పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ, తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలకు స్ఫూర్తిని ఇచ్చిన సిద్ధిపేట నియోజకవర్గంలోని సిద్ధిపేట మండలం ఇబ్రాహీంపూర్ జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారింది. రాష్ట్ర భారీ నీటిపారుదల , వ్యవసాయ మార్కెటింగ్, రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సారధ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్ఫూర్తితో గ్రామ సర్పంచి కుంబాల లక్ష్మి రాఘవరెడ్డ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఐక్యంగా సాధించిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో కేవలం ఆరు నెలల్లో గ్రామం స్వరూపమే మారింది. దోమలు లేని గ్రామంగా ఎదిగింది. మురికి నీరు వీధుల్లో పారడం లేదు. పారిశుద్ధ్య లోపంతో వచ్చే వ్యాధుల జాడ లేదు. దోమలతో వచ్చే జ్వరాలు మచ్చుకైనా కన్పించడం లేదు. దీనికంతటికీ కారణం ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలే కారణం. ప్రజలంతా సమష్ఠిగా పనులను చేపట్టేందుకు ముందుకు రావడంతో మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ప్రజల భాగస్వామ్యానికి తోడుగా నిధులను జత చేయడంతో యుద్ద ప్రాతిపదికన ఇంకుడు గుంతలను ప్రతి ఇంటికీ నిర్మించడమే కాక, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో పత్రి ఇంటి ముందు ఉన్న ఆవరణను అనుసరించి పత్రి ఇంటి ఆవరణలో రెండు నుంచి పదిహేను మొక్కలను నాటడంతో అవి ప్రస్తుతం చెట్లుగా ఎదుగుతున్నాయి.
మురికి నీటి సమస్యల నుంచి…
ఆరు నెలల కిందట ఇబ్రాహీంపూర్ గ్రామంలో ఎక్కడ చూసినా మురికి నీరు వీధుల్లో పారేది. మురికి కాల్వలు గ్రామం అంతటా నిర్మించక పోవడమే దీనికి కారణం. మురికి కాల్వలు ఇప్పటికే నిర్మించిన చోట వాటి నిర్వహణ భారంగా మారింది. దీంతో చెత్త కాల్వల్లో పేరుకు పోయి మురికి నీరు కాల్వల్లో నిలిచి ఉండేది. దీనికి తోడు మురికి కాల్వలు లేని వీధుల్లో నీరంతా పారి మురికి గుంతలు ఏర్పడేవి. ఫలితంగా దోమలతో గ్రామంలో వ్యాధులు ప్రబలేవి. పారిశుద్ధ్య సమస్యలతో అంటువ్యాధులతో గ్రామస్తులు సతమతమయ్యేవారు. వ్యాధులను నివారించేందుకు వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. వ్యాధులు ముదిరితే వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ప్రభుత్వానికి వైద్య శిబిరాల కోసం అదనపు నిధులు వెచ్చించాల్సి వచ్చేది. మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే వారికి ఆర్థికంగా భారం పడేది. మురికి బాధను తప్పించేందుకు గ్రామంలో మురికి కాల్వలను నిర్మించడానికి నిధుల కొరత వల్ల ఇబ్బందులు కలిగేవి. ఒకవేళ నిర్మించినా.. వాటి నిర్వహణ భారంగా మారే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు.
మహారాష్ట్ర పర్యటన…
ఈ స్థితిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాల పరిశీలన కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం సర్పంచులు, అధికారులతో పాటు, గ్రామాలకు చెందిన యువకులతో క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే 2015 మే నెలలో జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో ఒక బృందం మహారాష్ట్రలోని తుంబుర్నిఅనే గ్రామాన్ని సందర్శించింది. కొండ పాంతమైన తుంబుర్ని గామ్రంలో పారిశుద్ధ్య సమస్యను అధిగమించడానికి చేపట్టిన కార్యకమ్రాలను ఈ బృందం పరిశీలించింది. సిద్ధిపేట మండల పరిషత్తు అభివృద్ధి అధికారి సమ్మిరెడ్డి, ఇబ్రాహీంపూర్ గ్రామ సర్పంచి కుమారుడు ఎల్లారెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. ఈ గామ్రంలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం వీరిని ఆకట్టుకుంది. బృందంలోని మిగిలిన సభ్యులు ఇంకుడు గుంతల నిర్మాణం పట్ల పెదవి విరిచినా గ్రామ సర్పంచి లక్ష్మిరాఘవరెడ్డి కుమారుడు ఎల్లారెడ్డిని విశేషంగా ఆకట్టుకుంది. ఆయన అక్కడి అధికారులతో మాట్లాడి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని అడిగి తెలుసుకున్నారు. దానికయ్యే ఖర్చును, నిర్మించిన తర్వాత వచ్చిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సర్పంచి లక్ష్మిరాఘవరెడ్డితో పాటు మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓఎస్డీ బాలరాజుతో పాటు మంత్రిని కలిసి ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల ఒనగూరిన ప్రయోజనాలను వివరించారు. తమ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడతామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అనుమతిని పొందారు. ఇందు కోసం గ్రామస్తులను చైతన్యం చేసి వారిని భాగస్వాములను చేస్తామని, ఇంటికో ఇంకుడు గుంత నిర్మించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు అనుమతిని ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామంలోఇంకుడు గంతలను నిర్మించేందుకు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా గంత నిర్మాణ నమూనాను ఇక్కడి మేస్త్రీల సాయంతో మార్చుకున్నారు.
రూ.13లక్షల ఖర్చుతో తప్పనున్న రూ.1.30కోట్లు
గ్రామంలో 365 కుటుంబాలకు 270 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పత్రి ఇంటికి ఒక ఇంకుడు గుంతను నిర్మిస్తే ఒక్కో ఇంకుడు గుంతకు రూ.4,500 ల నుంచి రూ.6,000ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీంతో 270 ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించేందుకు మొత్తం రూ.12,15,000ల నుంచి రూ.16,20,000ల వరకు ఖర్చవతుందని అంచనా వేశారు. మొత్తం మీద సగటున రూ.13లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే గామ్రం మొత్తంలో వీధులన్నింటిలో మురికి కాల్వలను నిర్మించాల్సి వస్తే సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం నిర్మించాల్సి ఉందని ఇందు కోసం రూ.1.3కోట్లు ఖర్చు అవుతుందని నిర్ధారించారు. మురకి కాల్వలను నిర్మించినా…. నీరంతా కాల్వల్లో నిలచి దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశలను తగ్గించ లేమని, అదీ కాక మురికి కాల్వల నిర్వహణ భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని కేవలం రూ.13లక్షలతో పత్రి ఇంటికి ఇంకుడ గుంతను నిర్మించవచ్చునని పత్రిపాదించారు. దీనివల్ల మురికి నీటి భాధను శాశ్వతంగా నివారించడమే కాక భూగర్భ జలాలలను గణనీయంగా పెంపొందించి ప్రజలందరికీ పరిశుద్ధమైన మంచినీటిని అందిచవచ్చునని ప్రతిపాదించారు. వీటిని పరిశీలించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ నిధులను మంజూరు చేసేందుకు ముందుకు రావడమే కాక, గ్రామ జ్యోతి కార్యక్రమం కింద గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ఇబ్బందులను అధిగమించి…
గ్రామంలో ఇంకుడు గుంతలు నిర్మించేందుకు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరినందుకు గిట్టని వాళ్లు రకరకాలుగా వ్యాఖ్యానించడం ప్రారంభించారు. మురికి కాల్వలను నిర్మించలేక ఇంకుడు గుంతల ప్రతిపాదనల తెస్తున్నారని విమర్శించిన వాళ్లు లేక పోలేదు. దీంతో గ్రామస్తుల్లో చైతన్యం తేవడం ఇబ్బందిగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించారు. దీంట్లో భాగంగానే మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఓఎస్డీ బాలరాజు, మండల పరిషత్తు అభివృద్ధి అధికారి సమ్మిరెడ్డి, గ్రామ సర్పంచి లక్ష్మీరాఘవరెడ్డి, వారి కుమారుడు ఎల్లారెడ్డి, గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులతో కూడిన, వార్డు సభ్యులతో బృందం మొదట గ్రామస్తులను సమావేశపర్చి ఇంకుడు గుంతల వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. వారిలో నమ్మకం కల్గించడానికి ముందుగా నీరంతా ఎక్కడైతే నిలిచి మురకి గుంతలుగా మారుతుందో అక్కడ వీటిని నిర్మించాలని, వాటి పలితాలను బట్టి మిగిలిన చోట్ల నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామస్తులను అతి కష్టం మీద ఒప్పించారు. ఇందు కోసం నిత్యం నీటితో నిల్వ ఉండే మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద ముందుగా ఇంకుడు గంతను నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద ఇంకుడు గుంతను నిర్మించారు. ఇక్కడ నిల్వ ఉండే నీటిని గుంతలోకి మళ్లించారు. రెండు రోజుల్లో నిల్వ నీరు భూమిలోకి ఇంకి పోయింది. అంతే కాక, గామ్రస్తుల్లో మరింత నమ్మకం కల్గించడం కోసం మంచినీటి బోరు నుంచి నీటిని రెండు రోజుల పాటు మళ్లించారు. సుమారు 24 గంటల పాటు నీటిని నిరంతరాయంగా గుంతలోకి పెట్టారు. నీరంతా భూమిలోకి ఇంకడంతో గ్రామస్తులను సమావేశ పరిచి వారి సమక్షంలో గుంతను తవ్వించి పరిశీలింపజేశారు. దీంతో ఇంకుడు గుంత బాగా పని చేస్తోందని గుర్తించిన గ్రామస్తులు ఇంకుడు గుంతల నిర్మాణానికి మందుకు వచ్చారు. దీంతో మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు.
270 ఇంకుడు గుంతల పూర్తి
మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఇంకుడు గుంతల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో ప్రతి ఇంటికి ఇంకుడు నిర్మించారు. కేవలం మూడు నెలల్లో గామ్రంలోని 365 కుటుంబాలకు సంబంధించిన 270 ఇళ్లలో 270 ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇందు కోసం ఇంటి యజమానులకు ఎలాంటి ఖర్చు కాదు. వర్షాలు కురిసినపుడు ఇంటి పైకప్పుతో పాటు ఆవరణలోని నీటిని పైపుల ద్వారా ఇంకుడు గుంతలోకి మళ్లేలా చర్యలు చేపట్టారు. వంట గదితో పాటు స్నానపు గదుల నుంచి వచ్చే నీటిని పైపుల ద్వారా ఇంకుడు గుంతలోకి మళ్లించారు. దీంతో ఇంకుడు గుంతల్లోకి నీరు వెళ్లి భూమిలోకి వెళుతోంది. ఫలితంగా ఒక్క చుక్క నీరు కూడా వీధుల్లోకి రావడం లేదు. దీంతో గ్రామంలో మురికి గుంతల బాధ తప్పింది.
గ్రామస్తులకు రూ.36లక్షల వైద్య ఖర్చులు మిగులు
ఇంకుడు గుంతలు నిర్మించక ముందు మురికి నీరంతా గ్రామంలోని వీధుల్లో నిలిచేది. రోజుల తరబడి నీరంతా వీధిలో నిలిచిఉండేది. దీంతో దోమలు పెరిగి ఇబ్బందులు కలిగేవి. దోమలతో మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గున్యా వంటి వ్యాధులతో పాటు, పారిశుద్ధ్య లోపంతో వివిధ అంటు వ్యాధులు సోకేవి. దీంతో ఈ వ్యాధులకు వైద్యం చేయించుకునేందుకు గామ్రస్తులకు విపరీతమైన ఖర్చు అయ్యేది. ఫలితంగా గామ్రంలోని ప్రతి కుటుంబం ఏటా వైద్య ఖర్ఛుల కోసం కనీసం రూ.10వేలు ఖర్చు చేసేవారు. దీంతో గామ్రంలోని మొత్తం 365 కుంటుబాలకు ఏటా సుమారు రూ.36.5లక్షలు ఆదా అయ్యిందంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా వైద్య సహాయం కోసం వైద్య శిబిరాలు నిర్వహించాల్సి వచ్చేది. ఇంకుడు గుంతలు నిర్మించినప్పటి నుంచి దోమల బెడద, పారిశుద్ధ్యం బాధ తప్పడంతో వ్యాధులు పూర్తిగీ తగ్గి పోయాయయి. జ్వరాలు నమోదు కావడం లేదు. అంతే కాక ఇంకుడు గుంతలు లేనప్పుడు పారిశుద్ధ్య లోపం, దోమల వల్ల వచ్చే వ్యాధులతో బాధ పడే వారు వారాల తరబడి ఇంట్లో విశ్రాంతి తీసుకోవలిసి రావడం వల్ల పని దినాలను కోల్పోవలసి వచ్చేది. దీంతో అదనంగా నష్ట పోయేవారు. ప్రస్తుతం ఇంకుడు గుంతల నిర్మాణంతో ఈ బాధలన్నీ తప్పాయి.
పెరిగిన భూగర్భ జలాలు
– పత్రి రోజు భూమిలోకి ఇంకుతున్న లక్ష లీటర్ల నీరు
ఇబ్రాహీంపూర్‌లో ఇంకుడు గుంతలను నిర్మించక ముందు గామ్రంలోని 365 కుటుంబాలకు గామ్రీణ మంచినీటి సరఫరా పథకం కింద సరఫరా అయ్యే నీటిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, ఇళ్లు శుభం చేయడం, వంట సామాగ్రి శుభ్ర్రం చేయడం వంటి కారణాల వల్ల సరఫరా అయ్యే నీటిలో సుమారు 90 శాతం వృధాగా వీధుల్లోకి, మురికి కాల్వల్లోకి వెళ్లి వృధా అయ్యేది. దీంతో ఈ నీరంతా ఆవిరి రూపంలో వెళ్లడంతో సుమారు లక్ష లీటర్ల నీరు ప్రతి రోజు వృధా అయ్యేది. ఇంకుడు గుంతలు నిర్మించినప్పటి నుంచి ప్రతి రోజూ సుమారు లక్ష లీటర్ల నీరు భూమిలోకి ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకుతోంది. ఫలితంగా గ్రామంలో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
వీధుల్లో కన్పించని చెత్త
ఇంకుడు గుంతలతో చైతన్యవంతులైన గ్రామస్తులు పారిశుద్ద్యం పట్ల పస్త్రుతం అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోని బడి ఈడు పిల్లలు మొదలుకుని 70 ఏళ్ల ముదుసలి వరకు ఎవరు కూడా వీధిలో చిన్న కాగితం ముక్క కన్పించినా తనకెందుకు అనుకోవడం లేదు. వెంటనే స్పందిస్తున్నారు. చెత్తను వీధిలో నుంచి తొలగించి చెత్త తొలగించి తమకు ఇచ్చిన చెత్త బుట్టల్లో వేసి పత్రి రోజు చెత్త సేకరణకు వచ్చే ట్రై సైకిళ్లలో వేస్తున్నారు.దీంతో గ్రామంలో ఏవీధిలో కూడా చెత్త కన్పించకుండా పరిశుభంగా ఉంటోంది. అంతే కాక మంచినీటి సరఫరాను నియంత్రించే గ్రామ పంచాయతీ కార్మికుడు చెత్త వీధుల్లో పడవేయకుండా పత్రి రోజు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
మొక్కల పెంపకంతో హరిత శోభ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో నాటిన 40 వేల మొక్కలు ఏపుగా పెరుగుతుండడంతో గ్రామంలో హరిత శోభ నెలకొంది. గ్రామంలోని 270 ఇళ్లలో ఇంటికి 2 నుంచి 15 మొక్కలు పంపిణీ చేసి నాటించారు. వీటిలో జామ, ఉసిరి, బొప్పాయి, నిమ్మ వంటి పల్ల చెట్లతో పాటు నీడనిచ్చే మొక్కలు ఉన్నాయి. ఇలా పంపిణీ చేసిన మొక్కలలో గ్రామంలోని ఇళ్లలో మూడు వేల మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి. రైతులకు సంబంధించిన పొలం గట్లపైనా, వ్యవసాయ క్షేత్రాలలో 29,650 మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.చెరువుల వద్ద వెయ్యి మొక్కలు పెంచుతున్నారు. దేవాలయాల ఆవరణ, రహదారుల పక్కన , ఇతర ప్రాంతాలలో 8వేల మొక్కలు నాటడంతో అవి ఏపుగా ఎదుగుతూ పచ్చదనాన్ని పంచుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
గ్రామానికి వస్తున్న సందర్శకులు
ఇంకుడు గుంతల నిర్మాణంతో జాతీయ స్థాయిలో ఇబ్రాహీంపూర్ ప్రత్యేకతను సంతరించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు ఇబ్రాహీంపూర్ గామ్రాన్ని సందర్శించి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. దీంతో గ్రామం పర్యాటక శోభను సంతరించుకుంది. న్యూఢిల్లీకి నుంచి టెయ్రినీ ఐఏఎస్ అధికారులు, లక్షద్వీప్, ఒడిషాకు చెందిన అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాన్ని సందర్శించి ఇంకుడు గుంతలను పరిశీలించి అబ్బుర పడుతున్నారు. ఇప్పటి వరకు వివిద ప్రాంతాల నుంచి మూడు వేల మంది ఇబ్రాహీంపూర్ గామ్రాన్ని సందర్శంచారు.
ఇంకుడు గుంత నిర్మాణం ఇలా
ఇంకుడు గుంతను నిర్మించేందుకు ముందుగా 4.5 అడుగుల చొప్పున పొడవు, వెడల్పులతో ఆరు అడుగుల లోతు గుంతను తవ్వారు. కింది నుంచి 4.5 అడుగుల ఎత్తు వరకు 60 మి,మీ ల కంకర వేస్తున్నారు. సరిగ్గా మధ్యలో 2.5 అడుగుల వ్యాసం ఉండే సిమెంటు గోళాన్ని నిలిపి గోళం పైభాగంలో రంద్రాలు ఏర్పాటు చేసి రంద్రాల గుండా పైపులు బిగించి గోళం చుట్టూ 1.5 అడుగుల ఎత్తు వరకు 40మి.మీల కంకరను నింపి గోళెంపై ప్లాస్టిక్ కవర్ వేసి బండతో గోళాన్ని మూసి వేస్తున్నారు. గోళానికి బిగించిన పెపులను ఇంటి ఆవరణలోని నీటిని, ఇంటి పైకప్పు నీటిని, వంటగది, స్నాపుగదులు, ఇంటిని శుభం చేసినపుడు బయటకు వచ్చే నీటిని వచ్చే పైపులను చాంబర్ వద్ద కలిపి జాలిని నమర్చుతున్నారు. పైపుల ద్వారా వచ్చే చెత్త జాలి వద్ద ఆగిపోతుంది. ఆతర్వాత ఇంకా చెత్త ఉండే పైపుల ద్వారా గోలంలోకి నీరు చేరి గోళం నిండి పొర్లి నపుడు నీరంతా ఇంకుడ గుంతోకి వెళ్లి భూమిలోకి వెళుతోంది. గోళం పై కప్పు కింద వేసిన ప్లాస్టిక్ పేపర్ చెత్త ఇంకుడు గుంతలోకి వెల్లకుండా ఆపుతోంది.