తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సివిల్స్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువకుడు దురిశెట్టి అనుదీప్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఖమ్మంలోని జయనగర్‌కు చెందిన కోయ శ్రీహర్ష ఆరోర్యాంకు సాధించారు. వీరితో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి 144వ ర్యాంకు, కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్ 393వ ర్యాంకు, మామునూరు ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎడవెల్లి దయాకర్ కుమారుడు ఎడవెల్లి అక్షయ్ 624వ ర్యాంకు, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బల్ల అలేఖ్య 721వ ర్యాంకు, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు 724వ ర్యాంకు సాధించారు. రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన యువతీ, యువకులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన అనుదీప్‌కు ఐటీ, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితలు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రతిభావంతులకు నిలయమని అనుదీప్ నిరూపించారన్నారు.
2017-సివిల్‌సర్వీసెస్ ఫలితాలలో దేశంలోనే మొదటిర్యాంకు సాధించిన అనుదీప్ హైదరాబాద్‌లో జీఎస్‌టీ సహాయ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2013లో సివిల్స్ పరీక్షలు వ్రాసి ర్యాంకు సాధించి రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. కేంద్ర వాణిజ్య పన్నుల విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అనుదీప్ 2012 సంవత్సరం నుంచి వరుసగా అయిదు పర్యాయాలు సివిల్స్ పరీక్షలు వ్రాయగా 2017లో నిర్వహించిన పరీక్షల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించగలిగారు. ఐఆర్‌ఎస్ శిక్షణ సమయంలోనే మంచి ప్రతిభ కనబరచి అవార్డు అందుకున్నారు. క్రీడలు, జనరల్ నాలెడ్జ్ పోటీల్లోను జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి ర్యాంకు సాధించడం ఎంతో సంతృప్తి ఇచ్చినట్లు తెలిపారు. తన విజయం తెలంగాణలోని మరింతమంది యువకులకు స్పూర్తిదాయకం కావాలని ఆయన ఆకాం క్షించారు. అనుదీప్ తండ్రి మెట్‌పల్లిలో విద్యుత్‌శాఖలో ఏఈఈ గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి గృహిణి. ఈ సందర్భంగా తల్లితండ్రులు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తమ కుమారుడు పడిన శ్రమకు ప్రతిఫలమే ఈ మొదటి ర్యాంకు అన్నారు.