magaకొద్ది రోజుల వ్యవధిలోనే తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలయిన ఇద్దరు సాహితీ ప్రముఖుల్ని కోల్పోయింది. ఒకరు గంగా నిర్జరీ అభంగ తరంగ కవితా చైతన్యాన్ని లోకానికి పంచిన జ్ఞానపీఠాధిష్ఠితుడు కాగా మరొకరు సరస సరస్వతీ స్తోత్రస్విని లాగా అంతర్వాహినిగా కవిత్వాన్ని, వేదాంతాన్ని ప్రపంచించిన అంతర్ముఖీనులు.

ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి కవితా స్రవంతి గాంగఝలీ సదృశం. ఉమాపతి పద్మనాభశర్మగారేమో మౌనముద్రాలం కారుడైన వేదాంతత్వమూర్తి, మధురకవి.

సకల చైతన్యాలకు నిలయమైన సిద్ధిపేట కవులకు, కళా కోవిదులకు పుట్టినిల్లు. సిద్ధిపేటలోని పారుపల్లి వీధిలో విద్వత్కవి వేముగంటి, మధురకవి ఉమాపతివారివి పక్కపక్క ఇళ్ళు. మెతుకు సీమగన్న ఆణిముత్యాలిద్దరూ.

సిద్ధిపేటలోని కవుల కళాకారుల విలక్షణ మనస్తత్వం ఏమిటంటే ఖండాంతర ఖ్యాతినార్జించినా సిద్ధిపేటను వదలి ఉండలేకపోవడం. అది కాపు రాజయ్య అయినా గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ అయినా, వేముగంటి వారైనా, ఉమాపతివారైనా… సిద్ధిపేటలోనే తమ జీవన యానాన్ని గడపడం-సిద్ధిపేటను రససిద్ధిపేటగా మలిచి తరించడం. నేటికీ అదే పరంపర కొనసాగుతుంది. అష్టకాలవారైనా… అయితా చంద్రయ్యగారైనా…

ఇక ప్రస్తుతానికి వస్తే జూలై 4వ తేదీన దివంగతులైన ఉమాపతి పద్మనాభశర్మగారి గురించి నాలుగు మాటలు.. కొన్ని జ్ఞాపకాలు..

ఉమాపతివారిది పండితవంశం. వారి ప్రపితామహులు నారాయణశాస్త్రి, పితామహులు నాగయ్య శాస్త్రి..పితృదేవతల నారాయణశాస్త్రి, చిన్నాన్న లక్ష్మీరాజశాస్త్రి, వీరంతా పండితులే కాదు వ్యుత్పన్నులు… సంగీత కళా మర్మజ్ఞులు కూడా.. పద్మనాభ శర్మ విద్వత్కవిగానే కాకుండా తెలంగాణ తొలితరం కథా రచయితలలో ఒకరిగా పేరెన్నికగన్నారు.

ఆనాటి భారతి, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, సాధన పత్రికలలో శర్మ కథలు అచ్చయి రసజ్ఞుల మన్ననలు పొందాయి. ఆయా పత్రికలన్నిట్లో వీరి కథానికలు, గేయాలు, పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ‘చతురంగం’, ‘నవ కథావిపంచి’ కథా సంపుటాల్లో శర్మ కథలున్నాయి. ‘వాస్తవస్తవం’ పేరుతో శర్మ ‘నిత్యసత్యాలు’ మన్నవ గిరిధరరావు వంటివారి సరసన వీరిని నిలిపాయి. ‘చివరి ఘడియలు’ పేరిట ఒక కథల సంపుటి ప్రచురించాలన్న వారి ఆశయం చివరివరకు నెరవేరనే లేదు.

అనువంశికమైన సంగీతకళ శర్మను వరించింది. వేణు, వయోలిన్‌, హార్మోనియం మొదలయిన వాయిద్యాల వాదనలోనేకాదు చక్కని గాత్ర శుద్ధితో సుస్వర మాధుర్య సంగీతానందించేవారు.

తొలి ప్రపంచ తెలుగు మహా సభలలో విశ్వ విఖ్యాత చిత్రకారులు కాపు రాజయ్య వేమనగా అభినయిస్తే ఉమాపతి నేపథ్య పద్యపఠనం ప్రేక్షకులనుర్రూత లూగించిం దట. భువన విజయం, ఇంద్రసభలవంటి సాహితీ రూపకాల్లోనూ శర్మ పద్యపఠనం, నటనావైదుష్యం చూపరులను మంత్రముగ్ధు లను గావించేది.

సంస్కృతాంధ్రాంగ్ల భాషల్లో కంఠదఘ్న మైన పాండితీ ప్రకర్షగలవారు శర్మ. కాళిదాసు, తిక్కన, శ్రీనాథుడు, బుచ్చి బాబు, ఓహెన్రీ తమ అభిమాన రచయితలని చెప్పుకొనేవారు. విస్తారమైన పఠనంతో అపార వ్యుత్పన్నతను సాధించిన శర్మ విద్యాఖనిగా విద్వద్వరేణ్యులైన చరద్విజ్ఞాన సర్వస్వంగా సన్నిహితులకు శిష్యులకు గోచరించేవారు. జ్యోతిష శాస్త్రంలో కూడా ఆయన నిష్ణాతులు. ఆయన నిశిత పరిశోధనా దృష్టి పలువురికి ఉపకరించింది.

పాఠశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకులుగా పదవీ విర మణ గావించిన శర్మకు వేలాదిమంది శిష్య ప్రశిష్యులున్నారు వారిలో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖరరావు గారొకరు. (కేసీఆర్‌ తొలిసారి ఎమ్మెల్యేగా నామపత్రం వేసే సమయంలో ఉమాపతి పద్మనాభశర్మ ఇంటికి వచ్చి, గురువుకు పాదాభివందనం చేసి ఆశీస్సులం దుకున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ ఈ సంవత్సరం జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో శర్మకు పండిత పురస్కారాన్ని స్వయంగా అందజేసే సమయంలో గురువందనం అందించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శర్మ ఘనతను చెప్పి వారితో కూడా నమస్కారం చేయించి గురుభక్తిని చాటుకోవడం విశేషం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న డా|| నందిని సిధారెడ్డి, అష్టకాల రామ్మోహన్‌, దేశపతి శ్రీనివాస్‌వంటి వారెందరో ఉమా పతికి శిష్యప్రశిష్యులే).

ఉమాపతి కవనవనం లో విరబూసిన తొలి వసంతం ‘తేజోవల్లరి’.. భావికవితా ఉద్యమ స్ఫూర్తితో వెలువరించిన పద్య గేయ కావ్యమిది.

శర్మను మధురకవిగా నిలబెట్టినవి ఇందులోని కవితలే. ఆదిశంక రాచార్య కృతమైన దేవీమానసికపూజా విధానాన్ని తెలిపి ఒక సంవత్సరంపాటు దేవీమానసిక పూజను నిత్యనవరాత్యుత్సవంగా జరిపించారు శర్మ మేనమామ కొరిడె సీతారామశాస్త్రి. దాని ప్రభావంతో ”వాగ్వాదిన్యా: ప్రసాదేన వత్సరాత్స కవిర్భవేత్‌” అన్నట్లుగా శర్మ కవిత్వంలో మధుర ధారా రసశుద్ధి ఏర్పడి స్వేచ్ఛానువాదంగా ”శ్రీదేవీ మానసిక పూజ’ వెలువడింది.

”శ్రీశంకరాచార్య కృతికి స్వేచ్ఛాకృతియని వీరు వ్రాసిరికానీ యీ స్వేచ్ఛ మూలమునకు వ్యాఖ్యానపాయ్రమై అధికతర సౌందర్యావహమై ఉంది’ అని శ్లాఘించారు కేశవపంతులు నరసింహ శాస్త్రి.

అఖండమైన తపనతో వివిధ సాంప్రదాయిక గ్రంథాల పరిశీలనా నుభవంతో అద్వైతతత్వ నిరూపణలతో 11 వ్యాసాల సమాహారంగా శర్మ వెలువరించిన ‘హంసనాదం’ తాత్వికులకు సంప్రదాయజ్ఞులకు ఒక ప్రమాణ గ్రంథంగా రూపొందింది. అదేవిధంగా అద్వైత శివాద్వైత-విశిష్టాద్వైత సిద్ధాంతాలు స్వరూపాన్ని చక్కగా ఆకళింపుజేసుకొని నిశిత బుద్ధితో సహేతుక పరిశీలనలతో వెలువరించిన ”శివాద్వైత దర్శనమ్‌” అనే బృహద్గ్రంధం శర్మ సత్యాన్వేషణకు పాండితీ ప్రకర్షకు గీటురాయి. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రు డంతటివారే తెలుగులో ఇంత ప్రౌఢమైన స్వతంత్ర గ్రంథం ఏదీ రాలేదని” కొనియాడడం శర్మ కృషికి గొప్ప నీరాజనం.

అద్వైత తత్వాన్నే జీవన తత్వంగా మలచుకొన్న శర్మ సంస్కృతంలో ‘అద్వైతగీత’ పేరిట 108 శ్లోకాలను రచించడమేకాక స్వీయ వ్యాఖ్యానంతో ‘దర్శనమ్‌’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ధారావాహికగా అందించారు.

అదేవిధంగా దేవీ సప్తశతికి మిత్రులతో కలిసి తెలుగు వ్యాఖ్యానాన్ని ‘భాష్యంలాగా అందించారు. సంస్కృతంలోని భాగవతానికి శ్రీధరీయ వ్యాఖ్యానం మేల్తరమైనదైతే దాన్ని తెలుగులో యధాతథంగా అందించిన ప్రముఖులతో శర్మ అద్వితీయులనిపించుకున్నారు. తొగుట-రాంపురంలోని శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠం పక్షాన మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో వెలువడి భాగవత శ్రీధరీయ తెలుగువ్యాఖ్య నాన్యతోదర్శనీ యంగా గ్రంధస్థమైంది.

స్థితప్రజ్ఞులైన శర్మ మేధ సునిశితమైంది. ఏది చేపట్టినా పరిపూర్ణ ప్రతిభతో నిర్వహించడం వారికే చెల్లింది. గంభీరమైన రూపం, ఆత్మీయమైన పలకరింత, అనవసర ప్రసంగాలు చేయని మౌనముద్రా స్వభావం, తెల్లని మెరిసే లాల్చీ ధోవతితో పరమ ప్రశాంతతకు ఆలవాలమైన జీవన విధానం, తనకేమీ కావాలని కోరుకోని నిర్మలత్వంతో మెలిగే, నిండుదనం… అన్నీ కలిపి ఒక రాజయోగిగా, సిద్ధ పురుషునిగా… మలిచాయి ఉమాపతి పద్మనాభ శర్మని.

ఏ సభలకైనా, సన్మానాలకైనా ఎంతో పిలిస్తే తప్ప వెళ్ళని శర్మకు అజోవిభో ఫౌండేషన్‌పక్షాన సద్గురు శివానందమూర్తి చేతులమీదుగా అందిన సత్కారం, మరణానికి నెలముందు తమంతట తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవ పురస్కారం తామే వరించి వచ్చాయి.

మర్మాముల అపర్ణాదత్తాత్రేయశర్మ

Other Updates