sampadakeeyamప్రాణాలను పణంగా పెట్టి, కండలు కరగించి, దేశానికి నల్లబంగారాన్ని అందిస్తున్న బొగ్గుగని కార్మికుల జీవితాలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మసిగొట్టుకొని పోయాయి. స్వరాష్ట్రం సిద్ధిస్తేతప్ప తమ బతుకులు బాగుపడవని భావించిన సింగరేణి కార్మికులు స్వరాష్ట్ర ఉద్యమంలో ముందు నిలిచారు. వారిశ్రమ వృధా పోలేదు. 15 ఏళ్ళుగా వారుకన్న కలలు స్వరాష్ట్రంలోనే నిజమయ్యాయి. దాంతో కార్మికులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి కార్మికులకు హక్కుగా వస్తున్న వారసత్వ ఉద్యోగావకాశాలకు ఉమ్మడి రాష్ట్రంలో 2002లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికొట్టారు. ఉద్యోగాల నియామకాలను నిషేధించారు. ఈ ఉద్యోగాల కోసం ఆనాటి నుంచి ఎదురుచూస్తున్న కార్మికుల కలలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఫలించాయి. కార్మికుల న్యాయమైన ఈ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ ఏడాది దసరాకు ముందు ఉన్నతాధికారులతో చర్చించి జారీచేసిన ఆదేశాల మేరకు వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. గతంలో కంటే మరింత వెసులుబాటును కూడా కల్పించింది.

ఈ కొత్త నిర్ణయం మేరకు గత అక్టోబరు 11 నాటికి 48 సంవత్సరాలు నిండిన కార్మికుల తమ్ముడు, కుమారుడు, అల్లుడు ఎవరైనా నిబంధనల మేరకు దరఖాస్తుచేసు కోవచ్చు. సింగరేణిలో ప్రస్తుతం 58 వేలమంది సిబ్బంది వున్నారు. వీరిలో కేవలం 2500 మంది మాత్రమే అధికారులు. మిగిలిన వారంతా కార్మికులే. వీరిలో 50 సంవత్సరాలు పైబడిన వారు 70 శాతం వరకూ ఉంటారని అంచనా. వీరి స్థానంలో వారి వారసులను నియమిస్తే సింగరేణిలో యువ కార్మికుల సంఖ్యకూడా గణనీయంగా పెరుగుతుంది.

సింగరేణికి గత ఏడాది 1066 కోట్ల రూపాయలు లాభం చేకూరింది. ఇంతటి లాభాలు ఆర్జించి పెట్టిన కార్మికులకు ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ ఏడాది భారీమొత్తంలో బోనస్‌ కూడా లభించింది. ఒక్కో కార్మికునికి సుమారు లక్ష రూపాయల వరకూ లబ్ధిచేకూరింది. రాష్ట్రం సాధించుకున్న తొలి సంవత్సరంలోనే సింగరేణిలో 5000 మంది సిబ్బంది నియామకానికి కూడా ముఖ్యమంత్రి అనుమతించారు.

సింగరేణి కాలరీస్‌ కు ఇటీవలే తమిళనాడు రాష్ట్రంతో భారీ ఒప్పందం కుదిరింది. సింగరేణి నుంచి ఈ ఏడాది 10 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 30 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేయడానికి తమిళనాడు విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ కొర్పొరేషన్‌ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందనడానికి ఇది తాజా ఉదాహరణ.

లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి ప్రగతికి ఈ నిర్ణయాలు మరింత దోహదంచేస్తాయి.

Other Updates