రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సాధించడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సఫలీకృతులయ్యారు. తెలంగాణలోని అప్పటి 10 జిల్లాలలో 9 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి, జిల్లాకు రూ. 50 కోట్లు మంజూరుకు అంగీకరించింది. కానీ ఆ నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ముఖ్యమంత్రి డిసెంబరు 8న ఢిల్లీ పర్యటన సందర్భంగా బకాయలు విడుదల చేయవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. ఫలితంగా డిసెంబరు 20న ఈ బకాయిలు రూ. 450 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేసీఆర్ ఢిల్లీలో డిసెంబరు 8న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి వెనకబడిన జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రాష్ట్రాలోని తొమ్మిది జిల్లాలకు రూ. 450 కోట్లు ప్రతి సంవత్సరం రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ఒక్క సంవత్సరంలో మాత్రమే వచ్చాయని, ఈ సంవత్సరానికి బకాయలు విడుదల కాలేదన్నారు. తొలి విడతలో ఇచ్చిన రూ. 450 కోట్లకు సంబంధించి వినియోగ ధృవీకరణ పత్రాలను ఇప్పటికే కేంద్రానికి అందచేసినట్లు సీఎం వివరించారు. అయినా రెండవ విడత నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నదని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించి వెంటనే రెండవ విడత నిధులను విడుదల చేయాలని, ఎలాంటి జాప్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు నిధులు విడుదల అయ్యాయి.
ఇబ్రహీంపూర్ గురించి వివరించిన కేసీఆర్
దక్షిణభారత దేశంలోనే తొలి నగదురహిత గ్రామంగా గుర్తింపు పొందిన సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి వివరించారు. మంత్రి హరీష్‌రావు దత్తత తీసుకున్న ఈ గ్రామం ఇప్పటికే పారిశుధ్యం, సౌరవిద్యుత్ వినియోగంలో ప్రత్యేక గుర్తింపుపొందిందని వివరించారు. సుమారు 1200 మంది జనాభా కలిగిన ఇబ్రహీంపూర్‌లో ప్రతి ఒక్కరికీ నగదురహిత లావాదేవీల గురించి తెలియచేయడం జరిగిందని వివరించారు. బ్యాంకు అధికారులతో ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు శిక్షణ ఇప్పించడం జరిగిందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి కొత్త ఖాతాలు తెరిపించినట్లు తెలిపారు. అందరికీ రూపే కార్డులు ఇప్పించడం, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం చేశామన్నారు.
సంచార ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలా పలు విధాలుగా చేసిన కృషి ఫలితంగా ఇబ్రహీంపూర్ గ్రామం నగదురహిత గ్రామంగా ఆరిర్భవించిందని కేంద్ర మంత్రికి కేసీఆర్ వివరించారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఇబ్రహీంపూర్ నగదురహిత గ్రామంగా తయారుచేసినందుకు సీఎం కేసీఆర్‌ను, మంత్రి హరీష్‌రావును అభినందించారు. అనంతరం రాష్ట్రంలో పెద్ద నోట్ల రద్దు తరువాత జరిగిన ఇబ్బందులు, తదనంతర పరిణామాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం, వచ్చే బడ్జెట్‌పై పడే ప్రభావాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, కేశవరావు, వినోద్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.