్కటయ్యారు. నాటిన మొక్కలు వంగిపోతుంటే.. కర్రలతో ఆసరా ఇచ్చాం. ట్రీగార్డులతో వాటికి ఊతమిచ్చి.. పలు శాఖలు కొన్ని రహదారులను దత్తత తీసుకుని సంరక్షించేలా చర్యలు తీసుకున్నారు. నిత్యం 6 ట్యాంకర్ల ద్వారా 1.96లక్షల లీటర్ల నీరును మొక్కలకు పడుతూ.. వాటి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇందుకు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
సిద్ధిపేటకు హరిత మిత్ర రావడం..సంబురంగా ఉంది.
మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేటకు రాష్ట్ర స్థాయిలో హరిత మిత్ర పురస్కారం రావడం సంబురంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల్లో మొత్తం ఐదు పురస్కారాలు ప్రకటించారు. ఇందులో సిద్ధిపేటకు ప్రకటించడం.. ఆనందంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీేఆర్ ఇక్కడ చేపట్టిన హరిత ఉద్యమం చూసి ప్రభావితుడనయ్యాను. హరిత హారం అంశంపై ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తూ.. ముందుకు సాగుతున్నా. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మహిళలు.. ముఖ్యంగా పట్టణ ప్రజల సహకారం ఎంతో వుంది.