స్వతంత్ర భారత రిపబ్లిక్ కు ఈ సంవత్సరం(2018) జనవరి 26వ తేదీన అరవయి ఎనిమిది సంవత్సరాలు నిండుతున్నాయి. ఇదొక చరిత్రాత్మక, మహత్తర సంఘటన. దేశభక్తి పూరితుడయిన ప్రతి భారతీయుడు సగర్వంగా తల ఎత్తవలసిన సమయం. జాతీయంగా, అంతర్జాతీయంగా పలు అవరోధాలను అధిగమిస్తూ, అనేక విజయాలను సాధిస్తూ స్వతంత్ర భారత రిపబ్లిక్ అంతర్జాతీయ రంగంలో అగ్రగణ్య స్థానంలో నిలిచింది. ఇది భారతీయులందరికి గర్వకారణం. 1757లో బెంగాల్ లో ప్లాసీ యుద్ధరంగాన సిరాజుద్ధౌలా పరాజయం తరువాత దాదాపు రెండువందల సంవత్సరాలు భారతదేశంలో బ్రిటిష్ పెత్తనం, బ్రిటిష్ పాలన కొనసాగాయి. 1757 అనంతరం వంద సంవత్సరాలకు 1857లో సకల భారతావనిలో, పరాయి పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమర జ్వాలలు రగుల్కొన్నాయి. ఈ సమరంలో తెలంగాణ బిడ్డలు గూడ గణనీయ పాత్ర నిర్వహించడం విశేషం.
అది ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం. బ్రిటిష్ పాలకుల దమన నీతి పర్యవసానంగా ప్రథమ భారత స్వాతంత్య సమరం తాత్కాలికంగా విఫలమయినప్పటికీ నాడు నాటిన స్వాతంత్య్ర బీజాలు వాడిపోలేదు. తరువాత తొంభై సంవత్సరాలు నిరంతరంగా భారత జాతీయ స్వాతంత్య్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి విజంభించాయి. పలు పాయలలో, ప్రవాహాలలో భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాలు బహుముఖంగా విస్తరించాయి. ఈ ఉద్యమాలలో ఉత్తేజితులయి పాల్గొన్న లక్షలాది దేశభక్తులు, స్వాతంత్య్ర యోధులు సాటిలేని, నిరుపమాన త్యాగాలు చేశారు. 1885 డిసెంబరులో స్థాపితమయిన భారత జాతీయ కాంగ్రెస్, గాంధీ మహాత్ముని నేతత్వంలో భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాలకు సారధ్యం వహించింది.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన ఈ దేశంలో బ్రిటిష్ పాలన అంతమయింది. భారతదేశానికి ఆ రోజు స్వాతంత్య్రం సిద్ధించింది. భారత ప్రజలు స్వాతంత్య్రానికి, స్వపరిపాలనకు అర్హులు కారని, స్వతంత్ర భారతదేశం అనతికాలంలోనే ముక్కచెక్కలయి కుప్పకూలుతుందని కొందరు భయసందేహాలు వ్యక్తపరిచారు. వీరిలో ప్రముఖుడు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సర్ విన్స్‌టన్ చర్చిల్. వారి భయ సందేహాలకు ఆస్కారం లేదని 1947 ఆగస్టు 15 నాటి నుంచి అనేక అవరోధాలు ఎదుర్కొంటూనేె ఎన్నో ముందడుగులు వేసి స్వతంత్ర భారతదేశం ప్రపంచం ముందు నిరూపించింది. భారత స్వాతంత్య్ర సమరం, స్వతంత్ర భారత పురోగమనం అనేక దేశాలలోని విముక్తి ఉద్యమాలకు ప్రేరణ, స్ఫూర్తి కల్గించాయి. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా స్వతంత్ర భారతదేశం స్వపరిపాలనా వ్యవస్థకు అవసరమయిన పునాదులు నిర్మించింది. ఉక్కుమ నిషి సర్దార్ పటేల్ సమర్ధవంత నాయకత్వంలో హైదరాబాద్, జమ్మూ-కాశ్మీరు తదితర అయిదువందలకు మించిన సంస్థానాలు స్వతంత్ర భారత యూనియన్‌లో విలీనమయి నాయి. తత్ఫలితంగా పటిష్ఠమయిన భారత ఫెడరల్ వ్యవస్థ రూపు దాల్చింది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పటిష్ఠ ప్రాతిపదిక ఈ ఫెడరల్ వ్యవస్థ. బ్రిటిష్ పాలన ఈదేశంలో(అప్పటికి అవిభక్త భారతదేశం) అంతమయ్యే ముందు బ్రిటిష్ పాలకులు రూపొందించిన క్యాబినెట్ మిషన్ రూపొందించిన పథకానికి అనుగుణంగా నియమితమయిన రాజ్యాంగ నిర్ణయసభ 1946 డిసెంబర్ 9వ తేదీన ప్రథమ పర్యాయం సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన సమావేశమయింది. లండన్ లో బ్రిటిష్ పార్లమెంటు 1947 జూలై 1వ తేదీన భారత స్వాతంత్య్ర ప్రధాన చట్టాన్ని(భారత ఉపఖండ విభజన జరుపుతూ) ఆమోదించింది. 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర భారతదేశం అవతరించడానికి ఒక రోజు ముందు ఆగస్టు 14వ తేదీన సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్ణయ సభ సమావేశం జరిగింది. ఆరోజు నుంచే అది భారత రాజ్యాంగ నిర్ణయ సభగా తన విధి నిర్వహణ ప్రారంభించింది. సిన్హా మతి కారణంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ నిర్ణయ సభ అధ్యక్షులయినారు.
స్వాతంత్య్ర సమరయోధులు, అతిరథ మహా రధమహా నాయకులు, ఉద్దండ మేధావులు, న్యాయ శాస్త్ర నిష్ణాతులు, ప్రజాసేవా పరాయణులు రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యులుగా వ్యవహరించా రు. ప్రఖ్యాత రాజ్యాంగ న్యాయశాస్త్రవేత్త బి.ఎన్.రావు (అంత ర్జాతీయ న్యాయస్థానంలో మొట్టమొదటి భారత న్యాయమూర్తి) భారత రాజ్యాంగ నిర్ణయసభకు రాజ్యాంగ విషయాల సలహాదారుగా 1946లోనే నియమితులయినారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తగినట్లుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో బి.ఎన్.రావు నిర్వహించిన పాత్ర గణనీయమయినది, శ్లాఘనీయమైనది. రాజ్యాంగ రచన (డ్రాఫ్టింగ్) కమిటీకి న్యాయశాస్త్ర పారంగతుడు డా.బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఉద్దండ న్యాయశాస్త్రవేత్తలు కె.ఎమ్.మున్షీ, అల్లాడి
కష్ణస్వామి అయ్యర్, ఎన్.గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బి.ఎల్.మిత్తర్, డి.పి.ఖైతన్ రాజ్యాంగ రచన కమిటీలో సభ్యులు. తరువాత మిత్తర్ స్థానంలో ఎన్.మాధవరావు, ఖైతాన్ స్థానంలో టి.టి. కష్ణమాచారి రచనా కమిటీ సభ్యులయినారు.
రాజ్యాంగ నిర్ణయ సభలో మొత్తం 389 మంది సభ్యులుగా వ్యవహరించారు. 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ నిర్ణయసభ రాజ్యాంగ రచన(డ్రాఫ్టింగ్) కమిటీని నియమించింది. మూడు సంవత్సరాల నిర్విరామ కషితో స్వతంత్ర భారత రాజ్యాంగానికి సమగ్ర రూపకల్పన జరిగింది. స్వతంత్ర భారత రాజ్యాంగం ముసాయిదా(డ్రాఫ్ట్) 1948 ఫిబ్రవరిలో రూపుదాల్చింది. తరువాత 1948లోనె అంబేద్కర్ రాజ్యాంగం ముసాయిదాను రాజ్యాంగ నిర్ణయ సభకు సమర్పించారు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాలు, లక్ష్యాలు, విధానాలు, సిద్ధాంతాల తీర్మానాన్ని రాజ్యాంగ నిర్ణయ సభ 1947 జనవరి 22వ తేదీన ఆమోదించింది. కూలంకష చర్చల అనంతరం రాజ్యాంగ నిర్ణయసభ స్వతంత్ర భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, ప్రజాతంత్ర, సెక్యులర్ రిపబ్లిక్‌గా ప్రకటించే అవతారికతో, భారత ప్రజలకు న్యాయాన్ని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, సమానత్వాన్ని ప్రసాదించే ప్రాథమిక హక్కులతో, 395వివిధ అధికరణాలతో స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన హర్షధ్వానాలతో ఆమోదించింది. స్వతంత్ర భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోనికి వచ్చి స్వతంత్ర ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ అవతరించింది. బ్రిటిష్ తదితర రాజ్యాంగాల పరిశీలన అనంతరం, బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుకరిస్తూ రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలో ఇంకే దేశంలోను లేని అతి దీర్ఘ లిఖిత రాజ్యాంగం.
ఆధునిక ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక మహత్తర సంఘటన. జనవరి 26 రోజుకు భారత స్వాతంత్య్ర సమరంలో ఎంతో ప్రాధాన్యం సంతరించింది. స్వరా జ్యం మన జన్మహక్కని లోకమాన్య బాలగంగాధర తిలక్ కావించిన సింహగర్జనతో స్ఫూర్తి పొందిన అప్పటి యువనాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు డొమినియన్ స్థాయిని వ్యతిరేకించి సంపూర్ణ స్వాతంత్య్రం మన లక్ష్యమని ప్రకటించారు. 1929 డిసెంబర్ 31వ తేదీన లాహోరులో రావీ నది తీరాన జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ సంపూర్ణ స్వాతంత్య్ర సాధన లక్ష్యాన్ని ఉద్ఘాటించింది. 1930 జనవరి 26ను దేశమంతట స్వాతంత్య్ర దినంగా జరపాలని కాంగ్రెస్ మహాసభ పిలుపునిచ్చింది. అందువల్ల స్వతంత్ర భారత రాజ్యాంగం 1950 జనవరి 26నాడు అమలులోనికి వచ్చింది.
స్వతంత్ర భారత రాజ్యాంగానికి అనుగుణంగా స్వతంత్ర భారతదేశంలో మొదటి లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. రాజ్యాంగ నిర్ణయ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారత రిపబ్లిక్ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికైనారు. 1957లో రెండవ పర్యాయం ఆయన రాష్ట్రపతి పదవిని అలంకరించారు. స్వతంత్ర భారత రాజ్యాంగానికి అనుగుణంగా భారత రిపబ్లిక్ పురోగమన పథంలో పయనిస్తున్నది. విశేషం ఏమిటంటే భారత పార్లమెంటు కంటె సుప్రీం స్వతంత్ర భారత రాజ్యాంగ చట్టం.
దేవులపల్లి ప్రభాకరరావు