artచేయితిరిగిన చిత్రకారుడు జయంత్‌ కుంచెలో సృజనాత్మకత పాలెక్కువ. వాస్తవానికి ఆయన వాస్తవ వాద చిత్రకళారీతిలో తర్ఫీదుపొంది పట్టాలు సాధించినా, ఇవాళ ఆయన వివక్త రూపాలకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ఒకానొక ప్రత్యేక స్థానాన్ని చిత్రకళాలోకంలో పదిలంచేసుకున్నాడు.

వెంట్రుకలున్న కొప్పు ఎలాచుట్టినా అందమే అన్నట్టుగా చిత్రకళా మెళకువలు అవగాహన చేసుకున్న జయంత్‌ సమకాలిన ప్రపంచంలోని ఆకృతులకు భిన్నంగా తన మదిలో మెదిలే అను భూతులకు అనుగుణంగా వివక్తరూపాలను ఆవిష్క రిస్తున్నాడు. ఆ ప్రక్రియలో ఆరితేరిపోయాడు.

తీసుకున్న వస్తువులోని సౌందర్యాన్ని, సారాన్ని రంగులలో రేేఖలలో మేళవించి నిజాకృతులు అట్టే కన్పించకుండా ప్రాతికాల్పనికేతరంగా 1910లో తొలి వివక్త చిత్రాన్ని నీటి రంగులలో చిత్రించాడు. అయితే ఈ ధోరణి చిత్రాలను జాక్‌సన్‌ పొల్లాక్‌ పలచని రంగులతో, చుక్కలు చుక్కలుగా నాలుగు పక్కల చిలకరించి పలచని అల్లికలాగా చిత్రాన్ని రూపొందించి యుగకర్తగా గర్తింపు పొందాడు.

తీక్షణమైన భావోద్రేకంతో చిత్రిస్తూ, ఒక రంగుతో ఇంకొకరంగు కలిపి సందర్భంలో ఏర్పడే రూపాల అందచందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. అయితే ఈ చిత్రాలేమిటి, ఇవి సృజనకు మరోపేరు అనే చిత్రకళా ప్రేమికులు ఉన్నట్టే, అబ్బే! ఇవేమి చిత్రాలని పెదవి విరిచే ప్రేక్షకులూ ఉంటారు.

నిజానికి అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రాలను నైరూప్య చిత్రాలని ఇంతకాలం తెనిగించడం తప్పు. ఎందుచేతంటే ఈ చిత్రాలకు కూడా ఏదో ఒక రూపం ఉంటుంది. కాబట్టి నైరూప్యమని ఎలా అంటారు? వాటిని అనువదించిన చిత్రాలు అనవచ్చు. నిజానికి వివక్త చిత్రాలు అనాలి. వివక్త అంటే విభిన్నమైన , వివేకమైన. విడదీయబడిన అనే అనేక అర్థాలున్నాయి. ఇంతేకాకుండా విషయంతో వివక్త చిత్రాలన్నింటిలోనూ తీవ్రమైన భావోద్వేగం కన్పిస్తుంది.

కాయకష్టంచేసి బతుకు బండి లాగే దంపతులు లక్ష్మణ్‌, రాములమ్మల కడుపున పుట్టిన జయంత్‌ చాదర్‌ఘాట్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజులలో గురువు హెచ్‌వి శర్మ ప్రభావం ఆయనపై పడింది. శర్మకు చిత్రలేఖనంతోపాటు రాని విద్య అంటూ ఉండేది కాదు. ఆయన జయంత్‌ చిత్రించే బొమ్మలు చూసి ఆ రంగంలో కృషి చేసేందుకు ఎంతగానో సహకరించాడు. ఆ తర్వాత స్థానికంగా ప్రసిద్ధ చిత్రకారుడైన డోంగ్రే వద్ద చేరి శాస్త్రీయంగా శిక్షణపొందాడు. ఆయనే బొంబాయిలో చిత్రలేఖన విద్యలో డిప్లొమా చేసేందుకు దోహదం చేశాడు. తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మా నాన్నలతోపాటుగా శర్మ సార్‌కు, డోంగ్రే గారికి ఎంతో రుణపడి ఉన్నానంటాడు జయంత్‌.

ఒక వంక పాఠశాల విద్య పూర్తిచేసి పి.యు.సి చదవడం, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేయడం. ప్రైవేట్‌గా ఇంగ్లీష్‌ ఎంఏలో ఉత్తీర్ణుడు కావడంతోపాటుగా మరోవంక బొంబాయిలో జే.జే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో ఐదేండ్ల డిప్లొమా పూర్తిచేయడం. అనంతరం బరోడా ఎంఎస్‌ విశ్వవిద్యాలయంలో కె.జి.సుబ్రహ్మణ్యం వద్ద కుడ్యచిత్రకళలో పి.జి.డిప్లొమా పూర్తిచేయడం సాధారణమైన విషయంకాదు. ప్రస్తుతం జనసమ్మర్థమైన హిమాయత్‌నగర్‌ ప్రాంతంలో, గజం స్థలం ఖరీదు రెండు రూపాయలున్నపుడు, ఎందరు స్నేహితులు బలవంతంచేసినా, స్థలం కన్నా మా కొడుకు చదువే ముఖ్యమని ప్రతినెలా రెండు వండల రూపాయలు బొంబాయికి పంపడానికి పస్తులు పడుకుని తనకు చదువు చెప్పించి, పండంటి జీవితమిచ్చిన అమ్మానాన్నలను మరువలేదు. వారి ఆశయం మేరకు జయంత్‌ ఉద్యోగరీత్యా దూరదర్శన్‌ నుంచి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా అమ్మానాన్నల మనసుశాంతికి ‘భారతీయ సంస్కృతి వికాసానికి, పరిరక్షణకు టెలివిజన మాధ్యమంలో సంగీత నృత్యరూపకం’ అనే అంశపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా సాధించారు.

చిత్రలేఖన విద్యాశిక్షణ పూర్తయిన తర్వాత వాస్తవవాద చిత్రాలు ముఖ్యంగా, ప్రముఖుల ముఖచిత్రాలు వేస్తున్న తరుణంలో మెథడిస్ట్‌ స్కూల్లో మూడేళ్ళపాటు చిత్రకళను బోధించే ఉపాధ్యాయుడుగా పని చేశాడు.

కొంతకాలం ఆయన గురువు శర్మగారు సుప్రసిద్ధ నాటక ప్రయోక్త ఏఆర్‌ కృష్ణతోపాటు నాట్య విద్యాలయాలలో పనిచేస్తుంటే జయంత్‌ క్రియేటివ్‌ డిజైనర్‌గా పనిచేశాడు.

ఇది ఇట్లా ఉండగానే 1963లో నగరంలోని యూఎస్‌ఐఎస్‌లో తొలి వ్యష్టి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేసి తనలోని చిత్రకళా ప్రతిభను చాటాడు. తాను బొంబాయిలో నేర్చుకున్న వాస్తవవాద చిత్రలేఖనరీతితోపాటు లైన్‌ డ్రాయింగ్‌లు, స్కెచ్‌లు కూడా ప్రదర్శనలో పెట్టి ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత హైదారాబాద్‌ నగరంలోనే కాక బెంగళూరు, త్రివేండ్రం లాంటి నగరాల్లో పలుమార్లు వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ మరెన్నో సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో, శిబిరాలలో పాల్గొని తన ముద్రను ప్రస్పుటంచేశాడు. ఉపగ్రహ దూరదర్శన్‌ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభించినప్పుడు 1972లో ఒక వంక చిత్రకళతో, మరోవంక నాటక కళలోగల ప్రవేశం వల్ల జయంత్‌ సీనిక్‌ డిజైనర్‌గా ఎంపికయ్యారు. స్టూడియోలో ఎప్పటికప్పుడు విషయానుకూలమైన నేపధ్యాన్ని రూపొందించారు. కొంతకాలానికి సెటిటైట్‌ అమర్చినవారు ఆ సౌకర్యం కొనసాగించాలా? లేదా అనే అంశాన్ని మదింపు చేయడానికి ‘నాసా’ నుంచి వచ్చారు. స్టూడియోలో కాకుండా ఎల్‌ బి నగర్‌లో కార్యక్రమం ఏర్పాటు చేసి ఒగ్గుకథ, జానపదనృత్యాలు ఇత్యాది కార్యక్రమాలు ప్రదర్శిస్తే అవి అక్కడి నుంచి ప్రసారమై కొనసాగింపుకు అనుమతి సాధించారు. ఆ తర్వాత స్వయం ప్రతిపత్త్తిగల దూరదర్శన్‌ కేంద్రం ఏర్పాటైన తర్వాత సీనిక్‌ డిజైనర్‌గా ఎంపికై 1980లో పూనా ఫిలిం ఇన్టిట్యూట్‌లో ఆరు మాసాలు శిక్షణ పొందారు. ఆ సమయంలోనూ తీరిక సమయాల్లో అలనాడు ఆయన కె.హెచ్‌.ఆర్‌ బెంద్రే, సుజా లాంటి చిత్రకారులు బొమ్మలు వేయడానికి పడే వేదనను మరవకుండా. ముంబాయిలో చదువుకున్న రోజుల్లో స్థానిక చిత్రకారుల స్టూడియోలు సందర్శించి గమనించిన అంశాలను మరవకుండా తాను ఆచరణలో పెట్టి చిత్రాలు గీశాడు. చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు.

ఆ తర్వాత కాలంలో దూరదర్శన్‌లో ప్రయోక్తగా ఎంపికై మళ్ళీ ఆరుమాసాలు పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పేరిన్నికగన్న తమాషా, లావణీలను రికార్దుచేసి తన ప్రత్యేకతను చాటాడు. తొలుత జే వి సీ కెమరాతో ఇరవై నిమిషాలు నిడివిగల తెలుగునాటకం ‘నేల’ను రంగుల్లో ప్రయోగాత్మకంగా చిత్రీకరించాడు. ఆ తర్వాత విశ్వకవి రవీంద్ర నాథ్‌టాగూర్‌ ‘ చండాలిక’, ప్రభాకర్‌ ‘కిరీటి’ లాంటి ఎన్నో నాటకా లు దూరదర్శన్‌కు అనుగుణంగా రూపొందించి ప్రసారం చేశాడు.

వృత్తిరీత్యా ఎంత తీరికలేకుండా ఉన్నా ప్రవృత్తి మరువకుండా సమకాలీన పరిస్థితులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వివక్త చిత్రాలెన్నో వేశాడు. తాను వేసే ప్రతి ఇతివృత్తాన్ని ప్రేక్షకులు అర్థం చేసు కోకపోవచ్చు. అంత మాత్రాన నా అనుభూతిని కొత్త పద్ధతులు, లోగడ ఎవరూ వేయలేని పద్ధతిలో వేయకుండా ఉండలేనని జయంత్‌ అంటారు. వేమన పద్యం అందరికీ అర్థమవు తుంది. ” మనుచరిత్ర” ఎందరికి అర్థమవుతుంది? అట్లాగే చిత్రకళ కూడా చిత్రాలు ఎప్పుడు చూసేవారు తన చిత్రాలను అర్థంచేసుకో గలరు. అంతేకాని నా అనుభూతిని, భావోద్వేగాన్ని తగ్గించుకుని చిత్రాన్ని వేయలేనంటాడు జయంత్‌. ఒక్కొక్క వివక్త చిత్రకారుడిది ఒక్కొక్క రీతి. దానికోలెక్క ఉంటుంది, దానికో వ్యాకరణం ఉంటుంది.

ఈయన వేసిన చిత్రాలకు ఆంధ్రప్రదేశ్‌లో లలితకళా అకాడమీ, హైదరాబాద్‌లో ఆర్ట్‌ సోసైటీ, భారత కళా పరిషత్‌, న్యూఢిల్లీ భారత్‌ ఎక్సలెన్స్‌ ఆఫ్‌ న్యూఢిల్లీ, ఆల్‌ ఇండియా ఫైన్‌ ఆర్ట్స్‌ ఆండ్‌ క్రాఫ్ట్‌ సొసైటీ అవార్డులు వచ్చాయి.

ఇంకా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, భారత్‌జెలో పురస్కారం, రాజాజీ చిత్రకళా పరిషత్‌ వారి భగీరథ స్మారక పురస్కారం జయంత్‌ చిత్రకళా పరిణతికి మచ్చుతునకలు. తనలోని నిగూడలోకాలను అలౌకికానందాన్ని వ్యక్తంచేస్తూ అర్థవివక్త(సెమీ అబ్‌స్టాక్ట్‌) చిత్రాలు గీసి బెంగళూరులో ప్రదర్శించే ఆలోచన ఉందని నిరంతర సృజనశైలి జయంత్‌ చెప్పారు.
టీ . ఉడయవర్లు

Other Updates