సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈవోడీబీలో 98.33 శాతం మార్కులతో తెలంగాణ సత్తా చాటింది. తాజా ర్యాంకు రాష్ట్రంలో వేగవంతమైన పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం.
పారిశ్రామికరంగాన్ని ప్రొత్సహించే క్రమంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ ర్యాంకులను ప్రకటించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, తనిఖీలు, సింగిల్ విండో విధానం, పరిశ్రమలకు స్థలాల లభ్యత, కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతుల విధానం, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ, పారదర్శకత, సమాచార లభ్యత, కార్మిక విధానాలు, తదితర 12 అంశాల్లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకొని ఈవోడీబీ ర్యాంకులను కేటాయిస్తారు.
సులభతర వాణిజ్య ర్యాంకింగ్స్‌లో గతేడాది తెలంగాణ ప్రథమస్థానంలో ఉండగా, ఈ ఏడాది కేవలం 0.09 శాతం తేడాతో ద్వితీయ స్థానం పొందింది. మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. 3,4,5 ర్యాంకులను వరుసగా హరియాణా, జార్ఖండ్, గుజరాత్ లు పొందాయి.కాగా, వ్యాపార సంస్కరణల కార్యాచరణ అమలులో 100 శాతం మార్కులతో తెలంగాణ దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్99.73 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే సంస్కరణల అమలుపై వివిధ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్‌లో తెలంగాణ 83.95 శాతం మార్కులతో ఆంధ్రప్రదేశ్ (86.5 శాతం మార్కులు) కంటే కొంత వెనుకబడటం వల్లే ఈవోడీబీ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం పొందలేకపోయింది.
“నాలుగేళ్లలో 53 కొత్త పారిశ్రామిక పార్కులు 1132 పరిశ్రమల ఏర్పాటు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు”
ఈవోడీబీలో కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉంటూ దేశ పారిశ్రామికాభివ్రద్ధికి దిక్చూచిగా మారడం గర్వకారణం. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కషి చేస్తున్నారు.ఈ రంగంలో ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక విధానాల వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో సరళీకరణ విధానాలను అవలంబించి నూతన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్)ను అమల్లోకి తీసుకురావడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడింది. దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తెచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా సింగిల్‌విండో విత్ అవుట్ గ్రిల్స్ పద్ధతిన కేవలం 15 రోజుల్లో సెల్ఫ్ డిక్లరేషన్‌పై పరిశ్రమల ఏర్పాటుకు అన్నిరకాల అనుమతులను ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.
పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కార్యదక్షత ఫలితమే సులభ వాణిజ్య ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేర్కొన్నారు. తాజా ర్యాంకును సాధించినందుకు పరిశ్రమలశాఖ, టీఎస్ ఐఐసీ అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రశంసించారు.
టీఎస్-ఐపాస్ రాకతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలో పారిశ్రామికరంగంలో గణనీయమైన అభివ్రద్ధిని సాధించింది. రాష్ట్రంలో మార్చి2018 వరకు 53 పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయని బాలమల్లు తెలిపారు.580 ఎకరాలలో 1132 పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పడం జరిగింది. దీంతో ఈ పరిశ్రమల ద్వారా రూ.3,815 కోట్ల పెట్టుబడులు రాగా, 32,726 మందికి ప్రత్యక్ష్యంగా, 1,45,683 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయని బాలమల్లు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు పరిశ్రమలశాఖ మంత్రి కె.టి. రామారావు దేశ,విదేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలకు, ఎన్‌ఆర్‌ఐలకు టీఎస్-ఐపాస్ విశిష్టతలను వివరించి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను రాబడుతున్నారు. మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగానే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ సంస్థలు, మేటి పరిశ్రమలు, బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.
టీఎస్-ఐపాస్ కింద పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే వేలాది దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ప్రభుత్వ ప్రాధాన్యతలు, అర్హతలకు అనుగుణంగా పరిశ్రమలకు, సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు టీఎస్-ఐఐసీ భూములను కేటాయిస్తోందన్నారు. ఐటీ, ఫార్మా, మెడికల్ డివైజెస్, ఎంఎస్ ఎంఈ, ఆగ్రో, ఫుడ్ ప్రాసెస్, ఏరో స్పేస్ రంగంలో ఇప్పటికే తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఈ రంగంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు పోటీపడుతున్నారని తెలిపారు. దీంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో భూములకు డిమాండ్ పెరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి పనికిరాని భూములను పరిశ్రమలకు ఉపయుక్తంగా 1.45 లక్షల ఎకరాలను గుర్తించి టీఎస్‌ఐఐసీ రిజర్వు చేసిందన్నారు.
తెలంగాణలో ఉన్న భౌగోళిక, వాతావరణ, శాంతిభద్రతల పరిస్థితుల అనుకూలతతో పాటు సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వం, మంత్రి కె.టి.ఆర్ కషి, ప్రత్యేక చొరవ కారణంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన గూగుల్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఊబెర్, లాంటి ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే కాలంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం హబ్‌గా మారడం ఖాయం.