వి.బి.రాజు పథకానికి హోమ్ శాఖ తిరస్కృతి

తెలంగాణ ప్రాంతీయ సంఘం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఒక నిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ఎంపిలతో బాటు సుమారు 200 మంది పార్లమెంటు సభ్యుల కోరికను ఆచరణ సాధ్యం కాదని హోం శాఖ తిరస్కరించింది. ఈ పార్లమెంట్‌ సభ్యులు ఇచ్చిన వినతి పత్రాన్ని దేశీయాంగ శాఖ (హోం) అధికారులు పరిశీలించి దీనిలో పేర్కొన్న ప్రతిపాదన “ఆచరణ సాధ్యం కాదని” నిర్ణయానికి వచ్చారు.

ఈ నిర్వాహక వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయాలనే విషయాన్ని పార్లమెంటు సభ్యుల వినతి పత్రంలో విశదీకరించ లేదు. అయితే ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలను ఇవ్వాలని ఈ వినతి పత్రం ఉద్దేశ్యంగా దేశీయాంగ శాఖ అధికారులు భావించారు.

ప్రాంతీయ సంఘానికి చట్టబద్దమైన అధికారాలు లేకపోతే ఈ సంఘం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఏ పరిపాలనా వ్యవస్థకూ అధికారాలు ఉండవు. ఇప్పుడు ఈ సంఘం నిర్ణయాలు సలహా పూర్వకమైనవే కానీ వీటిని పాటించి తీరాలని లేదు. కాని ఈ సంఘం అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం మన్నించగలదని భావిస్తున్నారు. ప్రాంతీయ సంఘం నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి వుండాలని నిర్ణయించడం వల్ల ప్రభుత్వానికి చిక్కులు కలుగగలవని దేశీయాంగ శాఖ పేర్కొన్నది. పైగా ప్రాంతీయ సంఘం కన్నా విస్తృత సంస్థ అయిన శాసన సభ అధికారాలను ఆ మేరకు తగ్గించినట్లు కాగలదని దేశీయాంగ శాఖ అధికారులు భావించినట్లున్నారు

తెలంగాణ మంత్రులను శాసనసభకు కాక, ప్రాంతీయ సంఘానికి బాధ్యులుగా చేయడం కూడా అసాధ్యమేనని దేశీయాంగ శాఖ భావించింది. ”నిర్వాహక వ్యవస్థ ప్రాంతీయ సంఘానికి బాధ్యత వహించాలని ఈ పత్రంలో పేర్కొన్న దాని అర్థం – రాజ్యాంగ రీత్యా శాసన సభ కాని ఒక సంస్థకు మంత్రి వర్గంలో కొంత భాగం బాధ్యులుగా వుండాలనడమే”నని దేశీయాంగ శాఖ పేర్కొన్నది.

వినతి పత్రంలో పేర్కొన్న ‘నిర్వాహక వ్యవస్థ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం పొందవలసి వుంది. ప్రస్తుత రాజకీయ అధికారాలను ఇచ్చే ఎలాంటి ప్రతిపాదనైనా ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నప్పుడు… నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు పై పార్లమెంటులో ప్రధాన మంత్రి బిల్లును ప్రవేశపెడతారా?

సిద్ధిపేటలో విద్యార్థులచే కాంగ్రెస్‌ జీపు ధ్వంసం
సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఊరేగింపుగా వస్తూ (నవంబర్‌ 6న) కాంగ్రెస్‌ బ్యానర్లను, జెండాలను చించి ఒక జీపును పాడు చేశారని పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్‌. జైపాల్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్‌ ఈ విద్యార్థులకు నాయకత్వం వహించాడని జైపాల్‌ రెడ్డి ఆరోపించారు. సిద్ధిపేట ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓటర్లు విశేషంగా బలపరుస్తున్నారని, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌అభ్యర్థి విజయం కోసం అహోరాత్రాలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని చూసి సంతోషించలేకపోయిన ప్రత్యేక రాష్ట్ర వాదులు కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారోద్యమానికి అవరోధం కలిగించి ఆయన విజయావకాశాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని జైపాల్‌ రెడ్డి తెలిపారు.

ప్రదర్శకులు దౌర్జన్యానికి పూనుకున్న సమయంలో పోలీసులు ఆ పరిసరాల్లో ఎక్కడా లేరని తమకు సమాచారం అందిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర వాదులు చేసే ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు గానీ ఆయనను బలపర్చే విద్యార్థులు గానీ బెదిరిపోరని ఎస్‌. జైపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ జీపును ధ్వంసం చేయడాన్ని పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి, ప్రాంతీయ సంఘం అధ్యక్షులు జువ్వాది చొక్కారావు ఖండించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి. రాజేశ్వర రావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ యునైనెడ్‌ ఫ్రంట్‌తో కొండా లక్ష్మణ్‌ తెగత్రెంపులు :రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ నుంచి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘం అధ్యక్షులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ నవంబర్‌ 7న రాజీనామా చేశారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు నూకల రామచంద్రా రెడ్డికి బాపూజీ ఒక లేఖ రాస్తూ యునైటెడ్‌ ఫ్రంట్‌ నుంచి తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఈ లేఖ ప్రతిని ఆయన టియుఎఫ్‌ అధ్యక్షులు వి.బి. రాజుకు పంపించారు. తామంతా కాంగ్రెస్‌ వాదులమని, శాసనసభ లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వాదులుగా కూర్చోవచ్చునన్న కారణంపై రాష్ట్ర శాసనసభలో తెలంగాణా యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటును తాను ఆనాడే వ్యతిరేకించినట్లు కొండా లక్ష్మణ్‌ తెలిపారు. ఇలాంటి ఫ్రంట్‌ల ఏర్పాటులో తమకు విశ్వాసం లేదని కానీ, ఫ్రంట్‌ అధ్యక్షుడు వి.బి.రాజు తమ మాటవినలేదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ వాదులలో ఐకమత్యం కాపాడేందుకు తాము వి.బి. రాజు ఒత్తిడికి లొంగిపోయామని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వెల్లడించారు. ”ఆశలన్నీ పూర్తిగా నిరాశలు కావడంతో ఫ్రంట్‌ నుంచి రాజీనామా చేశాన”ని బాపూజీ ప్రకటించారు.

శాసన సభలో తమ అనుచరులు ఎంతమంది వున్నారని ఒక పత్రికా ప్రతినిధి అడుగగా లక్ష్మణ్‌ ఇలా అన్నారు – ”దేశంలోని పరిస్థితి మీకు తెలుసు. ప్రతివాడు తనకు తోచినట్లు స్వప్రయోజనాల సాధనకు ఆలోచిస్తాడు. అందుచేత నేను నా అనుచరుల గురించి ఆలోచించే ప్రశ్నేలేదు. ప్రతివాడు నాయకుడే. ప్రతివాడూ అనుచరుడే”.

నూకల రామంద్రారెడ్డికి కొండా లక్ష్మణ్‌ రాసిన లేఖ పూర్తి పాటం :
”తెలంగాణ ఉద్యమంలో సీనియర్‌ నాయకుల మధ్య ఐకమత్యాన్ని సాధించి, యునైటెడ్‌ ఫ్రంట్‌ పేరుతో శాసన సభ్యులను సమీకరించాలని మొదట భావించారు. కానీ యీ విషయాలపై నా అభిప్రాయాలను పదే పదే వ్యక్తపర్చినప్పటికీ, యీ లక్ష్యాల సాధనకు నేను కృషి చేసినప్పటికీ, యీ లక్ష్యాల ప్రధాన్యం ఇవ్వలేదు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడంలో లక్ష్యాలను సాధించడానికి మారుగా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన వ్యక్తులు కొందరు విచ్ఛిన్నకర విధానాన్ని అవలంభించి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఐకమత్యంలేకుండా చేసి యునైటెడ్‌ ఫ్రంట్‌ను అప్రతిష్ట పాలు చేశారు. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే భావిస్తున్నాను.

”దీనికి తోడు తెలంగాణ ఉద్యమంలోని కాంగ్రెస్‌ మనస్తత్వం గలవారికి, తెలంగాణా ప్రజలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘాన్ని రాజకీయ వ్యవస్థగా చేస్తానని మీరు, ఇతర ప్రధాన సహచరులు వ్యక్తిగతంగా నాకు మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కానీ హామీ ఇచ్చిన వారిలో యించుమించు అందరూ తమ మాటను నిలబెట్టుకోలేదు. అంతే కాక ఖైరతాబాద్‌, సిద్ధిపేట ఉప ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలబెట్టడానికి తెలంగాణా ప్రజా సమితిని మీరు, యునైటెడ్‌ అధ్యక్షుడు వి.బి. రాజు ప్రోత్సహించి ప్రజా సమితికి నాయకత్వం అవకాశం కలుగ చేశారు. దీనిని అవకాశంగా తీసుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించిన రాజకీయ పార్టీలను, ప్రత్యేక తెలంగాణ వాదులను నిర్లక్ష్యం చేసి ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చారు. ఈ పరిస్థితులలో నేను యునైటెడ్‌ ఫ్రంట్‌ సభ్యత్వానికి రాజీనామా ఇస్తున్నాను.

మదన్‌ మోహన్‌ను ఓడించండి : కొండా లక్ష్మణ్‌ బాపూజీ
తెలంగాణా ఉద్యమ నాయకుడైన కొండా లక్ష్మణ్‌ నవంబర్‌ 7న ఒక ప్రకటనలో ”తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి మన్‌ మోహన్‌ను చిత్తుగా ఓడించాల”ని సిద్ధిపేట నియోజక వర్గ వోటర్లను కోరారు. కల్లబొల్లి మాటలతో తెలంగాణ ప్రజలను వంచిస్తూ, తెలంగాణ అనైక్యతకు కారకుడై, నియంతగా వెలుగుతున్న డాక్టర్‌ చెన్నారెడ్డి తన స్వంత అభ్యర్థిగా మదన్‌ మోహన్‌ను పెట్టుకున్నారని, కలిసి పనిచేద్దామని ఖైరతాబాద్‌ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వమ్ము చేశారని కొండా లక్ష్మణ్‌ తీవ్రంగా ఆరోపించారు.

ఖైరతాబాద్‌ ఎన్నికలో కూడా డాక్టర్‌ చెన్నారెడ్డి నియంతలాగే వ్యవహరించారని, ప్రత్యేక రాష్ట్రం కోరే వారంతా కలసి పని చేద్దామని వి.బి. రాజు, నూకల రామచంద్రారెడ్డి మధ్యవర్తులుగా యిచ్చిన హామీ పైననే ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటేశంను ఉపసంహరించామని అన్నారు.

తెలంగాణ ప్రజా సమితి స్వార్ధపరులైన కొందరు నాయకుల జేబు సంస్థగా మారిపోయిందనీ, అట్టి ప్రజా సమితిని ప్రజలు నిజమైన దెబ్బతీసినపుడే తెలంగాణా రాజకీయాలు కాలుష్య రహితమై ప్రత్యేక రాష్ట్ర వాదులలో ఐకమత్యానికి దారి ఏర్పడగలదని కొండా లక్ష్మణ్‌ అన్నారు.

తెలంగాణా ప్రజా సమితి తెలంగాణ ప్రజల ప్రథమ శుత్రువు గనుక దానిని సర్వ విధాలా ఈ ఎన్నికల్లో ఓడించాలని కొండా లక్ష్మణ్‌ విజ్ఞప్తి చేశారు.

”సిద్ధిపేటలో కాంగ్రెస్‌దే విజయం” – పిసిసి అధ్యక్షుడు
నవంబర్‌ 8న గాంధీ భవన్‌లో పిసిసి అధ్యక్షులు పి. నరసారెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి. రాజేశ్వర్‌ రావు సిద్ధిపేటలో గెలుస్తున్నారని అంటూ చెన్నారెడ్డిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”ఈ ఎన్నికలలో ప్రజా సమితి అభ్యర్థి ఓడిపోతే డా|| చెన్నారెడ్డి తమ దుకాణాన్ని ఎత్తివేస్తారని చెప్పి వుండవచ్చు. వాచాలత ప్రియులు ఏమి చెప్పినా జనం వింటారు. కాంగ్రెస్‌ అంత విచ్చల విడిగా మాట్లాడే స్థితిలో లేదు. వారు ఓడిపోతే దుకాణమును మూసుకోక చేసే పనిలేదు. కాంగ్రెస్‌ వారు అనేక దుకాణములు కలవారు. ఒక అర మూసివేసినా మిగతా అర అలాగే తెరచుకొని పనిచేసుకోక తప్పదు. నాయకులైనా వారికి విశాలమైన భావాలు ఉండాలి. శివసేన వల్ల అనేక కుటుంబాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తిరిగి రావలసి వచ్చింది. అట్టి కుటుంబాలు సిద్ధిపేటలో ఇప్పుడు 80 వున్నాయి. భారతీయులైన వారు ఎవరైనా దేశంలో ఎక్కడైనా గౌరవప్రదంగా జీవించే హక్కు కలిగి వున్నారు. సంకుచిత భావాలు రెచ్చగొట్టినందువల్ల ఎప్పుడైనా తాత్కాలిక లాభాలు వచ్చినా, చివరకు విశాలమైన ఆదర్శాలకు, భావాలకు విజయము కలగక తప్పదు” అని నరసారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక్కడ గమనింవలసిన అంశం ఏమిటంటే 1969 ఉద్యమంలో తీవ్రమైన హింస – ప్రతి హింస ప్రజ్వరిల్లిన కొన్ని అరుదైన సందర్భాల్లో ఆవేశపరులైన కొందరి వ్యాఖ్యలు తప్ప ఏనాడూ తెలంగాణ ఉద్యమ నాయకులైన డా|| చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రాంతేతరులను ప్రాంతం విడిచి వెళ్ళాలని అన్నట్లు దాఖలాల్లేవు. కేవలం పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘన వల్ల జరిపిన ఉద్యోగుల నియామకాల్లో తెలంగాణ కోటాలో భర్తీ అయిన ఆంధ్ర ఉద్యోగులను మాత్రమే వెనక్కి పంపించాలని ఉద్యమకారులు కోరుతున్నారు తప్ప బ్రతకడానికి వచ్చిన వారిని ఏనాడూ తిరిగి వెళ్ళమనలేదు. ఇదంతా తెలిసి కూడా పిసిసి అధ్యక్షులు పి. నరసారెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే చెన్నారెడ్డి పై, ఉద్యమంపై బురద చల్లి ప్రయోజనం పొందాలని చూశారని పై వ్యాఖ్యల ద్వారా బోధపడుతున్నది.

సిద్ధిపేటలో ప్రజా సమితి ప్రచారం
సిద్ధిపేట శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నకలో తమ అభ్యర్థి మదన్‌మోహన్‌ గెలుపుకై ప్రజా సమితి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.శాసన సభ్యులు మాణిక్‌ రావు ఒక పత్రికా ప్రకటనలో ”ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో వలె సిద్ధిపేట ఓటర్లు పార గుర్తుకు ఓట్లు వేసి మదన్‌ మోహన్‌ను గెలిపించాలి. ఆయనకు వ్యతిరేకంగా వేసే ప్రతి ఓటు ప్రజ పీడనకు వేసే ఓటు కాగలదు. తెలంగాణ విషయమై ప్రధాని తన ధోరణిని మార్చుకొని మేఘాలయవలె తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల”ని అన్నారు. వస్త్ర వ్యాపార సంఘం ఉపాధ్యక్షులు కిషన్‌దూత్‌ ”సిద్ధిపేట నియోజకవర్గ వ్యాపారులు మదన్‌మోహన్‌ను గెలిపించాల”ని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎస్‌.ఎస్‌.పి. అధ్యక్షులు బద్రీవిశాల్‌ పిట్టీ, శ్రీధర్‌ రెడ్డి, జయాచారి, బి. రాంరెడ్డి, డి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమితితో విభేదించినా తమ మద్దతు
మదన్‌ మోహన్‌కే ! : కె.ఎస్‌. నారాయణ

శాసన సభ్యులు కె.ఎస్‌. నారాయణ మరో 11 మంది ఒక ప్రకటనలో ‘తెలంగాణ ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చడం విషయంలో తమకు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమ సాఫల్యం కోసం అన్ని విభేదాలు విస్మరించి మదన్‌ను గెలిపించడానికి కృషి చేస్తున్నామ”ని పేర్కొన్నారు.

”విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మదన్‌ మోహన్‌ గెలుపు అవసరం. తెలంగాణ ప్రజల మనోభావాలకు మదన్‌ మోహన్‌ సరియైన ప్రతిబింబ’మని అన్నారు.
ప్రకటనపై సంతకం చేసిన వారిలో మాజీ డిప్యూటీ మేయర్‌ మ్యాడం రామచంద్రయ్య మరికొందరు మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.

ప్రధానికి కొండా లక్ష్మణ్‌ విజ్ఞప్తి :
అస్సాం నాయకులతోనూ, ప్రభుత్వంతోనూ, సంప్రదించకుండానే ప్రత్యేక మేఘాలయ రాష్ట్ర నిర్మాణానికి నిశ్చయించి పార్లమెంట్‌లో ప్రకటించినట్లే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని కొండా లక్ష్మణ్‌ ప్రధానిని కోరుతూ టెలిగ్రాం పంపించారు.

మదన్‌ మోహన్‌కు విద్యార్థుల మద్దతు :
తెలంగాణా విద్యార్థుల కేంద్ర కార్యాచరణ సమితి ఎం. దుర్గా ప్రసాద్‌ అధ్యక్షతన సమావేశమైన విద్యార్థులు మదన్‌ గెలుపుకు కృషి చేయాలన్నారు.

సిద్ధిపేట ఉప ఎన్నికలో పోలింగ్‌ ప్రశాంతం
సిద్ధిపేట పట్టణంలో జరిగిన స్వల్ప ఘర్షణ మినహా 15-11-1970న జరిగిన ఉప ఎన్నికలలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రజా సమితి, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా సిద్ధిపేటలో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. సుమారు 60 శాతం ఓట్లు పోలైనట్లు భావిస్తున్నారు. 76 గ్రామాల్లో 101 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 73,202. ఢిల్లీ ఎన్నికల కమీషనర్‌ సెక్రెటరీ రోషన్‌ లాల్‌, అండర్‌ సెక్రటరీ నాగ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఎన్నికల సంఘం, అసిస్టెంట్‌ కార్యదర్శి అప్పారావు, జిల్లా కలెక్టర్‌ చక్రవర్తి ఎన్నికలను పర్యవేక్షించారు. సిద్ధిపేటలో ఘర్షణను నివారించడానికి కాంగ్రెస్‌ నేతలు ఎస్‌. జైపాల్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షులు నరసారెడ్డి, కార్మిక మంత్రి సంజీవ రెడ్డి ఒకవైపు, ప్రజా సమితి శాసనసభ్యులు మాణిక్‌ రావు, నాగం కృష్ణారావు, ఎం.ఎం. హాషీంలు మరో వైపు కృసి చేశారు.

సిద్ధిపేటలో 20వేల ఓట్ల ఆధిక్యతతో
ప్రజా సమితి గెలుపు

నవంబర్‌ 16న సిద్ధిపేట శాసనసభ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ జరిగింది. ప్రజా సమితి అభ్యర్థి మదన్‌ మోహన్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థియైన పి.వి. రాజేశ్వర రావుపై 20వేల పైన ఓట్ల ఆధిక్యత సాధించారు. పోలైన ఓట్లు 51,853 కాగా 31,433 ఓట్లు మదన్‌ మోహన్‌కు, 11,563 ఓట్లు పి.వి. రాజేశ్వర రావుకు, 7,073 ఓట్లు గురువారెడ్డికి వచ్చాయి. చెల్లని ఓట్లు 1584. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గురువారెడ్డి డిపాజిట్‌ కోల్పోయారు.

తెలంగాణ నేతల వ్యాఖ్యలు :
”తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న గ్రామీణుల కోర్కెను మదన్‌ మోహన్‌ విజయం ప్రతిబింబించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు రాజీనామా చేసి ప్రజా సమితిలో చేరాలి. ఇక ఏమాత్రం జాగు చేయకుండా ప్రధాని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి” అని శాసన సభ్యులు మాణిక్‌ రావు వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయాన్ని తమ ప్రకటనలో వి.బి. రాజు, ఎస్‌.బి. గిరి, రాందేవ్‌, వెంకటస్వామి, టి. అంజయ్య, ఎం.ఎం. హషీమ్‌, మునీల్‌ జమాల్‌ తదితరులు వ్యక్తం చేశారు.

Other Updates