పంకజ్ ‘సెల్’ వంక చూడడం గంటలో 10వ సారి. పరీక్షలకోసం చదవాల్సింది చాలా వుంది, కానీ ఎంత వద్దనుకున్నా పదే, పదే.. ‘సెల్‌ఫోన్’ చూస్తూనే వున్నాడు. ఇలా చూడడం చాలా చిరాకుగా వుంది.. ”ఎందుకిలా సెల్‌ఫోన్ చూడకుండా నేను ఉండలేక పోతున్నాను.. నాకు పరీక్షలు చాలా ముఖ్యం.. అయినా.. నేను ‘ఫోన్’ను వదలలేకపోతున్నాను. నా అపజయాన్ని నేనే తెచ్చుకుంటున్నాను”.. చాలా అసహనంగా తనలో తను తిట్టుకుంటున్నాడు. క్లాసులో పాఠం వింటున్నాడు. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్.. ప్రొఫెసర్ చాలా బాగా చెప్తున్నాడు.. మధ్యమధ్యలో ఫోన్ తీసి చూస్తున్నాడు మెహర్.. ఫేస్‌బుక్‌లో ఎవరో పెట్టిన కామెంట్‌కు.. రిప్లై ఇచ్చాడు.. తర్వాత అలా అలా.. తెలియకుండానే 20 నిమిషాలు గడిచిపోయాయి.. తలపైకెత్తి పాఠం వింటుంటె అస్సలు అర్థం కావట్లేదు.. అబ్బా! అని తల విదిల్చి.. ‘ఫోన్’ స్విచ్ ఆఫ్‌చేసి మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చి మళ్ళీ ‘ఆన్’ చేస్తాడు..
మీనా సీరియస్‌గా నెట్ బ్రౌజ్ చేస్తోంది.. వాళ్ళమ్మ రెండుసార్లు అరచి చెప్పింది. ఏమి ప్రాజెక్ట్ వర్క్‌లో ఏమో!.. ఇంత రాత్రి ఒంటి గంట అవుతుంది నిద్ర పోకుండా.. ఏమో చేస్తుంది.. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు.. చెప్పితే వినరు.. ‘మీనా’కు చిరాకేసింది.. ఏంటమ్మ పని చేసుకోనివ్వవు! అన్న తర్వాత తనకే అన్పించింది… ఏంటి.. నేను నా వర్క్ వదిలేసి అనవసరమైన సైట్స్ అన్నీ చూస్తున్నాను.. ప్చ్! అని కంప్యూటర్ వదిలేసి పడుకుంది.. కోపంగా..
రమేశ్ వాట్సప్‌లో వున్న ప్రశ్నాపత్రాలు డౌన్‌లోడ్ చేస్తున్నాడు 30 నిమిషాలనుండి.. పేరుకే ప్రశ్నాపత్రాలు కానీ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ చాటింగ్ ఇవ్వన్నీ నడుస్తున్నాయి. గంట తర్వాతగాని గుర్తుకు రాలేదు.. నేను చెయ్యాల్సిన పని ఇదికాదు.. పరీక్షలకోసం ప్రశ్నాపత్రాలు డౌన్‌లోడ్ చేసి వాటికి జవాబులు వెతకాలని.. వెంటనే చాటింగ్ ఆపి.. ప్రశ్నాపత్రాలను చదివే పనిలో పడ్డాడు..
చాలామంది విద్యార్థులు, పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న చాలామంది యువతీ, యువకులు దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్/ఐపాడ్/ఇపాడ్/ఇంటర్‌నెట్… అవసరానికి, నేర్చుకోవడం కోసం బాగానే వుంటుంది.. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగిస్తే మాత్రం చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఎంత సమయం కేటాయిస్తున్నామో కూడా తెలియనంత మాయలోకి తీసుకెళ్తుంది.. కాబట్టి చదువుకునే అంశాలు ఇంటర్‌నెట్/మొబైల్‌లోనుండి లేదా కంప్యూటర్‌లోనుండి తీసుకోవాలనిపిస్తే ముందుగా వాటిని డౌన్‌లోడ్ చేయడం లేదా? ప్రింట్స్ తీసకోవడం చేస్తే తప్ప చదువు సీరియస్‌గా కొనసాగే అవకాశం వుండదు. నిజానికి ఇలా మొబైల్స్‌కు/ఇంటర్‌నెట్‌కు ఎందుకు ‘బానిసలు’ అవుతారో చూద్దాం.
అడిక్ట్ కావడానికి కారణాలు:
ఖాళీ సమయంలో తనలో తను సమయాన్ని ఎలా గడపాలో తెలియకపోవడంవలన… మొబైల్‌లో ఆట ఆడడం.. ఏదైనా పాటలు వినడం.. లేదా ఏదైనా ఆసక్తికరంగా వున్న మెసేజ్‌లు చదవడంతో మొదలౌతుంది.
యాంక్సైటీతో బాధపడేవారు.. నిరంతరం ఏదో ఒక వ్యాపకం వుంటే దాని గురించి ఆలోచనల నుండి బయటకు రావడానికి సాధనంగా ఎంచుకొని.. ఏదో ఒక ధ్యాసలో మునిగిపోవడంతో.
నిజంగా ఏం పని చెయ్యాలో తెలియనివారు.. ఏదో ఒక విధంగా సమయాన్ని ఖర్చు చేసే పనిగా చేయడంతో.
మొబైల్‌లో ఆడే ఆటలు విపరీతమైన ఉద్వేగాన్ని కలిగించడం, అది ఎంతో సంతోషాన్ని ఇవ్వడంవలన.. అలాంటి సంతోషం మళ్ళీమళ్ళీ కావాలనుకోవడం వలన తెలియకుండానే దానికి అడిక్ట్ కావడం.
ఇంటర్‌నెట్‌ద్వారా లభించే ప్రతీదీ చూడాలనుకోవడం.. అందులో వుండేది మనకు ఉపయోగమా? కాదా? అని తెలుసుకోకుండా అదే పనిగా చేయడంవలన.
మొబైల్/ఇంటర్‌నెట్ తప్ప ఇంకా ఏ ఇతర పద్ధతులను సమాచారంకోసం అలవాటు చేసుకోకపోవడంతో..
స్నేహితులు ఎక్కువగా లేకపోవడంతో
ఫేస్‌బుక్‌లో ఛాటింగ్‌లో వుండే వారంతా నిజమైన స్నేహితులే అని భ్రమపడడం.
పోస్టులు పెట్టి, ఫొటోలు పెట్టి వాటి ‘లైకు’లకోసం.. కామెంట్స్ కోసం పదే పదే చూడడం, ఎదురుచూడడం.. ఎలాగైనా చాలామంది కామెంట్స్ తెచ్చుకోవాలనే పట్టుదలతో ఎక్కువ సమయం గడిపి, చివరకు అది లేకుండా వుండలేని స్థితికి చేరుకోవడం.
అడిక్షన్‌నుంచి బయటికి రావడం ఎలా?
ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఎందుకు వాడకూడదనుకుంటున్నామో ముందుగా కారణాలను వ్రాసుకోవాలి, వాటిని నమ్మాలి వాటివల్ల వచ్చే నష్టాలు వ్రాసినవాటిని అనుభవించావు కాబట్టి నేను దీనిని ఎక్కువగా వాడకూడదు అని తీర్మానించుకోవాలి.
ఫోన్ వాడకూడని సమయాలను నిర్ణయించుకోవాలి.
మొబైల్‌లో వున్న రకరకాల మాధ్యమాల నోటిఫికేషన్స్‌ను తీసివేయాలి.
సోషల్ మీడియాకు సంబంధించిన ‘యాప్స్’ వుంటే వాటిని తీసివేయండి.
గ్రూప్ ఛాట్స్‌వల్ల ప్రయోజనం వుందా లేదా బేరీజు వేసుకొని వీలయినంత వరకు తీసివేయండి. లేదా వాటిని ‘మ్యూట్’లో పెట్టండి.
ఫోన్‌ను ఎలా వాడాలో కొన్ని నియమాలు వ్రాసుకోండి. టెక్ట్స్ మెసేజెస్ రోజులో ఒక్కసారి/రెండుసార్లు నిర్ణీత సమయంలో మాత్రమే జవాబులు ఇస్తాను అనుకోవాలి, అలానే చేయాలి.
పడుకునే ముందు, చదువుకునే ముందు, ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యాలి.
అలారంకోసం మామూలు గడియారాన్ని ఉపయోగించండి. ఇలా కొన్ని రోజులు చేసి చూస్తే సెల్‌ఫోన్‌ను ఇంకా తక్కువగా ఉపయోగించడం అలవాటుగా మారుతుంది.
పై పద్ధతులను పాటిస్తూ… ఇంట్లో, బయట స్నేహితులకు చెప్పాలి. అనవసరంగా ఎక్కువసార్లు ఫోన్ ఉపయోగిస్తే నన్ను హెచ్చరించండి అని చెప్పి, వారు చెప్పినట్లుగా కొన్ని రోజులు నడుచుకుంటే.. తప్పకుండా ఎక్కువ వాడే అలవాటునుంచి మామూలుగా అవసరమున్నప్పుడు మాత్రమే వాడే అలవాటు అవుతుంది.. అప్పుడు మీరు మిమ్మల్ని జయించినంత ఆనందంగా వుంటుంది.. అప్పుడు ప్రతి పని మీరు అనుకున్నట్లుగా సాగుతుంది. చదువు వేగంగా ప్రవహిస్తుంది.. ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది.. విజయం దారిలో పయనిస్తారు..
డాక్టర్ వీరేందర్