శ్రీ డాక్టర్‌ కె.వి. రమణ ఐఏఎస్‌ (రిటైర్డ్‌)


మంచి మనుష్యులు, మర్యాదస్తులు, నీతి, నిజాయితీ, నిబద్ధత కలవారు, నిజమైన సత్తావున్నవారు, అనుభవశాలురు, అధ్యయన శీలం, ఆలోచనాశక్తి, ఆచరణ శుద్ధి వున్నవారు ఎన్నికల్లో నిబడ్డం కష్టమే. నిలబడితే నెగ్గడం కష్టమే. నెగ్గితే పరిపాలించడం కష్టమే. ఇదీ ఇప్పుడు రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో పరిపాటిగా మనం అనుభవిస్తున్న స్థితి, దుస్థితి..

ఇలాంటి స్థితిగతుల్లో అనేకాలోచనలతో, అర్ధవంతమైన అనుభవంతో, సారవంతమైన అనుభూతులతో పండిన తల అతనిది. ఆటుపోట్లనెన్నింటినో తట్టుకొని నిలబడి నడిచిన రాజకీయ నావ అతనిది. ఎందరేమన్నా, ఎన్ని విధాల అతన్ని విమర్శించినా, సహనంతో, సంయమనంతో, అందర్నీ కలుపుకొని, ‘విజన్‌ – విజ్‌డమ్‌’ ద్వారా అందర్నీ మెప్పించి, ఒప్పించి పాలించిన పాలన అతనిది.

ఒక దక్షిణ భారతీయునిగా అందులో మరీ వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణలోని మారుమూల గ్రామమైన వంగర నుండి హైద్రాబాద్‌ మీదుగా ఢల్లీలో అతడు ప్రధాన మంత్రి గావడమే ఒక విచిత్రం. ప్రధాన మంత్రి అయి, మెజారిటీ లేని పార్టీలో మనుగడ సాగించి, ఏ పార్టీతో పొత్తు లేకుండా, అయిదేళ్ల పాటు పూర్తి కాలం ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని నడపడం – అదొక విచిత్రం. దేశం అత్యంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రోజుల్లో మన్మోహన సింగ్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానించి ఆయన చేతుల్లో ఆర్థికశాఖను పెట్టి తాను కృష్ణుడై మన్మోహనుడర్జునుడుగా – ఆర్థిక సంస్కరణ రథాన్ని సృజనాత్మకంగా, సమయస్ఫూర్తితో సమంజసంగా నవ్యపథంలో నడిపించడం మరో విచిత్రం. అరాచకానికి, హింసాకాండకు ఆలవాలమై ఎన్నేళ్ళుగానో కొట్టుమిట్టాడుతున్న పంజాబును ప్రశాంతత వైపు మరలించడం ఇంకో విచిత్రం. కాశ్మీర్‌ క్రైసిస్‌ని మరీ ఉధృతం కాకుండా అరికట్టడం అతి విచిత్రం. ఏ ఆర్భాటం లేకుండా, ఏ మాత్రం హంగామా కనబర్చకుండా అమెరికా వారి ఆతి సూక్ష్మ దృష్టికి కూడ దొరకకుండ అణ్వస్త్ర పరీక్షకు అంకురార్పణ చేయడం బహువిచిత్రం.

ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న మౌన యుద్ధమతనిది. అతని మౌనమే ఎన్నోసార్లు అక్కరకొచ్చిందతనికి. అతని ఓపికే, అతని తాత్సారమే, అతని నిర్ణయం తీసుకోలేని అనిర్ణయతత్వమే ఎన్నో చోట్ల గెలిపించిందతన్ని. ఆయన నవ్వు, నడక, మాట, చూపు, హావభావాలు, ఉపన్యాస విన్యాసాలు, వ్యక్తిత్వ వైవిధ్యాలు తెలిసిన వాళ్ళందరు, ఆయన నైజాన్ని ఎరిగిన వారందరు, ‘అనువు కాని చోట అధికుమనరాద’న్న భావ స్వభావాన్ని గుర్తించే వారందరు విశేషానుభవంతో వ్యవహరించే ఒక మేధావిగా, ఒక వివేకిగా, ఒక వికాస పురుషుడిగా, ఒక పరిణతికి ప్రతీకగా సంభావించే అపర చాణుక్యుడతను.

భౌతికంగా వామనుడైతే కావచ్చు కానీ, బౌద్ధికంగా విరాట్‌ స్వరూపుడు. తన నుంచి తాను విడిపోయి దూరంగా నిలిచి తనను తాను విమర్శనాత్మకంగా పరిశీలించానుకొని తన ‘లోపలి మనిషి’తో సంఘర్షించడం ఆయనకొక నిత్యకృత్యం. గుండెలో అగ్నిపర్వతం బద్దలవుతున్నా నిర్విచారంగా, నిర్వికారంగా, నిబ్బరంగా ఓటమిని గొపుగా మలచుకోగలిగే అజేయుడతను, కలసిరాని కాలాన్ని కూడా తన వైపు త్రిప్పుకొన్న మహామహుడతను. ఇంట జయపతాక నెగురవేస్తూ, బయట భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు అతి మెలుకువగా పావు కదిపిన చతురుడతను. సిద్ధాంతాలకు విధేయుడతడు. వ్యక్తులకు కాదు. క్షుద్ర రాజకీయాలకు, అనిబద్ధ విధానవర్తనులకు అందని వాడతడు. అంతుచిక్కనివాడు. అంతర్ముఖుడు. ప్రజాస్వామ్యమంటే ఎనలేని గౌరవమతనికి. ఎన్నికలు లేకుండా ఏండ్ల తరబడి ఒకే వ్యక్తి చేతిలో పార్టీ ఉండటం కన్న, తప్పుల తడకయైనా సరే, ఎన్నికలు నిర్వహించడం మంచిదన్న అభిప్రాయంతో ఏకనాయకాశ్రితంగా వున్న కాంగ్రెస్‌ పార్టీలో దీర్ఘకాలంగా ఎన్నికలు లేక కునారిల్లుతున్న దశలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన సమర్థుడతడు, మత్తగజ సదృశ ధీరత ఆయన స్వంతం. సహనం ఆయనకు పెట్టని కిరీటం. సహజంగా స్వతహాగా సంస్కరణాభిలాషి. ఆయన ప్రతిపాదించిన ప్రతి సంస్కరణ వెనుక సామాన్య ప్రజా హితమే ప్రాతిపదిక. ఆయన వెలిగించిన దీపమే దేశ సౌభాగ్యం. ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో జైళ్ళ శాఖా మాత్యులుగా శిక్షార్హుల మానసిక పరివర్తనకు అది దారి తీస్తుందని ‘ఓపెన్‌ జెయిల్‌ సిస్టము’ను కొత్తగా ప్రవేశపెట్టి, అనంతపురంలో మొట్ట మొదటి ‘ఓపెన్‌ జెయిల్‌’ను ఏర్పాటు చేశాడతను. అప్పటి ఆరోగ్య శాఖామాత్యులుగా ప్రభుత్వ వైద్యు ‘ప్రైవేట్‌ ప్రాక్టీస్‌’ను నిషేధించాడతడు.

అప్పటి విద్యామంత్రిగా రెసిడెన్షియల్‌ విద్యా విధానాన్ని, నవోదయ పాఠశాలలనేర్పాటు చేసినవాడతడు. తెలుగును అధికార భాషగా తీర్చిదిద్దిన వాడతడు. తెలుగు భాషాభివృద్ధికై తెలుగు అకాడమీని ఏర్పాటు చేశాడతడు. దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులుగా శ్రేయోనిధిని ఏర్పరచి, పండితును, వేద పండితులను ప్రోత్సహించిన వాడతడు. సమగ్రమైన దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రశంసలందుకొన్నవాడతడు. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా దేశంలో తొలిసారిగా భూ సంస్కరణలు చేపట్టి సుమారు ఇరవై తొమ్మిది లక్ష ఎకరాలను పేదలకు పంపిణీ చేసిన సంస్కార శీలి అతను. భారత స్వాతంత్య్రానంతరం వచ్చిన రాజకీయ నాయకుల్లో అధికారమనుభవించిన ముఖ్యమంత్రుల్లో ఇలాంటి నిస్వార్ధ బుద్ధి, త్యాగనిరతి కల్గినవాడు అతడు తప్ప మరొకరు లేరు. పంచాయతీ రాజ్‌కు అధికార బదలాయింపు అతడు తలపెట్టిన సంస్కరణల్లో భాగమే. మానవ వనరుల శాఖామాత్యులుగా దేశంలో నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి, సాంకేతిక, శాస్త్రీయ విద్యవైపు యువత దృష్టిని మళ్ళించాడతను. విదేశాంగ విధానం, విదేశీ మారక నిల్వలు, లైసెన్స్‌ విధానం, వ్యవసాయోత్పత్తుల ధర పెంపు, ప్రైవేటు విద్యుదుత్పాదన, ప్రైవేటు సంస్థ, వ్యక్తుల ప్రమేయం, ఉపాధి కల్పనలో ప్రభుత్వేతర సంస్థ భాగస్వామ్యం, భారత దేశ విఫణిలో పాశ్చాత్య కంపెనీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, మెరుగైన జీవన శైలి, ఆర్థిక స్వావలంబన విధానం… సంపన్న భారతం వైపు దూసుకుపోతూన్న విధానాలన్నీ ఆయన తలపెట్టిన ఆర్థిక సంస్కరణ వృక్షం అందించే ఫలాలన్నది నిర్వివాదాంశం. ఈనాటి సుప్రతిష్ఠిత భారతానికి పునాది ఆతను తలపెట్టిన సంస్కరణలే.

రాజకీయాల్లో తనకు తగిన పాత్ర లేదని భావించిన వేళ తన శక్తిని సాహితీ సేద్యానికి వినియోగించిన కృషీవలుడిగా వేయిపడగలు వంటి బృహత్తర నవలను ‘సహస్ర ఫణ్‌’గా హిందీలోకి అనువదించడం అతనికే సాధ్యం. పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ తర్వాత భారత దేశాన్ని పరిపాలించిన పండిత ప్రధాని అతను మాత్రమే. సామాన్యుల్లో సామాన్యుడు, ఆసామాన్యుల్లో ఆసామాన్యుడు. ‘అణోరణియాన్‌ మహితో మహియాన్‌.’ భారత దేశ ప్రణాళికాబద్ధ పురోగమన వాదులైన తొలితరం రాజకీయ నాయకుల్లో చివరివాడతను. వృత్తిరీత్యా అతడు రాజకీయ నాయకుడే అయినా ప్రవృత్తి రీత్యా ఉదాత్త రాజనీతిజ్ఞుడు. ఆయనెవరో కాదు….

ఒక దీర్ఘదర్శి, ఒక సూక్ష్మగ్రాహి. ఒక తాత్త్విక శక్తి. ఒక దీపస్తంభం. భారతీయ సంస్కృతికి మానవాకృతి. తెలుగు నాట పుట్టి, దేశ సౌభాగ్యానికి వెలుగై నిల్చి, శాశ్వత యశస్కుడైన ఈ నాయక శిఖామణి…. భారత జాతి యావత్తు గర్వించ దగ్గ మహోన్నత మూర్తి … తొలి తెలుగు దేశ ప్రధాని… పీవీగా పిలవబడే మన పాములపర్తి వెంకట నరసింహారావు !!

ఈ సంవత్సరం పీవీ శతజయంత్యుత్సవ వత్సరం. ‘పీవీ మన తెలంగాణ ఠీవి’ అని నినదించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవాలను నిర్వహించడం ప్రపంచంలోని తెలుగు జాతి యావత్తు హర్షించే అంశం. ప్రశంసించే విషయం. రాజర్షిగా, కర్మయోగిగా పీవీ ప్రాతః స్మరణీయుడు.
నిత్య స్మరణీయుడు.
నిత్య స్మరణీయుడైన పీవీ కిదే స్మృత్యంజలి.

Other Updates