వి.ప్రకాశ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మారక చిహ్నాలను శాసనసభ ఎదుటగల ‘గన్‌పార్క్’లో, సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ పార్క్‌లో ఏర్పాటు చేయాలన్న నగర కార్పొరేషన్ నిర్ణయాన్ని బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అడ్డుకున్నది. పార్కుల స్థలం కార్పొరేషన్‌దికాదని, కనుక కార్పొరేషన్ తమదికాని స్థలంలో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం కార్పొరేషన్‌కు తెలిపింది.
ఉద్యమనేతల ఆగ్రహం: స్మారక చిహ్నాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అడ్డు తగలడాన్ని ప్రత్యేక తెలంగాణ కోరుతున్న నేతలు తీవ్రంగా నిరసించారు. ఫిబ్రవరి 13 రాత్రి నల్లకుంటలో ఎమ్మెల్యే టి. అంజయ్య అధ్యక్షతన జరిగిన తెలంగాణ సదస్సులో డా|| చెన్నారెడ్డి ప్రసంగిస్తూ, ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నాలను ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్నే అవమానపర్చడమని అన్నారు. స్మారక చిహ్నాల ఏర్పాటు చేయాలనే కార్పొరేషన్ నిర్ణయానికి ప్రభుత్వం అడ్డువస్తే 300 నిండు ప్రాణాలను కోల్పోయిన తెలంగాణ ప్రజానీకం ఎంతమాత్రం సహించబోద’ని డా|| చెన్నారెడ్డి హెచ్చరించారు.
నగర మేయర్ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ‘రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని గూర్చి ప్రధానికి టెలిగ్రామ ద్వారా తెలియజేస్తామ’న్నారు. ‘ఏది ఏమైనా కార్పొరేషన్ నిర్ణయం ప్రకారం తెలంగాణా అమరవీరుల స్మారక చిహ్నాల నిర్మాణం చేసి తీరగలమ’ని ప్రకటించారు.
నగరప్రజా సమితి అధ్యక్షుడు బి. రాందేవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి శాంతాబాయి, శాసనసభ్యులు నర్సింగరావు, మాణిక్‌రావు, ఎం.ఎం. హాష్మీ, ప్రజా సమితి కేంద్ర కార్యవర్గ సభ్యులు ఇ.వి. పద్మనాభం, సంతపురి రఘువీరరావు తదితరులు ‘తెలంగాణ ఏర్పాటుతప్ప మరే పరిష్కారమూ ఆమోదయోగ్యం కాద’న్నారు.
స్మారక చిహ్నాలపై విధానసభలో సావధాన తీర్మానం
‘నగర మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణా మృతవీరుల స్మారక చిహ్నాలను నెలకొల్పరాదని ప్రభుత్వం జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోకపోతే పౌరులు తమంత తామే స్మారక చిహ్నాలు నెలకొల్పగలర’ని విధానసభలో తెలంగాణ ఐక్య సంఘటన సభ్యుడు పోల్సాని నర్సింగరావు అన్నారు. ఐక్య సంఘటనకు చెందిన మరో ఆరుగురు సభ్యులతో కలిసి పోల్సాని నర్సింగరావు తీర్మానాన్ని ప్రతిపాదించారు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం పంపిన నోటీసును ఎస్‌ఎస్‌పికి చెందిన శాసనసభ్యులు బద్రీ విశాల్ పిత్తీ సభలో చదివి వినిపించారు. దీనిపై మాట్లాడడానికి ఎక్కువ వ్యవధి ఇవ్వాలని బద్రీ విశాల్, ఐక్య సంఘటన సభ్యులు కోరినారు.
‘సావధాన తీర్మానంపై సభలో పరిశీలన జరుగుతున్నదా లేక చర్చ జరుపుతున్నారా’ అని హోంమంత్రి జలగం వెంకళరావు ఉప సభాపతి వి.కె. నాయక్‌ను ప్రశ్నించడంతో ఐక్య సంఘటన సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. (చర్చను సోమవారానికి వాయిదా వేశారు).
నిషేధాజ్ఞులు జారీ చేస్తే ధిక్కరిస్తా: మేయర్ ప్రకటన
మృతవీరుల స్మారక చిహ్నాలకు ఫిబ్రవరి 23న శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వం ప్రతికూల పరిస్థితిని సృష్టించినా శంకుస్థాపన చేసి తీరుతామని నగర మేయర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. స్మారక చిహ్నానికి గన్‌పార్క్‌లో మేయర్ లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్ క్లాక్‌టవర్‌లో నెలకొల్పే స్మారక చిహ్నానికి డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తుది ఘట్టం కూడా ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుందని ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 24నుంచి తెలంగాణ అంతటా సదస్సులు జరుపుతామని, అన్ని జిల్లాల్లో డా|| చెన్నారెడ్డి పర్యటిస్తారని ఆయన అన్నారు.
జంటనగరాల్లోని కవాడిగూడ, భోలక్‌పూర్, బాకారం, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థానిక కౌన్సిలర్లు, టి. అంజయ్యతో కలిసి డా|| చెన్నారెడ్డి పాదయాత్ర జరిపారు. తుది పోరాటానికి సిద్ధం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్మారక చిహ్నాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ.. సభ్యుల వాకౌట్
తెలంగాణ మృతవీరుల స్మారక చిహ్నాల ఏర్పాటుపై ఫిబ్రవరి 16న విధానసభ చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న తెలంగాణ ఐక్య సంఘటన సభ్యులు మాణిక్‌రావు ప్రసంగిస్తూ.. ‘బొంబాయిలో శివసేన ఆందోళనలో మరణించినవారి స్మారక చిహ్నాలను బొంబాయి మునిసిపాలిటీ నిర్మించింది. గుజరాత్‌లో కొన్ని స్మారక చిహ్నాలను గుజరాత్ జనతా పరిషత్తు నిర్మించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ విధంగా ఎందుకు జరుగరాద’ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘స్మారక చిహ్నాలను నెలకొల్పరాదని ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం నగర కార్పొరేషన్‌కు నోటీసు జారీ చేసిందో ఆధారాలు చూపాల’ని సంఘటన మరో సభ్యులు జి రాజారాం ప్రశ్నించారు. నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణా ప్రజల అభిమతాలతో ఆటలాడరాదని, వారిని రెచ్చగొట్టవద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సభ్యులు ప్రతిపాదించిన తీర్మానంపై మునిసిపల్ శాఖామంత్రి చెంచురామానాయుడు సమాధానమిస్తూ.. ‘తెలంగాణ మృతవీరుల స్మారక చిహ్నాలను నెలకొల్పరాదని కోరుతూ మునిసిపల్ స్థాయీ సంఘం ఛైర్మన్, మునిసిపల్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, జంటనగరాల పౌరులు విజ్ఞప్తి చేశార’న్నారు. ‘స్మారక చిహ్నాల ఏర్పాటువల్ల శాంతికి విఘాతం ఏర్పడవచ్చునన్న భయసందేహాలను కూడా వారు వ్యక్తం చేశారు. స్మారక చిహ్నాలను నెలకొల్పే ప్రదేశాలు మునిసిపాలిటీలకి చెందిన ఆస్తులుకావు. స్మారక చిహ్నాలు నెలకొల్పడానికి ఉద్దేశించబడిన వ్యక్తులను జాతీయ నాయకులుగా పరిగణించవీలులేద’ని మంత్రి చెంచు రామానాయుడు స్పష్టం చేశారు.
మంత్రి సమాధానం సభ్యులను అసంతృప్తికి గురిచేసింది.
ప్రతిపక్ష నాయకుడు నూకల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ప్రకటన తమకు సంతృప్తిని కలిగించలేదని అన్నారు. స్మారక చిహ్నాల స్థాపనకు అవరోధం కలుగజేసి ప్రజలను రెచ్చగొట్టడానికి బదులుగా, వాటిని అనుమతించి ప్రజలను శాంతింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరినారు.
స్మారక చిహ్నాల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈశ్వరీబాయి ప్రభుత్వాన్ని కోరినారు. స్మారక చిహ్నాల ఏర్పాటును నిలిపివేయాలని కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించినందున ప్రభుత్వం జారీ చేసింది షోకాజ్ నోటీసుకాదని, మున్సిపల్ తీర్మానాన్ని సస్పెండ్‌చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు అని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు సభలో గట్టిగా వాదించారు. మంత్రి సభను పెడదారి పట్టించినందున ఆయనపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రతిపాదిస్తానని పోల్సాని నర్సింగరావు అన్నారు.
స్మారక చిహ్నాల విషయమై తుది నిర్ణయం గైకొనేముందు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోగలనని మంత్రి చెంచురామానాయుడు హామీ ఇచ్చారు.
శాసనోల్లంఘనను ప్రోత్సహించడమే – చెన్నారెడ్డి
నగర పాలక సంస్థకు ప్రభుత్వం అప్పగించిన స్థలాల్లో స్మారక చిహ్నాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించకపోతే శాసనోల్లంఘనకు, శాంతిభద్రతల భగ్నానికి ప్రోత్సహించినట్లు కాగలదని ప్రజాసమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి విలేకర్లతో అన్నారు.
తెలంగాణ జిల్లాలలో కూడా మృతవీరుల స్మారక చిహ్నాలు ఏర్పాటు కాగలవని చెన్నారెడ్డి ప్రకటించారు. స్మారక స్థూపాలపై నాలుగు వైపులా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల చిత్రపటం, కాకతీయ రాజ్య చిహ్నమైన నంది చిత్రించబడగలవని అన్నారు.
తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు ఇస్తూ 28 కోట్ల మిగులు నిధులతో సహా తెలంగాణ అభివృద్ధికి 45 కోట్లు ఇస్తూ ఫిబ్రవరి 18న కేంద్రమంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ ‘ప్రధాని తెలంగాణ సమస్యను అర్థం చేసుకోలేద’ని చెన్నారెడ్డి అన్నారు.
కేంద్రమంత్రివర్గ నిర్ణయం వలన ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో.. ముఖ్యంగా అభివృద్ధి నిధుల వినియోగ పద్ధతిని తెలంగాణ ప్రాంతీయ సంఘం సూచిస్తుంది. తెలంగాణ ప్రాంత ఆదాయ వ్యయాలపై చర్చ జరిపే అధికారం కూడా ప్రాంతీయ సంఘానికి లభిస్తుంది. ప్రభుత్వరంగంలోనూ, కార్పొరేట్ సంస్థలు మొదలైన వాటిల్లో తెలంగాణ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు లభింపజేయడానికి గైకొనవలసిన చర్యలను, నియామక పద్ధతులను కూడా సూచించే అధికారం లభిస్తుంది. తెలంగాణ ప్రాంతీయ సంఘం పనిచేసే తీరుపై మధ్యమధ్యలో గవర్నర్ రాష్ట్రపతికి నివేదికలు పంపాల్సి వుంటుంది.