mother– టి. ఉదయవర్లు
ఆయనవి ఎక్స్‌రే కళ్ళు. పై రూపునే కాకుండా లోపలి విషయాన్ని కూడా ఆయన కళ్ళు పట్టేస్తాయి. ఆయన పనిరాక్షసుడు. వందలు, వేల బొమ్మలను అలసట లేకుండా అలవోకగా వేసేస్తాడు. ఆయన ఉరుకులయ్యోరు. స్వభావరీత్యా, వృత్తి ధర్మంగా ఎక్కడా నిలపడడు, తనపని సమయస్ఫూర్తితో చేసుకుంటూ సాగిపోతాడు. ఆయన దార్శనికుడు. దర్శన లక్షణం ఆవహించడం వల్ల సంగీతాన్నైనా, సాహిత్యాన్నైనా, ఆమాటకొస్తే ఏమాటను ఆయన వినడు. కేవలం చూస్తాడు, గీస్తాడు. నిజంగానే ఆయన గీతకారుడు.

ఈ లక్షణాలన్నింటితో ఆయన బొమ్మవేస్తే వెనకటికి మన తొలి కార్టూనిస్టు తలిసెట్టి రామారావు. కవుల రచనలు చదివి ‘కావ్య నాయిక బొమ్మ’ వేసినట్టే ఉంటుంది. అయితే ఆ చిత్రంలో ఉన్నది – విచిత్రవేషంలో ముస్తాబైన ‘మన శంకర్‌’ అని ఎంతమంది గుర్తుపడతారు!

శంకర్‌ అంటే కొందరు అలనాటి ‘శంకర్‌ వీక్లీ – శంకర్‌’ అనుకుంటారు. ఎందుకంటే ఆ శంకర్‌ గీతే కార్టూనిస్టులకు ‘గీత’ కాబట్టి. కాని ‘మన శంకర్స్‌ వీక్లీ’ శీర్షికన అపురూపమైన బొమ్మలు వేసిన శంకర్‌ అనుకుంటారా? ఈ బక్కపలచని, చామనఛాయ కుర్రాడిని, పైకి అమాయకంగా ఏమీ తెలియనివాడిలా కన్పించే నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లి పిల్లాడిని, పామర్తి నర్సింహులు – రాజ్యం దంపతుల కడుపున పుట్టిన సృజనశీలిని, స్వయం కృషితో ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగి ప్రపంచ పత్రికా రంగంలో మకుటాయమానమైన గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును (పోర్చుగల్‌) గెలుచుకున్న అత్యుత్తమ కారికేచరిస్టు ఈయనే అని ఎవరు ఊహించగలరు!?

అలనాటి శంకర్‌ భారతీయ కార్టూన్‌ కళకు కావ్యస్థాయిని కలిగించాడు. పూర్వ ప్రధాని పండిత్‌ నెహ్రూ లాంటి పెద్దమనుషులే వారి ప్రతిబింబాలను ఆ శంకర్‌ గీతలలో చూసుకుని మురిసిపోయారు. తమను తాము సరిదిద్దుకున్నారు.

మరి ఈ శంకరేమో – కావ్యస్థాయికి ఎదిగిన కార్టూనును, కారికేచర్‌ను అంతర్జాతీయ వేదికలపైకి ఎక్కించి తెలుగువాడి రుచి చూపించాడు. ఈయన కార్టూన్లు చూసి సహజంగా న్నులెరుపుచేసే రాజకీయ నాయకులు సైతం శంకర్‌ చిత్రాల్లో తమకెప్పుడు చోటు కల్పిస్తాడోనని నిరీక్షించేత వెర్రిఎక్కించాడు.

శంకర్‌ బొమ్మల్లో భావం ఆయా వ్యక్తుల స్వభావం. వెనకటికొక మహర్షికి అరికాలిలో కన్ను ఉందన్నమాటలో నిజమెంతో తెలియదు. కాని మన శంకర్‌ వేళ్ళకు ళ్ళున్నా యోమోననే అనుమానం మాత్రం నిమిషాల్లో ఆయన గీసే బొమ్మలను చూస్తే కలుగుతుంది.

నిజానికి ఆయన ఏ కళాశాలలో ఈ విద్య నేర్చుకోలేదు. పదేండ్ల ప్రాయంలోనే చిత్రకళ పట్ల చిత్తం మళ్ళి, చూసిన ప్రతి మనిషి చిత్రం నిమిషాల్లో గీసెయ్యడం సాధన చేశాడు, సాధించేశాడు.

అందుకే బొమ్మల బ్రహ్మగా అందరూ బ్రహ్మరథం పట్టే కొంటె బొమ్మల బాపు శంకర్‌ వేసిన మదర్‌ థెరిస్సా కారికేచర్‌ చూశాక. ”ఎంత చక్కని కన్నుకైనా / కోరచూపే అందము/ఎంత చక్కని నోరుకైనా/దోరనవ్వే అందము/ ఎంత చక్కని చీరకైనా / సొంపు ఒంపులె అందము / ఎంత చక్కని బొమ్మకైనా/వంకరలే బహు అందము/ఆ టింకరింగుల పట్టు తెలిసిన/శంకరుకు అభివందనం” అని దశాబ్దం క్రితమే సర్టిఫికెట్‌ ఇచ్చేశాడు.

ఆయినా శంకర్‌ నిత్య విద్యార్థే. ఎప్పుడూ ఏదో కొత్త ప్రయోగం చేయాలనే యావే. ఈ విశేషాంశము వల్లనే ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మీ, ఛార్లీ చాప్లిన్‌, మహాత్మాగాంధీ లాంటి మహనీయుల కారికేచర్లు కొత్త సంగతులు వేసి తన ఉనికిని చాటాడు. ఫలితంగా ఆయన గీసిన అనేక కారికేచర్లకు గత పది పదిహేనేళ్ళుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను పొందాడు. వాటిలో హిందుస్థాన్‌ టైమ్స్‌ 1999, 2000లో కారికేచర్‌ పోటీలో వరుసగా రెండుసార్లు బహుమతి గెలుచుకోవడంతో మొదలు పెట్టి 2005లో – ఫ్రీ కార్టూన్‌ వెబ్‌ అంతర్జాతీయ పోటీ (చైనా)లో కాంస్య పతకం, ఎల్‌.ఎం. అంతర్జాతీయ కార్టూన్‌ పోటీ (చైనా) ప్రత్యేక గౌరవ ప్రాతిపదికపై తృతీయ బహుమతి, భారత అంతర్జాతీయ తొలి కార్టూన్‌ – కారికేచర్‌ పోటీ 2005లో ప్రత్యేక బహుమతి, టాబ్రిజ్‌ అంతర్జాతీయ కార్టూన్‌ పోటీ 2005 (ఇరాన్‌)లో ప్రథమ బహుమతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఉత్తమ రాజకీయ కార్టూనిస్టు అవార్డు, 2008లో ఉత్తమ రాజకీయ కార్టూనిస్టుకు మయకమతో స్మారక తృతీయ అవార్డు, ప్రపంచ ప్రెస్‌ కార్టూన్‌ పోటీ 2009లో (పోర్చుగల్‌) గౌరవ పతకం, ఉమెన్‌ చాందీ కారికేచర్‌ పోటీ 2012 (కేరళ) లో ప్రథమ బహుమతి, బ్రెజిల్‌ అంతర్జాతీయ కారికేచర్‌ పోటీ 2013లో ప్రథమ బహుమతి, చైనా కార్టూన్‌ పోటీ 2013లో రజత పతకం, ప్రథమ అంతర్జాతీయ, కారికేచర్‌ కళాపోటీ 2013 (చైనా)లో ప్రత్యేక బహుమతి, ద్వితీయ అంతర్జాతీయ కారికేచర్‌ కళాపోటీ 2015 (చైనా)లో రజతపతకం, తృతీయ అంతర్జాతీయ కళోత్సవం రిజిస్టాన్స్‌ (ఇరాన్‌) 2015లో ప్రథమ బహుమతి, బ్రెజిల్‌ హాస్యోత్సవంలో ప్రథమ బహుమతి, లాంటివెన్నో శంకర్‌ కీర్తి కిరీటంలో తురాయిగా నిలిచాయి.

తొలుదొలుత శంకర్‌గీసిన నెల్సన్‌ మండేెలా కారికేచర్‌ ప్రజాదరణపొందిన ఒక దిన పత్రిక టాబ్లాయిడ్‌ సైజ్‌ ఆదివారం అనుబంధం మధ్య రెండు పేజీల్లో ముద్రణై, శంకర్‌ గొప్పతనాన్ని వెల్లడించడంతో పాటు ఆయనలో విశ్వాసాన్ని పెంచి యాదృచ్ఛికంగా వేసిన మండేలా కారికేచర్‌కు – అంతర్జాతీయ స్థాయిలో పోర్చుగల్‌లో అవార్డు గెల్చుకున్న మొట్టమొదటి ఆసియా కళాకారుడు ఆయనే కావడం విశేషం.

సైన్‌ బోర్డు చిత్రకారుడుగా వృత్తి జీవితం ప్రారంభించిన శంకర్‌ డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షల్లో కృతార్థుడై, ఉపాధ్యాయ శిక్షణ పొంది బడిపంతులు అయ్యాడు. కళాకారుడుగా తృష్ణ తీరక తన ఇరవై ఎనిమిదోయేట హైదరాబాద్‌కు యానిమేషన్‌ నేర్చుకోవాలని వచ్చాడు. అనేక ఇబ్బందులు పడి, ఢక్కా మొక్కీలు తిని చిరికి జర్నలిజం రంగంలో స్థిరపడ్డాడు. తొలుత ‘వార్త’లో కార్టూనిస్టుగా చేరాడు. ఆ తర్వాత ‘ఆంధ్రజ్యోతి’లో కార్టునిస్టుగా పనిచేసి, బాగా రాణించాడు. ప్రస్తుతం ‘సాక్షి’లో చీఫ్‌ కార్టూనిస్టుగా ఉన్నాడు. పొలిటికల్‌ కార్టూనిస్టు ఫోరమ్‌కు అధ్యక్షుడుగా చురుకుగా కృషి చేస్తున్నాడు.

కారికేచర్‌ రంగంలో ప్రస్తుతం లబ్ద ప్రతిష్టులైన వారికి భిన్నంగా హేళన, వేళాకోళం చేయడం, ఆటపట్టించడం, బనాయించడం ఇత్యాది వ్యతిరేక భావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా – గుణాత్మకమైన వాస్తవిక అంశాలకు, చమత్కారానికి పట్టం కట్టడమే శంకర్‌ ప్రత్యేకత. ఆయన గీసే బొమ్మ కళగా కళకళలాడాలని త్రివిమాత్మకంగా – త్రీ డైమెన్షనల్‌గా చిత్రించడం ఆయన పద్దతి. చిన్నచిన్న డ్రాయింగ్‌ పేపర్లపై చిత్రాలు చిలకడం కాకుండా ఈజిల్‌పై పెద్ద ఎత్తున ఒక్కోసారి జీవిత ప్రమాణంలో కారికేచర్లు వేయడం శంకర్‌ పనితీరు. ఆయన మనోవీధిలో తారట్లాడే భావాలను విరూపం చేసినా, ఆకర్షణీయంగా ఉండేలా గా రంగుల పెన్సిళ్ళతో చూడముచ్చటగా చిత్రించడం శంకర్‌ శైలి.

కార్టూన్లు, కారికేచర్లు వేయడం చేతిపని ఎంత మాత్రం కాదు. అది మేథకు, అభిరుచికి, అవగాహనకు సంబంధించిన కళారూపం అంటాడు శంకర్‌. అందులో సమకాలీనత, విషయ పరిజ్ఞానం, రేఖాలావణ్య, సరసం – అన్నీ సమపాళ్ళలో ఉండాలి. హాస్యం ఎక్కువైతే అపహాస్యం పాలవుతుందటాడాయన. కళానైపుణ్యం తారాస్థాయిలో ఉన్నందునే మారియో మిరాండా కార్టూన్లు, కారికేచర్లు పెయింటింగ్‌ స్థాయిని అందుకున్నాయనీ, కృత్రిమమైన కొలతలకు చిక్కని విధంగా కొలువు తీర్చిన బాపు బొమ్మలు బాపురే అనిపిస్తాయని శంకర్‌ అంటారు.

ఈ శ్రేణిలో తన కారికేచర్ల వ్యష్టి ప్రదర్శన ఏర్పాటు చేయడమే కాకుండా, తదనంతరకాలంలో జాతీయ స్థాయిలో తమముద్ర వేసిన ఇరవైయేడు మంది స్థానిక చిత్రకారుల, శిల్పుల కారికేచర్లు వేసి, సుప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠంతో పాటు ప్రదర్శించడం వల్ల చిత్రకళా రంగంలో శంకర్‌ పేరు మారు మ్రోగిపోయింది. దాంతో కారికేచర్‌ రంగంలో పరిశోధన తీవ్రతరం చేసి, తనంటూ ఒకానొక కొత్త బాణీని శంకర్‌ రూపొందించుకున్నాడు. ఫలితంగా కార్టూన్‌ చూడగానే శంకర్‌ను పట్టించే రేఖావిన్యాసం, స్వంతం చేసుకున్నాడు. గత రెండు దశాబ్దాలుగా వందలు, వేల సంఖ్యల్లో శంకర్‌ వంకరటింకర బొమ్మలను నిబద్ధతకు కట్టుబడి గీశాడు.

త్వరలో కొత్తగా వ్యష్టి కారికేచర్‌ ప్రదర్శన నిమిత్తమై ముప్పైఐదు మంది సుప్రసిద్ధుల ప్రతి రూపాలు గీయడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇంకో ఇరవైదాకా ఇతివృత్తాలు ఆయన వద్ద ఉన్నాయి గీయడానికి.

కార్టూనిస్టులకు పుష్కలంగా సరంజామా ఇచ్చిన నాయకులు టి. అంజయ్య, ఎన్‌.టి.రామారావు కాలం నాటికి తాను ఈ రంగంలో కాలుపెట్టే వయస్సులేనందుకు బాధపడతాడు. ఏమైనా మన రాష్ట్ర నాయకులకు ఇతర రాష్ట్ర నాయకుల మాదిరిగా కాకుండా హాస్యకుశలత ఎక్కువంటాడు. తమపై బొమ్మ వేసినా వినోదించే శక్తి ఎంతగానో మన నాయకులకు ఉందంటాడు. ఉదాహరణకు ముఖ్యమంత్రి కాకముందే కేసీిఆర్‌ పై కారికేచర్‌వేస్తే ఆయన శంకర్‌ కల్పనాశక్తిని మెచ్చుకుని భోజనానికి ఆహ్వానించారు.

తెలుగు రాష్ట్రాల్లో సామాజికపరమైన కార్టూనిస్టులు వందలకొద్దిమంది ఉన్నా, రాజకీయ కార్టూనులు వేసే వారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఏమైనా కార్టూన్లు, కారికేచర్లు ముందు తరాలు తిలకించడానికి వీలుగా విదేశాల్లో అనేక మంది చిత్రకారుల తాలూకు మ్యూజియంలు ఉన్నాయి. అలాంటి మ్యూజియంలు మనం కూడా ఏర్పాటు చేసుకోవాలంటాడు శంకర్‌.

ఇంత విశిష్టమైన కళాకారుడు శంకర్‌ వేసిన కార్టూన్లు, కారికేచర్లు కూడా కొన్ని లోగడ ఆయన పనిచేసిన చోట ముద్రణకు తిరస్కరించినవి ఉన్నాయి. ఒక ప్రముఖ జర్నలిస్టు అభిప్రాయపడ్డట్టుగా.

‘తిరస్కరించిన కారికేచర్లు, కార్టూన్లు’ గ్రంథంగా ముద్రిస్తే వేడివేడి మిర్చీల్లాగా చెల్లిపోవడం తథ్యముసుమతీ !

Other Updates