తెలంగాణలో ప్రతిభకు కొదవలేదని రాష్ట్ర యువత జాతీయస్థాయిలో మరోసారి నిరూపించారు. 2019లో నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల్లో 40 మంది తెలంగాణ యువతీ, యువకులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 829 మంది ఎంపిక కాగా అందులో 40 మంది మన రాష్ట్రం వారే కావడం మనకు గర్వకారణం. ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ యువకులు ఎంపిక కావడం ఎస్సీ, ఎస్టీల్లో విద్యా చైతన్యం వెల్లివిరుస్తోందనడానికి నిదర్శనం. ఇందులో కొందరు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం,


కూలీ చేసుకునే తల్లితండ్రులు, సివిల్స్‌ సాధించిన యువకుడు
తల్లితండ్రులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ కుమారున్ని మాత్రం పై చదువులు చదివించారు. తల్లితండ్రులు కష్టానికి ఫలితంగా వారి కుమారుడు నరేష్‌ 2019 సివిల్స్‌లో ర్యాంకు సాధించారు. జయశంకర్‌ భూపాపల్లి జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఆకునూరి నరేశ్‌ ఆల్‌ ఇండియా సివిల్స్‌లో 782వ ర్యాంకు సాధించారు. నరేశ్‌ భూపాపల్లి మున్సిపల్‌ పరిధిలోని కాశీంపల్లికి చెందిన ఆకునూరి సులోచన, ఐలయ్య అనే నిరుపేద దంపతులకు రెండవ కుమారుడు. నరేశ్‌ తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ కుమారుడ్ని చదివించారు. కుమారుడు పట్టుదలతో చదివి సివిల్స్‌ ర్యాంకు సాధించడం చూస్తుంటే ప్రతిభకు పేదరికం అడ్డురాదని స్పష్టమవుతున్నది.

పాత్రికేయుడి కుమారుడికి 77వ ర్యాంకు
సీనియర్‌ జర్నలిస్టు ప్రసూన కుమారుడు, కట్ట రవితేజకు 77వ ర్యాంక్‌ వచ్చింది. ఖమ్మం జిల్లా గార్ల మండలానికి చెందిన ఆయన విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. తమ విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని రవితేజ తెలిపారు.

హైదరాబాద్‌లో కోచింగ్‌ కలిసొచ్చింది
428 ర్యాంకర్‌ కొల్లాబత్తు కార్తీక్‌ బాంబే ఐఐటీలో బీటెక్‌ పూర్తిచేశారు. టాటా స్టీల్స్‌ జంషెడ్‌పూర్‌లో ఉద్యోగానికి రాజీనామాచేసి హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. ఇక్కడ కోచింగ్‌ బాగా కలిసొచ్చిందని కార్తీక్‌ తెలిపారు.

ఏడో ప్రయత్నంలో 764 ర్యాంక్‌
764వ ర్యాంకర్‌ కె.శశికాంత్‌ది మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఒక చిన్న పల్లెటూరు. సివిల్స్‌ కోసం ఎంతో కష్టపడ్డానని, పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదులుకున్నానని శశికాంత్‌ చెప్పారు.

తనకు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) వస్తుందని ఆశిస్తున్నానని శశికాంత్‌ చెప్పారు. తండ్రి గతంలోనే మరణించారని, తల్లి అన్నీ తానై తనను చదివించారన్నారు.

కానిస్టేబుల్‌ కుమారుడికి 516 ర్యాంకు
సిద్ధిపేట పోలీసు కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కుమారుడు వినయ్‌కాంత్‌ సివిల్స్‌లో 516వ ర్యాంకును సాధించాడు. ఏడాది క్రితం వరకు రాజ్యసభ సెక్రటరీ సెక్రటేరియట్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ సివిల్స్‌కు ప్రిపెరై ర్యాంకును సాధించారు.

గిరిజన బిడ్డకు 741వ ర్యాంక్‌
వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన భూక్య గన్య, భద్రమ్మ కుమారుడు నర్సింహస్వామి సివిల్‌ సర్వీసులో 741వ ర్యాంకు సాధించారు.

సింగరేణి కార్మికుడి కుమారుడికి సివిల్స్‌
మంచిర్యాల జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు దరిపెల్లి రాజమ్లు, పుష్ప కుమారుడు రమేశ్‌ సివిల్‌లో 690వ ర్యాంక్‌ సాధించారు. 2014 నుంచి సివిల్స్‌ రాస్తూ నాలుగోసారి 690 ర్యాంక్‌ సాధించాడు.

బెల్లంపల్లివాసికి 330 ర్యాంక్‌ మంచిర్యాల
జిల్లా బెల్లంపల్లికి చెందిన సింగరేణిలో ఎలక్ట్రీషియన్‌ సత్యనారాయణ కుమారుడు సంకీర్త్‌ సివిల్‌లో 330 ర్యాంక్‌ సాధించారు. సివిల్స్‌ సాధించేవారు 24 గంటలు కష్టపడి చదవాలన్న నియమమేమీ లేదని, మనం ఎలా చదివాం అన్నదే ముఖ్యమని సంకీర్త్‌ చెపుతున్నారు.

మాజీ ఎంపీ రాథోడ్‌ కుమారుడు..
ఆదిలాబాద్‌ మాజీఎంపీ రాథోడ్‌ రమేశ్‌ చిన్న కుమారుడు రాథోడ్‌ రాహుల్‌ 745 ర్యాంకు సాధించారు.

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన బానోతు మృగేందర్‌లాల్‌ సివిల్‌లో 505వ ర్యాంకు సాధించారు. ఆయన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు. గతేడాది సివిల్‌లో 551వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందారు. ప్రొబెషనరీగా మహారాష్ట్రలోని నాసిక్‌లో సేవలు అందిస్తున్నారు.

Other Updates