తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. ఇందుకు మార్గాన్వేషణలో భాగంగా సౌర విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించింది. సౌర విద్యుత్ కేంద్రాలను ప్రోత్సహిస్తే రాష్ట్రంలోని విద్యుత్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించిన అధికారులు ఆ వైపుగా అడుగులు వేశారు. వారి ప్రణాళికలు కార్యరూపం దాల్చితే జెన్‌కో, ఎన్‌టిపిసిల కొత్త విద్యుత్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించక ముందే సౌర వెలుగులతో రాష్ట్రం కళకళలాడుతుంది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్) బిడ్లను ఆహ్వానించింది. టెండర్ల గడువు అక్టోబర్ 16వ తేదీతో ముగిసింది. అప్పటికి డెవలపర్‌ల నుంచి వీటికి 108 బిడ్లు వచ్చాయంటే సౌర విద్యుత్ ఉత్పత్తిపై పారిశ్రామిక వేత్తలు ఎంతటి ఉత్సాహంగా ఉన్నారో అర్దమవుతుంది. ఇందులో విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో కూడా కొన్ని కంపెనీలు బిడ్లు వేసాయని అధికారుల ద్వారా తెలిసింది. తెలంగాణలో సౌర విద్యుత్‌కు వచ్చిన స్పందన ఇక్కడి విద్యుత్ సంక్షోభం నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 1893 మెగావాట్ల విద్యుత్‌ను 15 నెలల్లో అందచేస్తామని ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. ఇందనశాఖ 500 మెగావాట్ల కొనుగోలుకే అనుమతి ఇచ్చింది. అయినా 1893 మెటావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపోయే విధంగా కంపెనీలు ముందుకు వచ్చాయి. డిస్కంలు టెండర్లు పిలిస్తే అనూహ్య స్పందన కానవచ్చింది.
ఒక్క మెగావాట్ ఉత్పత్తికి రూ. 6 కోట్లు వ్యయం
ఒక్క మెగావాట్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి రూ. 6 కోట్ల వరకు వ్యయమవుతుందని తెలుస్తున్నది. సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టడానికి భూమి, నిధులు అన్ని సమకూర్చుకుని పని ప్రారంభిస్తే సుమారు ఆరు మాసాల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించే వీలు కలుగుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్పీడీసీఎల్ అక్టోబరు 16 నుంచి టెండర్ల పరిశీలన, తదితర ప్రక్రియలు ప్రారంభించింది. ఇది పూర్తయి ఖరారైతే టెండర్లు దక్కించుకున్న కంపెనీలు పనులు ప్రారంభిస్తాయి. వీటి నిర్మాణం వేగవంతమైతే సంవత్సరం లోపు తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ వెలుగులు విరజిమ్మే అవకాశం ఏర్పడుతుంది. ఈ కంపెనీలను తెలంగాణ రాష్ట్రంలో సబ్‌స్టేషన్‌ల వారీగా కేటాయించడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఒక సబ్‌స్టేషన్ పరిధిలో ఒకే టెండరు దాఖలైతే దానికే కాంట్రాక్టు దొరుకుతుంది. ఒక్కటి కన్నా ఎక్కువ దాఖలైన పక్షంలో టెండర్‌లలో ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందించారు. మొత్తంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభిస్తే తెలంగాణాలో విద్యుత్ సమస్య కొంతమేరకు పరిష్కారమయ్యే అవకాశాలు ఏర్పడతాయి.