pataఆధునిక కవిత్వాన్ని సీరియస్‌గా చదువుతున్న పాఠకులకీ, సాధారణంగా కొంతమేరకు అవగాహన ఉన్న పాఠకులకీ నాగరాజు రామస్వామి కవిత్వంలోని భావాత్మక పదజాలం, వర్ణనాత్మకత అందులోని అనుభూతి, ఆర్ధ్రత బోధపడుతుంది.

కొన్ని సామాజిక అంశాలతో సమ్మిళితమై మానసికావేశం, వైయక్తికశీలం, వర్ణనాత్మకత ప్రధానాంశాలుగా సాగిన కవిత్వం సరికొత్త ప్రతీకలతో భావ చిత్రాలతో అలరారింది. ఆధునిక భారతీయ జీవనంలోని సామాజిక, సాంస్కృతిక మార్పులు, విలువలే కవిత్వంలో వివిధ సంప్రదాయాలుగా బలపడ్డాయి. వస్తువును నూతన దృక్కోణంలో ఆవిష్కరించడమే ‘శిల్పం’గా మనం చూస్తున్నాం. విషయ సౌష్టవత కూడా కనిపిస్తుంది. రామస్వామి కవిత్వంలో వస్తు నిర్మాణం, శిల్ప సౌష్టవం ఒక సంప్రదాయానికి చెందినదే. ఇందులోని వర్ణన చదివే పాఠకుడిని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తాయి.

రెక్కలు నావే/కొట్టుకుపోయాయి ఇన్నాళ్ళు/పోకిరి గాలిలో/దిగంతాల ఆవలి ఆకాశాన్ని/వెదుక్కుంటూ వెళ్ళిన/అలిగిన అక్షరం/అసంపూర్ణ వాక్యంగా/ఇంటికి తిరిగొచ్చింది”. గూటికి చేరిన పాట కవితలోని కవితా పంక్తులివి. వస్తు నిర్మాణంలో వేరువేరు భావ చిత్రాలు కనిపించడంవల్ల ఈ సంపుటిలోని కొన్ని కవితలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా అర్థం కావచ్చు. దీనికి కవిత్వంలోని అస్పష్టత అనడంకన్నా నవ్య కవితా రూపాలలో సహజంగా వస్తున్న ఒక ధోరణిగా చెప్పవచ్చు.

సంధ్యా ఛాయలో ఉన్న దంపతుల మానసిక స్థితిని, వారి జీవన గమనాన్ని ”ఇరు పార్శ్వాలం” అనే కవితలో చెబుతారు. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధ దంపతుల గురించి ”ఒంటరి గవాక్షం” అనే కవితలో ”అది ఒక వృద్ధాశ్రమం/అన్ని సౌకార్యాలున్న వసతి గృహం/వాళ్ళు కుంకుతున్న సాయంత్రాలు/ప్రవహించడంమాని పడమటి తీరంమీద/పరుచుకున్న నిశ్చల తటాకాలు” అంటూ ఎంతో హృద్యంగా వర్ణించారు. ‘అదేనీడ’ తరుణోపాయం, మానసలీల, విస్మృత స్వప్నాలు మొదలైన కవితలు వైయక్తిక అనుభూతి, అనుభవాలు, అనుబంధాలలోంచి వచ్చిన కవితలే.

మొత్తం అరవై ఆరు కవితలతో ఉన్న ఈ కవితా సంపుటి సాహిత్య పాఠకుల్ని ఆకట్టుకుంటుంది.

Other Updates