అంతర్జాతీయ సినిమా వేడుకలు జరిగినప్పుడు మనం ఒక మాట వింటుంటాము. అందులో ప్రదర్శింపబడే కొన్ని సినిమాలు చూసినపుడు సినిమా తీయబడిన ప్రాంతం సంస్కృతిని, సంప్రదాయాన్ని, ప్రగతిని అన్నింటిని అంచనా వేయవచ్చు. నిజమే ముఖ పత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేసినట్టు సినిమాను చూసి ఆ ప్రాంతం యొక్క సంస్కృతి ఎలా ఉంటుందో చెప్పవచ్చు.

మరి మన ప్రియతమ నాయకుడు తెలంగాణా జాతిపిత కార్య సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించక పూర్వం తెలుగు సినిమా ద్వారా చూపించే కథాంశము, భావోద్వేగాలు, సంభాషణలు చూడటం ద్వారా తెలంగాణా సంస్క తి సాంప్రదాయాలు, బాష, యాస తెలిసేవా? తెలుగు సినిమాలో తెలంగాణా ఉండేదా ?.. లేదు అనే చెప్పాలి. అయితే తెలంగాణా భాషలో యాసలో బి.నరసింగరావు రూపొందించిన మాభూమి, ఆర్‌.నారాయణమూర్తి రూపొందించిన వీర తెలంగాణా, యన్‌. శంకర్‌ జైబోలో తెలంగాణా పోరాట యోధుడి బయోపిక్‌ కొమరం భీమ్‌ ఎనుముల ప్రేమరాజ్‌ తీసిన డాక్యుమెంటరీ చిత్రం ప్రజాకవి కాళోజి రఫి తీసిన ఇంకెన్నాళ్ళు టి. ప్రభాకర్‌ బతుకమ్మ, సానా యాదిరెడ్డి పిట్టల దొర వంటివి ఇలా వేళ్ళపైన లెక్కించ తగ్గ సినిమాలు ఇందుకు మినహాయింపు అనుకోవాలి.

ఆ నాడు తెలుగు వారి అసంబ్లీలోనే కాదు తెలుగు సినిమాలోనూ తెలంగాణా అంశం నిషిద్ధమే. కానీ కాలం మారింది. దృక్పథం మారింది దాంతో తీసే విధానం మారింది. సినిమాలు చూసి సమాజం నేర్చుకోడం కాదు .. మారుతున్న సమాజాన్ని సినిమా అనుసరించింది. రచయితలు దర్శక నిర్మాతలు మారక తప్పలేదు.

ఒక నాడు అసంబద్ధమైన హాస్యానికి ప్రతినాయకుల అపహాస్యానికి వాడబడిన తెలంగాణా యాస, ఈనాడు హీరో హీరోయిన్ల నోట మాటల తూటాలై తెలుగు ప్రజలందరిని రంజింప చేస్తుంది. నిజామాబాద్‌ లో చిత్రీకరించ బడి తెలంగాణా యాస భాషతో అపూర్వ విజయం సాధించిన శేఖర్‌ కమ్ముల ఫిదా.. తెలంగాణా అంశానికి మార్కెట్‌ తీసుకు వచ్చింది. తెలంగాణా యాసలో పలికిన సంభాషణలకు జాతీయ అవార్డు సాధించుకున్న యువతరం చిత్రం పెళ్ళి చూపులు, తెలంగాణా అనేది తెలుగు సినిమాని పరిపుష్టం చేసిందని ఆ ప్రభావం యువ దర్శకుల మీద రచయితల మీద ప్రధాన తారాగణం పైనా ఎంతో ఉంది.

తెలంగాణా సమాజంలో వచ్చిన మార్పుని సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను అగ్ర కథానాయకులు అనుసరించారు. మహేష్‌ బాబు మహర్షి, రైతు జీవితాన్ని వెలుగు లోకి తీసుకువచ్చింది. హరితహారం వలన పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో చూపించిన జూనియర్‌ యన్టీఆర్‌ సినిమా జనతా గ్యారేజ్‌, ఇటీవల అఖండ విజయం సాధించి దిల్‌ రాజు సినిమా ఎఫ్‌ టు హీరో తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇలా అసలు సినిమాకే పనికి రాదు అనుకున్న తెలంగాణా సినిమా విజయానికి ఆధారం అని భావించే స్థితికి పెద్ద నిర్మాతలు దర్శకులు కథానాయకులు తెలుసు కోవడం ఒక మంచి పరిణామం.

అంటే తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన జనరంజకమైన పాలన.. పర్యావరణము, జల వనరులు, రైతు సంక్షేమ కార్యక్రమాలు వ్యవసాయరంగానికి ప్రోత్సాహకాలు పెన్షన్‌లు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ తెలంగాణా సమాజంలో అంతర్భాగమై శక్తివంతంగా ప్రజల జీవితాల్లోకి వెళ్ళడం వల్ల ఆ మార్పు సినిమాల్లోనూ ప్రతిబింబించింది. ఎందుకంటే సినిమా అనేది అబద్దంలా ఉండకూడదు సమాజానికి అద్దంలా ఉండాలి.అది కళాత్మక చిత్రమైనా వాణిజ్యపరంగా నిర్మించబడే పెద్ద హీరోల సినిమా అయినా ఇది పరోక్షంగా తెలంగాణా ప్రభుత్వం సినిమా రంగం మీద చూపిన ప్రభావం. అలాగే సినిమా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎంతో అవగాహన ఉంది. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఒక అభివద్ధిని సాధించే ఒక ప్రణాళిక ఉంది.

కనుకనే సినిమా రంగం పట్ల లోతైన అవగాహన ఉన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ని రెండవ సారి సినిమాటోగ్రఫి మంత్రిగా నియమించారు. సినిమారంగంలోని అన్ని శాఖల పైన అన్నిఅంశాల మీద పట్టు ఉన్న మంత్రి ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు గ్రహించి సినిమా రంగానికి ఒక మార్గ నిర్దేశనం చేశారు. అయితే సినిమా రంగంలో తెలంగాణా సినిమాకు సబ్సిడిలాంటి ప్రోత్సహకాలు. బాలల చిత్రాలను ప్రోత్సహించే విధంగా పాతిక నుండి యాభై లక్షల వరకు సబ్సిడీ .. సినిమా రంగంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఏర్పాటు ..మినీ థియేటర్లకు సంబందించిన విధి విధానాల రూపకల్పన చేయడం జరిగింది.

అలాగే ప్రత్యేకంగా తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఏర్పడింది. నిర్మాణ పంపిణీ రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న పి.రామ్మోహనరావు ఛైర్మన్‌ ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమా రంగంలో అందరి వాడు అనిపించుకున్నారు.

2017 లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహింపబడిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహణ అద్భుతంగా జరిగింది. తెలంగాణా ప్రభుత్వ నిర్వహణా సామర్ధ్యానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు …పిల్లల సినిమాల గురించి తెలంగాణా రాష్ట్రంలో బాలల చిత్రాలు .. రూపొందే విధంగా తెలంగాణా రాష్ట్రంలో నిర్మించబడే బాలల చిత్రాలకు ఇరవై ఐదు నుండి యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది ఏఫ్‌ డిసి.

అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణా ఫిలిం ఇన్సిటిట్యూట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇది ఏర్పడితే తెలంగాణా రాష్ట్రంలోని మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం సినిమా రంగంలోని ఇరవై నాలుగు శాఖలకు సంబంధించిన శిక్షణ తద్వారా ఉపాధి లభిస్తుంది.

అదే విధంగా గతంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణా లోని టూరిజం ప్రాంతాలు .. రామప్ప, లక్నవరం, వేయిస్థంభాల గుడి కుంటాల జలపాతం ఇలా ఎన్నో దర్శనీయ స్థలాలు సినిమాషూటింగ్‌లతో కళకళ లాడాలని తలచిన ప్రభుత్వం ఆయా ప్రాంతాలను వేగంగా అభివద్ధి చేస్తూ వస్తోంది. ఆలయాలు

ఆరామాలు, చర్చిలు, మసీదులే కాదు .. జల కళతో పవరళ్ళు తొక్కే కాళేశ్వరం సందర్శకులతో ఒక సుప్రసిద్ధ యాత్రాస్థలమైంది. అలాగే తెలంగాణా రాష్ట్రంలో అత్యాధునికి సదుపాయాలతో మరిన్ని స్టూడియోల నిర్మాణం జరగాలని ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఆ రకంగా దేశంలోనే అన్ని భాషల సినిమాలకు హైదరాబాద్‌ హబ్‌ కావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం.

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ … ఆర్థిక పరిపుష్ఠి కలిగిన రంగం యానిమేషన్‌ రంగం. ఒక గ్లోబల్‌ స్టాండర్డ్ప్‌తో అత్యద్భుతమైన యానిమేషన్‌ స్టూడియోకు అంకురార్పణ కూడా జరిగింది.

ఇవి కాకుండా రవీంధ్రభారతి వేదికగా భాషా సాంస్కతిక శాఖ సంచాలకుడు మామిడి హరికష్ణ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న సినీవారం.. సండే సినిమా.. సినిమా అవగాహన సదస్సులు వంటివి మంచి ఫలితాలిస్తున్నాయి. ఎందరో యువ దర్శకులకు కొత్తగా సినిమా రంగానికి వచ్చే వారికి ఎంతో ఉపకరిస్తున్నాయి.

తెలంగాణా సినిమాను సమాజం ఎంత గౌరవిస్తుందో అంత గౌరవం ప్రభుత్వం కూడా ఇస్తోంది. గత యేడాది తెలంగాణా ఆవిర్భావ దినోత్సం సందర్భంగా అధికారికంగా తెలంగాణా సినిమాలను ప్రదర్శించారు. అలాగే పోటీ పరిక్షల్లోనూ పాఠ్య పుస్తకాల లోనూ తెలంగాణా సినిమాను గురించిన ప్రస్థావన ప్రముఖంగా ఉండటం చాలా సంతోషించతగ్గ విషయం. ఇట్లా తెలంగాణారాష్ట్రంలో సినిమా రంగం అభివద్ధి పట్ల

ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఆపేక్ష మనకి అర్థమవుతుంది. సినిమా రంగానికి ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది .. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది.

అట్లనే తెలంగాణా సమాజం పట్ల సినిమా రంగం కూడా చేయవలసింది, రుణం తీర్చుకోవలసింది చాలా ఉంది.
– అల్లాణి శ్రీధర్‌

Other Updates