స్కైవేలలో-ప్రయాణం1హైదరాబాద్‌లో పెళ్ళి అంటే వెళ్ళిరావడానికి జంకుతున్నారు జనం. హైదరాబాద్‌ పట్టణ పరిధి దాటి 100`200 కిలో మీటర్ల దూరంలో పెళ్ళి వుందంటే వెళ్ళి రావడం హాయి కాని హైదరాబాద్‌లో అంటే హడలిపోతున్నారు. కారణం ట్రాఫిక్‌` ఎటు చూసినా ట్రాఫిక్‌ జాం. పెళ్ళికి లేదా మరే ఇతర శుభకార్యాలకయినా బంధువులింటికి వెళ్ళి రావాలంటే, పుణ్యకాలమంతా పురవీధుల్లోనే గడిచిపోతుంది. రైలులోనో, బస్సులోనో ప్రయాణం చేద్దామని ప్లాన్‌ వేసుకుని మరీ టికెట్లు రిజర్వు చేసుకున్నా ప్రయాణ సమయానికంటే ఓ రెండు మూడు గంటల ముందు ఇంటి నుండి బయలుదేరకపోయామా అంతే సంగతులు. అవతల వెయిటింగ్‌ లిస్ట్‌లో వున్న వాళ్ళకి టికెట్లు కన్‌ఫర్మ్‌ అయిపోతాయి. హైదరాబాద్‌లో ఒక చోటినుండి మరో చోటికి వెళ్ళే దారిలో ఎంతో సమయం వృధా అవుతుంది. ఫలితంగా ఉత్పాదకత కుంటుపడడమే కాదు, కాలుష్యం పెరిగిపోతున్నది. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వీటన్నింటికి ప్రధాన కారణం నగర ట్రాఫిక్‌. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీటిని పరిష్కరించే ఆలోచనతో ఉన్నతాధికారులతో, ట్రాఫిక్‌ నియంత్రణకు తీసుకోవలసిన తక్షణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఇది సత్వరం పరిష్కంరించుకోవలసిన సమస్య కాబట్టే ఇదివరకే, ఎన్నోసార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్‌ సమస్యకు తరుణోపాయంగా ఎలివేటెడ్‌ కారిడార్లు, స్కైవేలు, మల్టీలెవెల్‌ గ్రేడ్‌ సపరేటర్లు నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధంచేసి తీసుకురమ్మని ఆదేశించారు గతంలో.
ఈ ఆదేశాలను అందుకున్న అధికారులు ఆలస్యం చేయకుండా, వేరువేరు కన్సల్టెంట్‌లను సంప్రదించి వివిధ ప్రణాళికలను సిద్ధంచేసి తీసుకువచ్చారు. 19 డిసెంబర్‌ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ పాత, కొత్త నగరంలో అంతా కలిపి 35`40 చౌరస్తాలలో ట్రాఫిక్‌ సమస్య బాగా వుంది. దీన్ని అధిగమించవలసిన అవసరం వుంది. అలాగే ముందుముందు నగరమంతా మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం వుంది అన్నారు.
ప్రస్తుత, రానున్న అవసరాలగురించి ఆలోచించి చౌరస్తాల దగ్గర సెపరేటర్స్‌ను ఏర్పాటు చెయ్యాలని అన్నారు కేసీఆర్‌. సచివాలయం, ఖైరతాబాద్‌, నెక్లెస్‌రోడ్డుచౌరస్తా, ఆబిడ్స్‌, కోఠి, చాదర్‌ఘాట్‌, ఓవైసీఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, తిరుమలగిరి జంక్షన్‌, సంగీత్‌, ప్యారడైజ్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, బంజారాహిల్స్‌, కేబీఆర్‌ పార్క్‌లవద్ద మల్టీలెవెల్‌ గ్రేడ్‌ సెపరేటర్స్‌ అవసరం ఎక్కువగా వుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
స్కైవేలు, ఎలివేటెడ్‌ నిర్మాణాలు ఏర్పాటు చేయాలనుకున్న దగ్గర మెట్రోరైలు అడ్డుగావస్తే దానిపైనుంచి ఆ మార్గాలను నిర్మించాలన్నారు కేసీఆర్‌. ఆ ప్రకారంగా ప్రతిపాదనలు, డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ సమీక్షా సమావేశంలో సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సోమేష్‌కుమార్‌, రవాణరంగ కన్సల్టెంట్ల, ప్రతినిధులు పాల్గొన్నారు.

Other Updates