ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాన్ని, రెండు దేశాలమధ్య సంబంధాన్ని కూడా స్నేహంతోనే నిర్వచిస్తారు. స్నేహం పేరు చెప్పగానే.. అది బంధం గాఢతను తెలియజేస్తుంది. ఏ రకమైన కుటుంబ నేపథ్యమైన సరే! ఇద్దరి మధ్య ఏ విధంగాను రక్త సంబంధం వుండదు కానీ, పురాణేతిహాసాలనుంచి కూడా ఎంతో ప్రభావవంతమైన సంబంధం స్నేహం. స్నేహం మనిషి పుట్టుకు ఉనికి ఉన్నప్పటినుండి ఇప్పటివరకు స్నేహానికి ఎంతో గుర్తింపు వుంది. స్నేహితులున్నందుకు అందరూ సంతోషపడతారు, గర్వపడతారు. ఎన్నో సినిమాలు స్నేహం ఇతివృత్తంలో వచ్చిన ప్రతి హిందీ, తెలుగు సినిమా హిట్ట్టే.. 70వ దశకంలో వచ్చిన షోలే సినిమాలో వచ్చిన ”హే దోస్‌తీ.. హమ్ నహీ చోడెంగే…” తెలుగులో వచ్చిన ”స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం…”, ”ముస్తఫా ముస్తఫా.. డోన్ట్ వర్రీ ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా…” ప్రతి వ్యక్తి నోట్లో నలిగిన పాటలు.
నిజంగా స్నేహం అంతగొప్పగా మారాలంటే ఏం చెయ్యాలి.. ఏం చేస్తే స్నేహాలు తీయని అనుభూతిగా మారతాయి. అలాంటి స్నేహాలు పదేపదే కావాలని కోరుకోవచ్చు. నిజమైన మిత్రులుగా కావాలంటె ఎలాంటి లక్షణాలుండాలి
నిన్ను నిన్నుగానే అంగీకరించాలి
నిన్ను ఎప్పుడు ‘జడ్జి’ చేయరు
నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టడానికి ప్రయత్నించరు
నీ తోడు, సాంగత్యం సంతోషాన్నిస్తుంది
పరిస్థితులు కష్టంగా వున్నప్పుడు నిన్ను అంటిపెట్టుకొని వుంటారు
వినడానికి సిద్ధంగా వుంటారు
నువ్వెప్పుడైనా ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా వుంటారు.
నీలో జరిగే సంఘర్షణకు.. సపోర్ట్‌గా ఉంటారు, వీలైతే సంఘర్షణను తగ్గించడానికి నీతో సంఘర్షిస్తారు..
నిజాయితీగా వుంటారు.
స్నేహాలు ఎలా ఏర్పడతాయి:
పరిశోధనలు చెప్పేదేమిటంటే
1. ఉమ్మడి ఆసక్తులు, 2. ఉమ్మడి విలువలు
3. సమానత్వ దృష్టి 4. ఉమ్మడిగా ఆలోచించే విధానాలు 5. ఉమ్మడిగా చేసే ఆనందకరమైన పనులు 6. ఉమ్మడిగా బాధపెట్టే అంశాలు
7. ఉమ్మడి జీవిత లక్ష్యాలు
పై అంశాలలో అధికంగా కలిస్తే, స్నేహాలు చాలాకాలం పాటు కొనసాగేందుకు అవకాశాలు చాలా వుంటాయనేది పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. చిన్ననాటి స్నేహాలు వీటన్నింటికి అతీతమనేది సామాజికవేత్తల పరిశీలనలు చెబుతాయి… వీటిని మనం రకరకాల అంశాలతో ఇలా విభజించుకోవచ్చు.
1. బెస్ట్ ఫ్రెండ్
2. ఆత్మీయ నేస్తం (క్లోజ్ ఫ్రెండ్)
3. వినే నేస్తం
4. సంతోషాన్ని నింపే నేస్తం
5. లాయల్ నేస్తం
6. వర్చువల్ రియల్ ఫ్రెండ్
7. కమర్షియల్ ఫ్రెండ్
8. అనారోగ్య స్నేహం.
ఇంకా చాలా రకాలైన
స్నేహాలున్నాయి కానీ ఎక్కువగా కనిపించే స్నేహాలు ఇవే…
బెస్ట్ ఫ్రెండ్
ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీతో కలిసి వుంటాడు, నీకు సంబంధించిన అన్ని విషయాలలో, అతని సహాయం ఎల్లప్పుడు ఉంటుంది. ఏ పని చేసినా అతనితో కలిసి చర్చించడం జరిగిన తర్వాతనే నిర్ణయం ఉంటుంది. మాట్లాడుకోవడంవలన, విషయం పట్ల స్పష్టత, చేసే పని వలన వచ్చే లాభనష్టాలగురించి స్పష్టత వస్తుంది. జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకోకపోయినా, ఎక్కువ విషయాలు మాత్రం ఒకరికొకరు చెప్పుకుంటారు.
ఆత్మీయ నేస్తం (క్లోజ్ ఫ్రెండ్):
ఏ భేషజం లేకుండా అన్ని విషయాలు చర్చించుకుంటారు. మదిలో రహస్యాలు లేని స్నేహాలు, ప్రతీది ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. వారితో ఉంటే మనతో మనమున్నట్టు, అస్సలు వేరే మనిషన్న భావన ఉండదు. వారితో షేర్ చేసుకుంటేనే ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. తనకు సంబంధించిన విషయాలు చాలా సహజంగా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోకుంటే ఏమనుకుంటారో అనే భావన నుంచి కాకుండా, షేర్ చేసుకోకుంటే తప్ప మనస్సుకు హాయిగా ఉండదు.
వినే నేస్తం:
ఈ స్నేహాల్లో.. వినడంలో నిజాయితీ ఉంటుంది, మన ప్రతి కష్టం, నష్టం అన్నీ వారితో చెప్పుకుంటాం, వారు విని సజెషన్/సలహా ఏమీ ఇవ్వరు కానీ…ఎంత సేపు చెప్పినా వింటారు అంతే…
సంతోషం నింపే స్నేహం:
ఈ స్నేహం నిరంతరం దొరికే స్నేహం కాదు. వీరితో ఉంటే కాలం ఇట్టె గడిచిపోతుంది… ఎన్నో జోక్స్, హోటల్స్, సినిమాలు, గంటలు గంటలు మాటలు ఉన్న ఒక్కరోజు, రెండు రోజులు సంతోషంతో గడిచిపోతుంది… కానీ ఎక్కువ రోజులు అందుబాటులో వుండరు.
లాయల్ స్నేహం:
ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్నేహం వైపే వుంటారు. ఇవతలి వ్యక్తులు సరియైన పనులు చేయడం లేదని తెలిస్తే సరిగ్గా చేయటం లేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి వారికి అండగా వుంటారు… వీరివల్ల గొప్పగా ప్రయోజనం, మానసికంగా సంతోషాలు, షేరింగ్ ఎక్కువగా వుండవు.కానీ కలిసినప్పుడు ఎన్నో కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. క్రైసిస్‌లో మాత్రం వెంబడే వుంటారు. వీరు వేరే వ్యక్తుల దగ్గర చెడ్డగా మాట్లాడడం చేయరు. ఎక్కడా విమర్శించరు.
వర్చువల్ రియల్ ఫ్రెండ్
ఈ స్నేహాలకు గుర్తింపు వుండదు. సోషల్ మీడియాలో మాత్రం, ప్రతి రోజూ వ్యాఖ్యలు, లైకులు చేస్తుంటారు. పెద్దఎత్తున మనం చేసే పనులకు గుర్తింపులు, అభినందనలు వెల్లువెత్తుతాయి.. కానీ అవన్నీ జస్ట్ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లోనే. నిజ జీవితంలో ఒక్కరంటె ఒక్కరు కూడా, ఇతరులు కష్టాల్లో వుంటే సపోర్ట్‌గా రారు… ఫేస్‌బుక్‌లో మాత్రం కడవలకొద్దీ కన్నీరు కారుస్తారు… కొంత మంది తెలియక నిజం స్నేహంలాగే నమ్ముతారు, కొందరు ఊహల్లో విహరిస్తారు.
కమర్షియల్ ఫ్రెండ్:
లాభనష్టాలు బేరీజు వేసుకొని, ‘బ్యాలెన్స్ షీట్’ ఫ్రేమ్‌లో పని చేస్తారు. అతనితో కలిస్తే లాభం ఎంత.. ఏమేమి పనులు అవుతాయి, అస్సలు అవుతాయా లేదా సమయం వేస్ట్ అవుతుందా… అతడికోసం ఖర్చు పెడితే తిరిగి రిటర్న్ వస్తుందా లేదా అనే ఆలోచనలో వుంటారు.
అనారోగ్య స్నేహం:
ఈ స్నేహాలు పైకి బాగానే కనిపిస్తాయి కానీ లోపల వేరే లక్ష్యాలుంటాయి. విద్యార్థుల్లో బాగా చదివే వాళ్లతో వీరు స్నేహం నటిస్తారు, చదువును, సమయాన్ని వృధా చేస్తారు. లైఫ్ అంటే అన్నింటినీ చూడాలి, ఎంజాయ్ చేయాలి.. చదువు ఒక్కటి కాదు అని, కొత్తకొత్త వాళ్ళతో స్నేహాలు చేసేటట్టు చేస్తారు, రకరకాల వాటికి పరిచయం చేస్తారు, సిగరెట్లు, డ్రగ్స్, అమ్మాయిలు, అబ్బాయిలు… తిరగడం… అలవాటు చేసి వాళ్ళను పూర్తిగా నాశనం అయ్యేటట్టు చేస్తారు… వాళ్ళకు పోటీగా లేకుండా చేసుకుంటారు.
పై స్నేహాల్లో మనకు, మన జీవితానికి, మన కెరీర్‌కు ఏ రకంగా ఉపయోగపడగలవో.. ఏది మనకు ఆరోగ్యకరంగా అనిపిస్తోందో ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని స్నేహాలను కొనసాగించాలి. అప్పుడు యువతీ, యువకులు తమ జీవితాన్ని సాఫీగా కొనసాగించగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు, పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థులు స్నేహాలపట్ల చాలా అప్రమత్తంగా వుండాలి. అప్పుడు మనకు ఆరోగ్యకరంగా స్నేహాలవల్ల తప్పకుండా జీవితం వర్ణ రంజితం అవుతుంది. స్నేహం ఎంతో స్వాంతనను, సంతోషాన్నిస్తుంది. ఆల్ ది బెస్ట్..