తెలంగాణ రాష్ట్రం సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా ముందడుగు వేస్తున్నది. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా తెలంగాణ రాష్ట్రం 27.45 శాతం ఆదాయ వద్ధిరేటు సాధించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలైన ఏప్రిల్, మే లతో ఈ ఏడాది అవే నెలలతో లెక్కలు పోల్చుకున్నప్పుడు అద్భుత ప్రగతి కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా ఖచ్చితమైన అంచనాలతో గత మార్చిలో 2016-17 బడ్జెట్ ప్రవేశ పెట్టింది. బడ్జెట్ ఏడాది మొదటి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులపై జూన్ 14న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై చర్చ జరిగింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే దాదాపు 10 ముఖ్య శాఖల ద్వారా గడిచిన రెండు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. 2015 ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్ పోర్టు, గనులు తదితర వనరుల ద్వారా రూ. 6,031 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల కాలంలో రూ.7,687 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 27.45 శాతం వద్ధి తో రూ.1656 కోట్లు అధికంగా వచ్చింది.
ఇదే రకమైన సుస్థిర ఆదాయ వద్ధ్దిరేటు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి గత ఏడాది వచ్చిన రాష్ట్ర స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ రెవెన్యూ) కన్నా రూ.11,500 కోట్ల ఆదాయం పెరగనుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పటికీ తెలంగాణ ఆదాయ వద్ధి రేటు ఎక్కువగానే ఉన్నట్లు వెల్లడయింది.
గడిచిన రెండు నెలల కాలంలో తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు, మంచి ముహూర్తాలు లేనందున శుభ కార్యాలు కూడా ఎక్కువ జరగకపోవడంతో పాటు ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ… ఈ రకమైన ఆర్థిక ప్రగతి సాధించడం పట్ల అధికార వర్గాల్లో సంతప్తి వ్యక్తమయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానం, అవినీతి రహిత పద్ధతులు, వివిధ శాఖల్లో తెచ్చిన సంస్కరణలు, టిఎస్ ఐపాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం కల్పించిన రాయితీల వల్ల వచ్చిన బూమ్, హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సమావేశాలకు వేదికగా నిలవడం తదితర కారణాల వల్ల ఈ రెవెన్యూ ప్రగతి సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి, వ్యాపారాలు నిర్వహించు కోవడానికి పూర్తి అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఇతోధికంగా వచ్చాయి. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. వాటి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. వీటి కారణంగా రెవెన్యూ పెరిగింది. పారదర్శక విధానం అవలంభించడం వల్ల, రియల్ ఎస్టేట్ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం వల్ల పెద్ద ఎత్తున స్థిరాస్థి క్రయవిక్రయాలు పెరిగాయి. ఫలితంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం గతేడాదితో పోలిస్తే 64% పెరిగింది. హైదరాబాద్ నగరం అనేక అంతర్జాతీయ సదస్సులకు, వేడుకలకు వేదికగా ఉండడంతో పెద్ద ఎత్తున దేశ, విదేశాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి బస చేశారు. స్టార్ హోటళ్లు కిక్కిరిసి పోయాయి. ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది. లగ్జరీ టాక్సుల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం వద్ధి సాధించింది. రాష్ట్రంలో వివిధ సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా పెద్ద ఎత్తున జరగడంతో అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగింది.
ఇలా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పది ముఖ్యమైన శాఖల్లో ఆదాయ వద్ధి రేటు పెరిగింది. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం సహజ ఆదాయ వద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం రెండింతల వద్ది సాధించింది.
”నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. దాదాపు ఏడు నెలల పాటు పూర్తి స్థాయి అధికారులు లేకుండా పాలన చేయాల్సి వచ్చింది. మొదటి రెండు బడ్జెట్లు కేవలం అంచనాల ఆధారంగా ప్రవేశపెట్టుకున్నాం. తర్వాత మెల్లగా కోలుకున్నాం. రాజకీయ సుస్థిరత సాధించాం. అనేక విషయాల్లో విధానపరమైన మార్పులు చేసుకున్నాం. పారదర్శకతను పెంపొందించాం. అవినీతిని బాగా తగ్గించగలిగాం. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాం. శాంతి భద్రతల పరిస్థితిని కూడా బాగా మెరుగుపరిచాం. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం సుస్థిరత సాధించింది. ఆర్థిక ప్రగతి కూడా సుస్థిరంగా సాగుతున్నది. ఫలితంగానే ఈ ప్రగతి సాధ్యమైంది. ఇదే విధమైన ప్రగతి కొనసాగితే వచ్చే ఏడాది బడ్జెట్ కూడా పెరుగుతుంది. ప్రజలకు ఉపయో గకరమైన మరిన్ని మంచి పనులు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. బంగారు తెలంగాణ సాధనకు ఇది సానుకూల అంశం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తంచేశారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ వైస్ ఛైైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు, సిఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.