కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ సిటీల జాబితాలో మన రాష్ట్రంలోని కరీంనగర్‌ కు చోటుదక్కింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. దేశవ్యాప్తంగా వంద నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 90 నగరాలను ఎంపిక చేసింది. మొత్తం ఈ 90 స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 1,91,155 కోట్ల రూపాయలు వ్యయపరచనుంది.

మన రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్‌ నగరం స్మార్ట్‌ సిటీగా ఎంపిక కాగా, ప్రస్తుత మూడో జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించింది. అంటే, ఇప్పటివరకూ మన రాష్ట్రంలో రెండు నగరాలు స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధికి ఎంపికయ్యాయి.

కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొంటూ కరీంనగర్‌ ఎం.పి వినోద్‌ కుమార్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించారు. ఆరు నెలలపాటు పూర్తిస్థాయిలో అధ్యయనంచేసిన మంత్రిత్వశాఖ చివరకు స్మార్ట్‌ సిటీ జాబితాలో స్థానంకోసం పోటీపడాల్సి వుంటుందని పేర్కొంది. మూడో జాబితాలో 40 నగరాల ఎంపికకు జరిపిన కసరత్తులో 45 నగరాలు పోటీ పడగా, అందులో మన కరీంనగర్‌ మెరుగైన ఫలితాలు సాధించి ఆరోస్థానంలో నిలిచింది. కేరళ రాజధాని తిరువనంతపురం అగ్రస్థానంలో నిలిచింది.

స్మార్ట్‌ సిటీల జాబితాలో కరీంనగర్‌ను చేర్చడం పట్ల రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేయాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ఇటీవల తాను ఢిల్లీవెళ్ళిన సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కలసి విజ్ఞప్తి చేశామని కె.టి.ఆర్‌ గుర్తుచేశారు. ఇందుకు కృషి చేసిన వారందరినీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ అభినందించారు.

Other Updates