పాపికొండలను మించిన అందాలకు కొలువైన ‘కృష్ణానది’ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే సదుపాయం ప్రజల ముంగిటకు వచ్చింది. సోమశిల నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభమైంది.

– సంబరాజు రవిప్రకాశ్‌


దేశంలో ఎక్కడాలేని సప్తపదుల కలయికతో అక్కడ కృష్ణానది ముల్లోకాలకన్న పవిత్రం అని భక్తుల విశ్వాసం. అలాంటి పావన చరితయైన కృష్ణానది తీరంలో వెలసిన గ్రామం సోమశిల. ఇది నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపురం పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న ఆలయ సముదాయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కృష్ణలో పుణ్యస్నానాలు చేసి లలితా సోమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే భవిష్యత్తు బంగారుమయమవుతుందని ప్రజలు నమ్ముతారు. చరిత్ర ప్రసిద్ధి పొందిన సోమశిల ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమే కాదు. పర్యాటక శోభతో విరాజిల్లుతున్న ‘ఎకో టూరిజం’ కేంద్రం కూడా.

ప్రకృతి సోయగాల సోమశిల

విశాలంగా పరుచుకొని పారుతున్న కృష్ణమ్మ, దానికి ఇరువైపుల ఎత్తైన నల్లమల గిరులు, అక్కడక్కడ తీర ప్రాంత గ్రామాలు, చిన్న చిన్న ద్వీపాలు, పచ్చని అడవులు, ఒంపులు తిరిగిన కృష్ణమ్మ అందాలు, సహజ సుందరమైన గుహలు, పుణ్యక్షేత్రాలు, ఆసక్తిని రేకెత్తించే వింతలు, విశేషాలు, చల్లని పిల్లగాలులు. వీటన్నింటి సమాహారాన్ని ప్రకృతి సోయగాల సోమశిలగా వర్ణించవచ్చు.

సోమశిల ‘ఎకో టూరిజం’

తెలంగాణలో ప్రకృతి అందాలకు కొదువలేదు. జలపాతాలకు, నదీనదాలకు కొండ కోనలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నెలవు ఇది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక పూర్వం వీటిని పట్టించుకున్న నాథుడే లేరు. ”అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని” అన్న సామెతలాగా మన పరిస్థితి ఉండేది. చూడటానికి రెండు కళ్ళు చాలని ఇక్కడి ప్రకృతి అందాలు గ్రహణం పట్టిన సూర్యునిలా ఉండిపోయినవి. కావాలని చేసిన పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలుగా వెలుగొందాల్సిన ప్రదేశాలు పక్క ప్రాంతాల ప్రజలకు కూడా తెలియని దుస్థితిలో ఉండిపోవడం విచారకరం.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నది. పర్యాటక రంగం అభివృద్ధిలో విశేష ప్రతిన కనబడుతున్నది. పాపికొండలను మించిన అందాలకు కొలువైన ‘కృష్ణానది’ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే సదుపాయం ప్రజల ముంగిటకు వచ్చింది. సోమశిల నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. దట్టమైన నల్లమల అటవీ అందాలు ఒక వైపు మనను మురిపిస్తే, మరొకవైపు ఒంపులు తిరిగి ఒయ్యారంగా ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో లాంచీ ప్రయాణం మనసును మైమరపింపచేస్తుంది. అందుకే ఏకో టూరిజానికి కేరాఫ్‌ అడ్రస్‌ సోమశిల.

పరుగులు పెడుతున్న ‘సోమశిల’ అభివృద్ధి

సోమశిల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 20.86 కోట్లు ఖర్చు చేసింది. 10 కాటేజీలను నదీ తీరంలో నిర్మించింది. పాశ్చాత్చ దేశాలలో కనిపించే కాటేజీలు ఇప్పుడు సోమశిలలో మనకు దర్శనమిస్తాయి. కాటేజీలలో బస చేసిన వారికి కృష్ణమ్మ ఒడిలో బసచేసిన దివ్యానుభూతి కలుగుతుంది. కాటేజీలతో పాటు రెస్టారెంట్లు, వ్యూపాయింట్‌, పార్కింగ్‌ సౌకర్యం అన్నీ ఇక్కడున్నాయి. ఈ కాటేజీలకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం ఉంది. దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ‘లాంచీ’ తయారు చేయించారు. 125 మంది వరకు దీనిలో ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో అనేక వాటర్‌ స్పోర్ట్స్‌, స్పీడ్‌ బోట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. 7.84 కోట్లు ఖర్చు చేసినందువల్ల సోలార్‌ విద్యుత్‌ కాంతి వెలుగులలో సోమశిల మెరిసిపోతున్నది.

సోమశిల నుండి శ్రీశైలం – లాంచీ ప్రయాణం

ఒకవైపు పాపికొండలకన్న ఎత్తైన నల్లమల కొండలు మనలను ఆనందపరవశులను చేస్తాయి. మరొకవైపు కృష్ణమ్మ గలగల సవ్వడులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఒక వైపు అరుదైన వృక్ష జాతులు, పుష్ప జాతులు, ఓషదీ మొక్కలు మనను ఆకర్షిస్తుంటే మరొక వైపు చెంగుచెంగున ఎగిరే జింక పిల్లలు మనసుకు హాయినిస్తాయి. ఒకవైపు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు ఆధ్యాత్మిక భావన బీజాలను వెదజల్లుతుంటే మరొకవైపు అక్కమహాదేవి గుహలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద సోమశిల నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. సోమశిల నుండి బయలుదేరిన లాంచీ చీమల తిప్ప, అంకాళమ్మకోట, చుక్కలకొండ, కదళీవనం, అక్కమహాదేవి గుహల మీదుగా శ్రీశైలానికి చేరుకుంటుంది. దాదాపు 6 నుండి 7 గంటలు సాగే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు దివ్యవరం.

సోమశిల-తెలంగాణ డాల్ఫిన్‌ నోస్‌

సోమశిల వద్ద కృష్ణానదిలోకి చొచ్చుకొచ్చిన నల్లమల కొండలను చూస్తే విశాఖపట్నంలోని డాల్ఫినోస్‌ కంటే అందంగా కనిపిస్తుంది. ఎదురెదురుగా నదిలోకి చొచ్చుకొచ్చిన కొండలు, ఆ రెండింటి మధ్య నదీ ప్రవాహం చూడటానికి రెండు కండ్లు చాలవు. ఇంకా పరికించి చూస్తే పెద్ద కొండ చిలువ కృష్ణమ్మ ఒడిలో సేదతీరుతున్నట్లు అక్కడి దృశ్యం ఉంటుంది. దాదాపు 300 ఫీట్ల లోతులో ఉండే కృష్ణానది వేసవిలో కూడా 100 ఫీట్లకు తగ్గదని స్థానికులు చెబుతున్నారు.

పర్యాటక వలయం

సోమశిల పర్యాటక కేంద్రంగా 2016లో ప్రారంభమైంది. అప్పటి పంచాయతీ రాజ్‌ శాఖామాత్యులు కృష్ణారావు ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 2016వ సంవత్సరంలో సోమశిల నుండి శ్రీశైలానికి ఒక బోటును ప్రారంభించారు. కొద్ది కాలం నడిచి అది ఆగిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న లాంచీ మన ప్రయాణాన్ని మరింత ఆనందమయం చేయనుంది.

సోమశిలకు సమీపంలో జటప్రోలు, మదన గోపాల స్వామి దేవాలయం, సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొల్లాపురం మాధవ స్వామి ఆలయం, నది ఆవలవైపున ఉన్న సంగమేశ్వర దేవాలయం, నదీ గర్భంలో ఉండే భీమలింగేశ్వర ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నవి. పర్యాటకులు హైదరాబాద్‌ నుండి సోమశిలకు చేరుకొని లాంచీ ప్రయాణం ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు. లేదా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానంతరం లాంచీ ఎక్కి సోమశిల వచ్చి హైదరాబాద్‌ చేరుకోవచ్చు. కొల్లాపురం నుండి హైదరాబాదుకు బస్సు సౌకర్యం ఉంది. సోమశిల, శ్రీశైలం, మల్లెల తీర్థం, ఫరహాబాద్‌, ఉమామహేశ్వరం, హైదరాబాద్‌ ప్రాంతాలను కలుపుతూ టూర్‌ ప్యారేజీలు అందించే ఆలోచనలో టూరిజం శాఖ ఉంది. ఇప్పటికే కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో విస్తరిస్తున్న టూరిజం

భవిష్యత్తులో దేశం నలుమూలల నుండి తెలంగాణ టూరిజం బాగుందనే రోజు వస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని సోమశిల వద్ద కృష్ణ తిరుగు జలాలలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన బోటును, అతిథి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. బోటులో సోమశిల నుండి, సిద్ధేశ్వరం, అమరగిరి తదితర ప్రాంతాలను ఆయన వీక్షించారు.

ఒకప్పుడు కొల్లాపూర్‌ ప్రాంతం నక్సల్స్‌ కు, గ్రేహౌండ్స్‌ దళాలకు అడ్డాగా

ఉండిందని, అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా మారిపోయిందని మంత్రి అన్నారు. కొల్లాపూర్‌ ప్రాంతలో ఆది మానవుని అవశేషాలు కూడా దొరికాయని, ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయని, ప్రకృతి రమణీయతకు, అందాలకు మారు పేరని, అందువల్ల ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. సోమశిలను పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సోమశిల దేశంలో అందరిని ఆకర్షించే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనటంలో సందేహం లేదన్నారు. శ్రీశైలం తిరుగు జలాలలో ఆంధ్ర, తెలంగాణ మధ్య సోమశిల, శ్రీశైలం వెళ్లేందుకు టూరిజం ద్వారా బోటును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నాగార్జున సాగర్‌ లో బౌద్ధవనం ప్రాజెక్టును ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించి సాగర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, రాబోయే రోజుల్లో తెలంగాణ టూరిజం విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని, ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిపించాలని, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మేల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మేల్యే హర్షవర్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సింగవట్నం లో టూరిజం గెస్ట్‌ హౌస్‌ ను,హరిత హోటల్‌ను ప్రారంభించారు.


సోమశిల – శ్రీశైలం పర్యాటక ప్యాకేజీ

హైదరాబాద్‌ – సోమశిల- శ్రీశైలం- హైదరాబాద్‌ టూరిజం ప్యాకేజీని తెలంగాణ టూరిజం శాఖ రూపొందించింది. పర్యాటకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెద్దలకు రూ.2,900, పిల్లలకు రూ.2,320 ఛార్జీలుగా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో హైదరాబాద్‌ నుంచి సోమశిలకు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు నాన్‌ఏసీ హైటెక్‌ కోచ్‌లో తీసుకెళ్తారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటు సౌకర్యం ఉంటుంది. బోటులో భోజనంతోపాటు శ్రీశైలంలో నాన్‌ ఏసీ వసతి కల్పిస్తారు.

సోమశిల- శ్రీశైలం- సోమశిల

మొత్తం బోటు ప్రయాణానికిగాను పెద్దలకు రూ.2,100, పిల్లలకు 1,680 ఛార్జీలుగా నిర్ణయించారు. బోటులో భోజనం అందించడంతోపాటు శ్రీశైలంలో నాన్‌ ఏసీ వసతి కల్పిస్తారు.

సోమశిల – శ్రీశైలం (వన్‌ వే) / శ్రీశైలం – సోమశిల (వన్‌ వే)

బోటు ప్రయాణానికి పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.720 ఛార్జీలు వసూలు చేస్తారు. బోటులో భోజన వసతి ఉంటుంది.

ప్రతి శనివారం హైదరాబాద్‌ నుంచి ఈ సేవలను పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుందని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Other Updates