– దేవులపల్లి ప్రభాకర రావు
ఈ నెలలో (2016 ఆగస్టు) స్వతంత్ర భారతదేశం అరవయి తొమ్మిది సంవత్సరాలు నిండి డెబ్బయవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. స్వతంత్ర భారత సప్తతి ఉత్సవాలు జరుగుతున్నప్పటికి, ఇది యువదేశమే. ఈనాటి నూటా ఇరవయి ఏడు కోట్ల భారత జనాభాలో సగం కంటె ఎక్కువ మంది ఇరవయి అయిదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వాళ్లు – దేశ జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సువారు. డెబ్బయవ సంవత్సరంలో ప్రవేశించినప్పటికి నిశ్చయంగా ఇది యువదేశం. పదికోట్ల మంది వృద్ధులతో ఇది పరిణతి చెందిన దేశం గూడ. స్వాతంత్య్రం సిద్ధించడానికి ముందే వివిధ వర్గాల ప్రతినిధులతో, నాయకులతో ఏర్పాటయిన భారత రాజ్యాంగ నిర్ణయ సభ మూడు సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించింది. తొంబయి సంవత్సరాలు (1857 – 1947) వివిధ దశలలో, విభిన్న దిశలలో కొనసాగిన భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాల మూలసూత్రాలు, ప్రధాన ఆశయాలు, ప్రాతిపదిక ఆదర్శాలకు అనుగుణంగా, స్వతంత్ర భారతదేశం అనుసరించవలసిన విధానాలకు మార్గదర్శకంగా స్వతంత్ర భారత రాజ్యాంగం రూపొందింది. స్వతంత్ర భారతదేశాన్ని ‘సార్వభౌమాధికార సోషలిస్టు సెక్యులర్ ప్రజాతంత్ర రిపబ్లిక్’ గా భారత రాజ్యాంగం తన అవతారికలో ప్రకటించిం ది. స్వతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదిన అమలులోనికి రావడంతో భారతదేశం మతాలకు అతీతమయిన ఒక ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా ప్రపంచం ముందు నిలిచింది. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇదొక మహత్తర సంఘటన, కీలక రాజకీయ పరిణామం. ఆధునిక ప్రపంచంలో అన్నింటికన్న పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల స్వతంత్రదేశంగా భారత దేశం అవతరించింది. స్వాతంత్య్రం లభించేనాటికి దేశ జనాభా 36 కోట్లు గూడ కాదు; గత 69 సంవత్సరాల కాలంలో స్వతంత్ర భారత దేశం జనాభా ఎంతో పెరిగి ఈ రోజు 127 కోట్ల స్థాయిని దాటింది. రానున్న కొన్ని సంవత్సరాల కాలంలో భారత జనాభా చైనా జనాభాను అధిగమించి ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానంలో నిలువగలదని అంచనా. ఇప్పటికీ స్వతంత్ర భారతదేశం ప్రధానంగా గ్రామీణ భారతమే – దేశ జనాభాలో దాదాపు 69 శాతం మంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ వ్యవసాయం తదితర గ్రామీణ వృత్తుల మీదనే జీవనోపాధి కోసం ఆధారపడుతున్నారు. స్వాతంత్య్ర సిద్ధి తరువాత అయిదు సంవత్సరాల వరకు దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు (82.7 శాతం మంది) గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు. తరువాత అరవయి సంవత్సరాల కాలంలో (2011 నాటికి) విద్య, వైద్యం, ఉపాధి తదితర కారణాల వల్ల దాదాపు 15 శాతం మంది పట్టణాలకు వచ్చి స్థిరపడ్డారు.
గత అరవయి తొమ్మిది సంవత్సరాల కాలంలో స్వతంత్ర భారతదేశం వివిధ రంగాలలో, విశేషించి వ్యవసాయిక, పారిశ్రామిక, సామాజిక, వైజ్ఞానిక (సైన్సు – టెక్నాలజీ), విద్యారంగాలలో బహుముఖ అభివృద్ధిని సాధించి ఈ రోజు ప్రపంచంలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అగ్రగణ్య దేశంగా నిలువగలుగుతున్నది. విశేషించి అణుశక్తి పరిశోధన, అంతరిక్ష శోధన, ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రంగాలలో భారతదేశం పాశ్చాత్య దేశాలలో సైతం పోటీపడగల స్థాయికి చేరుకోవడం సాధారణ విజయం కాదు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నాలుగు సంవత్సరాలకు దేశం జనాభాలో అక్షరాస్యుల సంఖ్య (1951లో) 18 శాతం మాత్రమే. నాలుగు సంవత్సరాల కిందటి (2011) లెక్కల ప్రకారం దేశ జనాభాలో అక్షరాస్యుల సంఖ్య 74 శాతానికి పెరిగింది – విద్యారంగంలో జరిగిన అభివృద్ధికి, విస్తరణకు ఇదొక సూచిక. విద్యా, వైజ్ఞానిక రంగాలతో పాటు ఆరోగ్య, వైద్య, ప్రజా సంక్షేమ రంగాలలో గూడ స్వతంత్ర భారతదేశం గణనీయ ప్రగతిని సాధించగలిగింది.
స్వాతంత్య్రానంతరం పదిహేను సంవత్సరాలకు దేశంలో శిశు మరణాల రేటు ప్రతి వేయి సజీవ జననాలకు 115; తరువాత యాభయి సంవత్సరాలకు 2011లో శిశు మరణాల రేటు 44 వరకు తగ్గింది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ, సంక్షేమ జాతీయ కార్యక్రమాన్ని, జాతీయ ఆరోగ్య విధానాన్ని అమలు జరపడం వల్ల శిశుమరణాల రేటు, బాలింతల మరణాల రేటు తగ్గడం వంటి సత్ఫలితాలు కన్పించాయి. కుటుంబ నియంత్రణ – సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధ్వర్యాన ఒక జాతీయ కార్యక్రమంగా ప్రవేశపెట్టిన, అనులు జరిపిన మొట్టమొదటి దేశం స్వతంత్ర భారతదేశం. విద్యా, ఆరోగ్య, వైద్య రంగాలలో జరుగుతున్న అభివృద్ధి దేశం సర్వతోముఖ ప్రగతికి ఒక కొలమానం వంటిది. పలు పంచవర్ష ప్రణాళికలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా పారిశ్రామీకరణ, ఉపాధి అవకాశాలు దేశంలో క్రమంగా నగరాలు, పట్టణ ప్రాంతాలు విస్తరించడానికి దోహదపడ్డాయి. 1947లో స్వాతంత్య్ర సిద్ధి నాటికి దేశ వైశాల్యంలో 17.3 శాతం భాగం మాత్రమే పట్టణ ప్రాంతం. 2011 లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతం 31.16 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల కొన్ని సమస్యలు లేకపోలేదు.
భారత ఉపఖండం విభజనతో స్వతంత్ర భారతం అవతరించింది గనుక దేశం సామాజికంగా, ఆర్థికంగా కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పటి భారత ప్రభుత్వ నాయకత్వం (ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తదితరులు) ఈ సమస్యలను రాజనీతిజ్ఞతతో, పరిపాలనా దక్షతతో ఎదుర్కొని దేశంలో రాజకీయ సుస్థిరత్వానికి, సామాజిక సామరస్యానికి, పరిపాలనా పటిష్టతకు, ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడింది.
ముఖ్యంగా చెప్పవలసింది ఇండియన్ యూనియన్‌లో అయిదు వందలక మించిన చిన్న సంస్థానాల, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ వంటి పెద్ద రాష్ట్రాల విలీనం. ఒక వంక కోట్లాది సామాన్య ప్రజల సంక్షేమానికి మరోవంక వ్యావసాయిక, పారిశ్రామిక, వైజ్ఞానిక ప్రగతికి ప్రాధాన్యం ఇస్తున్న పంచవర్ష ప్రణాళికలు, ఇతర పథకాలు ప్రారంభమయినాయి – ఆధునిక దేవాలయాల వంటి ప్రాజెక్టులు, పరిశ్రమాగారాలు, పరిశోధనాగారాలు ఎన్నో నిర్మితమయినాయి. అదొక అపూర్వ పునర్నిర్మాణ, పునరుజ్జీవన ఘట్టం.
సామాన్య ప్రజాకోటికి బ్యాంకులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో 1969, 1980 సంవత్సరాలలో మొదట 14 తరువాత 6 భారీ బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. ఆహార రంగంలో స్వయం సమృద్ధి కోసం స్వతంత్ర భారతదేశం నారమన్ బోర్లాగ్ వంటి ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో హరిత విప్తవాన్ని సాధించగలిగింది. పాశ్చాత్య దేశాలు అడ్డుపడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం 1974లో పోఖ్రాన్‌లో అణుపాటవ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి అణుశక్తి పరిశోధన రంగంలో ముందంజ వేసింది.
అంతరిక్ష పరిశోధన, క్షిపణుల నిర్మాణంలో స్వతంత్ర భారతదేశం సాధిస్తున్న గణనీయ విజయాలు పాశ్చాత్య దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ చట్టం, పంచాయితీ రాజ్ తదితర స్థానిక స్వపరిపాలనా సంస్థల అధికారాలను విస్తరించడానికి భారత రాజ్యాంగంలో జరిగిన సవరణలు, నూతన విద్యావిధానం రూపకల్పన గడిచిన ఏడు దశాబ్దాల ప్రగతి పథంలో చెప్పుకోదగ్గ మైలురాళ్లు. కోట్లాది ప్రజల అభ్యుదయం, శ్రేయస్సు ప్రధాన లక్ష్యాలుగా స్వతంత్ర భారతదేశం తన జాతీయ విధానాలను రూపొందించి అమలు జరిపింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండు శత్రు కూటములుగా ముక్కలయిన ప్రపంచంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి భారతదేశం అంతర్జాతీయ రంగంలో అలీన విధానంతో అలీన ఉద్యమానికి నాయకత్వం వహించింది.
డెబ్బయి సంవత్సరాలు నిండబోతున్న స్వతంత్ర భారతదేశం ప్రజా స్వామ్య సూత్రాలను, విధానాలను, సంప్రదాయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను పదిలపరచి, పటిష్టం కావించి, ప్రపంచానికి ఒక మహోన్నత ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచింది. అనేక దేశాలలో ముఖ్యంగా పొరుగు దేశాలలో అరాచక నిరంకుశ శక్తులు బలపడి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుండగా భారత ప్రజలు మాత్రం తమ ప్రజాస్వామ్యాన్ని పదిలంగా కాపాడుకొని మూడు పూవులు ఆరు కాయలుగా పెంపొందించుకున్నారు.
స్వతంత్ర భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తరువాత 1952లో దేశమంతట మొదటిసారి లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగి దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారత పార్లమెంటులో ఒకటి ప్రజలు (21 సంవత్సరాలు నిండిన వారందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా వోటింగ్ హక్కులు కలిగి ఉన్నారు. తరువాత 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వోటు హక్కు లభించింది.) వోటర్లు నేరుగా ఎన్నుకున్న లోకసభ; రెండవది పరోక్షంగా వివిధ రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకున్న రాజ్యసభ.
రెండు సంవత్సరాల కిందట 2014 ఏప్రిల్, మే మాసాలలో 16వ లోకసభ ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 16వ లోకసభ ఎన్నికల సందర్భాన దేశంలో మొత్తం వోటర్ల సంఖ్య 81 కోట్లు. ఇందులో 55 కోట్ల మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత మంది వోటర్లు ఉన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. గత అరవయి తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మహత్తర సంఘటన 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడం. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిభావంత నాయకత్వాన, విజ్ఞతా పూర్వక నేతృత్వంలో, మార్గదర్శకత్వాన, ఆయన వజ్ర సంకల్పంతో, అకుంఠిత దీక్షతో పదమూడు సంవత్సరాల అపూర్వ ప్రజా ఉద్యమం విజయవంతం కావడం, ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత బహుముఖ అభివృద్ధి మార్గంలో పయనించడం ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సాటిలేని, నిరుపమాన చరిత్రాత్మక సంఘటనలు.