ఆమె ఆలోచనలలో కాల్పనికత ఉంది, కమనీయత ఉంది. ఆమె గీసే రేఖలలో జీవం ఉంది. ఆమె శైలి అపురూపమైంది, ఆకర్షణీయమైంది. ఆమె సంప్రదాయాన్ని, సర్రియలిజాన్ని ప్రేమిస్తుంది. ఆచరణలో పెట్టి చూపిస్తుంది. చెట్టులోన, పుట్టలోన ”అంతట నీవే, అన్నింటనీవే” అన్నట్టు దేవుళ్ళను, దయ్యాలను, జంతుజాలాన్ని, మానవాకృతులను కలకలిపి, ‘కల’కలిపి పసందుగా పొదుగుతుంది, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఇంతకు ఆమె ఎవరనుకున్నారు!? ఆమె-అత్యాధునిక, అధివాస్తవిక చిత్రకారిణి-వేముల గౌరి.
హైదరాబాద్ నగరానికి చెందిన వేముల సత్యనారాయణ-జానకమ్మల కూతురు వేముల గౌరి. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఒకటినుంచి పదో తరగతి దాకా చదువుకున్న తరుణంలోనే చూడచక్కని చిత్రాలు గీయడం ప్రారంభించింది. ఆ తర్వాత హుబ్లీలోని శ్రీవిజయమహంతేశ్ లలిత కళా మహా విద్యాలయంలో డ్రాయింగ్ మాస్టర్స్ కోర్స్ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్ వచ్చి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలిత కళల కళాశాలనుంచి పెయింటింగ్‌లో బి.ఎఫ్.ఏ. చదివింది. పిదప హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోని సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌నుంచి ప్రింట్ మేకింగ్‌లో స్నాతకోత్తర డిగ్రీ సాధించింది.
ఒకవంక చదువు కొనసాగిస్తూనే, తన సృజనాత్మక చిత్రకళాయాత్ర ఆమె సాగించారు. ఒకానొక క్రమశిక్షణకు కట్టుబడి, తనదైన ముద్రగల విశేషమైన, వినూత్న భావాలతో చిత్రాలు వేశారు. ఆమె చిత్రాలు చూస్తే ఆమెకెంత ఓపికనో, ఆమెలో ఎంత నైపుణ్యం ఉందో, ఆమె ఊహలెంత అందమైనవో ప్రేక్షకుడు ఇట్టే పసికట్టేస్తాడు.
ఆమె అప్పుడప్పుడు అటవీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడే కూర్చుండి జంతువులు, పక్షులు, దేవుళ్ళు, మనుషుల పోలిన చెట్టూ చేమలను అంతర్నేత్రంతో దర్శించి, వివిధ భంగిమలలో తీరొక్క స్కెచ్‌లు వేసుకొచ్చి, ఇంటిపట్టున కూర్చుండి శ్రద్ధగా వాటిని తీర్చిదిద్దుతుంది. డ్రాయింగ్‌లను, ఎచ్చింగ్‌లు, ఆక్రాలిక్ చిత్రాలు, మిళిత మాధ్యమంలోనూ పలు చిత్ర విచిత్ర రచన ఆమె సాగిస్తుంది. పొరలు పొరలుగా ఆమె కలం అల్లే స్వాప్నిక ప్రకృతి చిత్రాలలోని జిగిబిగి ఆ చిత్రాల కూర్పులోని నేర్పు, ఆమె సృజనను, పనితనాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. హైదరాబాద్‌లోని వందలాదిమంది చిత్రకారులలో వేముల గౌరిది ప్రత్యేకమైన కళావిన్యాసం. అందుకే ఈ మధ్య ఆమెను అంతర్జాతీయ ప్రింట్ మేకింగ్ చిత్ర కళా ప్రదర్శన నిమిత్తమై అమెరికాలోని యూనియన్ ఆర్ట్ గ్యాలరీ, విస్కాన్‌సన్ విశ్వవిద్యాలయం, రెడ్‌లైన్ మిల్వూకి ఆర్ట్ స్డూడియోస్ ప్రత్యేకంగా ఆహ్వానించాయి. ఆమె తొమ్మిదిమంది భారతీయ చిత్రకారుల్లో ఒకరుగా వెళ్ళి గత ఏప్రిల్ మాసం ఆసాంతం అక్కడ ఉండివచ్చారు. అక్కడ ఆమె చిత్రాల ప్రదర్శనేకాకుండా, ప్రతిష్ఠాత్మకమైన రెడ్‌లైన్ మిల్వూకి ఆర్ట్ స్టూడియోలో ”ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్”గా వ్యవహరించిన ఏకైక తెలుగు కళాకారిణి వేముల గౌరి. ఆమె అక్కడ ‘ఉడ్ కట్ టెక్నిక్’ను యువచిత్రకారులకు బోధించింది.
ఇంతకుముందు వేములగౌరి చిత్రాలు లండన్‌లో 2008లో, దుబాయ్‌లో 2010లో ప్రదర్శించిన సందర్భాల లోనూ ఆయాచోట్ల కళాభిమానులు ఆమె అంతర నయనానికి ముచ్చటపడ్డారు. ముగ్ధులయ్యారు.
నిజానికి ప్రింట్ మేకింగ్ మాధ్యమానికి మహిళలు దూరంగా ఉంటారు. చిన్న పొరపాట్లు దొర్లినా ప్రింట్లో, కంట్లో పడతాయి. కానీ ఎంతో కష్టమైనా, క్లిష్టమైనా ఇష్టంతో ఈమె ప్రింట్ మేకింగ్‌లోనే ప్రత్యేకత చూపుతున్నారు. అన్ని ఆధునిక సౌకర్యాలుగల ప్రింట్‌లు వేసే స్టూడియో వరంగల్‌లో ఏర్పాటు చేసుకున్న ఆమె ‘జాగృతి శిఖరం’పై కూర్చుని కొత్తకొత్త చిత్రాలకు నిరంతరం తుది మెరుగులు దిద్దుతున్నది. తనకు తృప్తి లేకుండా ఏ చిత్రం గీయనంటుంది. అందుకే పరుల్‌దేవ్ ముఖర్జీ ఎడిట్ చేయగా ఆర్ట్ హెరిటేజ్ అండ్ మపిన్ పబ్లిషింగ్ వారు ప్రచురించిన ‘ఇబ్రహీం అల్‌కజి డైరెక్టింగ్ ఆర్ట్’ బృహత్ గ్రంథంలో ఆమె చిత్రాలకు చోటు లభించింది మరి.
హైదరాబాద్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే 100 I 50 ప్రమాణంలో వేసిన కుడ్యచిత్రంలోకూడా ఆమె ఊహలు గుసగుసలాడిన వైనం గమనించవచ్చు. ఒక్కొక్క చిత్రాన్ని ఎంతో మనస్సుపెట్టి కన్నుల వేడుకైన స్వప్నంగా, సుందరంగా వేముల గౌరి వేస్తున్నందున ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుచేత ఆమె ఇప్పటివరకు కేవలం ఎనిమిది పర్యాయాలే వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు చేసింది. వాటిలో 2008లో హైదరాబాద్‌లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన వ్యష్టిచిత్రకళా ప్రదర్శననుంచి ప్రారంభించి 2016లో న్యూఢిల్లీలో ”ఫాంటసీ వరల్డ్ ఆఫ్ గౌరీ వేముల” శీర్షికన ఏర్పాటు చేసిన ప్రదర్శన దాకా చిత్రకారిణిగా వేముల గౌరి క్రమపరిణామం, పరిణత వ్యక్తమయ్యాయి.
2002లో భోపాల్‌లో నిర్వహించిన భారత్‌భవన్ పంచమ అంతర్జాతీయ ద్వైవార్షిక ప్రింట్ సమష్టి ప్రదర్శననుంచి మొదలుపెట్టి, 2016లో సాంస్కృతిక మంత్రిత్వశాఖ, లలితకళా అకాడమి, లక్నో ఏర్పాటు చేసిన జాతీయ చిత్రకళా ప్రదర్శన దాకా మొత్తం పాతిక సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొని తన ఉనికిని సభ్య కళాకారులలో వేముల గౌరి వ్యక్తం చేసింది. సుమారు పదిహేను పర్యాయాలు అవార్డులు గెలుచుకున్నది. వాటిలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ అవార్డు (1997), అవంతి కళాపరిక్రమ న్యూఢిల్లీ అవార్డు (2008), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన నాల్గవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి కళా ప్రదర్శనలో అవార్డు (2000), హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అఖిలభారత కళా ప్రదర్శనలో గెలుచుకున్న రజతపతకం, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఏర్పాటు చేసిన అఖిలభారత చిత్రకళా పోటీలో గెలిచిన బతుకమ్మ అవార్డు (2016) ప్రత్యేకంగా చెప్పుకో దగినవి.
చెన్నైలో నిర్వహించిన జాతీయ ప్రింట్ మేకింగ్ శిబిరంలో 2012లో శ్రీకారం చుట్టి, 2016లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ 75వ వార్షికోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా కళాకారుల శిబిరం వరకు అరడజను శిబిరాలు, కార్యగోష్టులలో పాల్గొన్నారు. వేముల గౌరి వేసిన వివిధ చిత్రాలను జాతీయ, అంతర్జాతీయ గ్యాలరీలు, ఎందరో కళాభిమానులు సేకరించారు.
నడి వయస్సుకు ఇంకా ఐదారు వసంతాల దూరంలో ఉన్న వేముల గౌరి ఒకప్పుడు జాతీయస్థాయి క్రీడాకారిణి. కానీ కొన్ని కారణాలవల్ల క్రీడలను వీడి క్రీడాస్ఫూర్తితో చిత్రకళా రంగంలో పురోగమనం కొనసాగిస్తున్నది. ఈ రంగంలో పండితులను, పామరులను సరిసమానంగా ఆకర్షిస్తున్నది. సరదా భావాలతో, స్వప్న రూపాలను రసజ్ఞతతో గీస్తున్న వేముల గౌరి రచ్చ గెలిచి, ఇంట గెలిచిన చిత్రకారిణి.
టి. ఉడయవర్లు