తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ నేలను తన పావన జలాలతో పునీతం చేస్తున్న కృష్ణవేణికి పుష్కర మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నా శుభాభివందనాలు.
ఇదే గోల్కొండ కోట నుంచి మొదటి సారి త్రివర్ణ పతాకాన్ని మనం ఎగురవేసిననాడు ఈ రాష్ట్రం రెండున్నర నెలల పసిబిడ్డ. ఒకటొకటిగా బాలారిష్టాలను దాటుకుంటూ స్థిరమైన పరిపాలనను అందిస్తూ… రెండేళ్ళ తక్కువ సమయంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో మనం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మన రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరిని అవలంభిస్తుందని చాలా స్పష్టంగా ప్రకటించాను. ఆ స్ఫూర్తికి, అందుకనుగుణంగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్పలితాలనిచ్చాయి.
నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో సయోధ్యను సాధించుకోగలిగాం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మన రాష్ట్రానికి మరో నాలుగు నెలల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతుంది.
గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం గత ప్రభుత్వాల విధానాల వల్ల వివాదాల్లో చిక్కుకుని ముందుకు సాగలేదు. మహారాష్ట్రతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునే విషయంలో గత పాలకులు సరైన విధానాన్ని అవలంభించకపోగా, మరింత జటిలం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలించాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణం కోసం చరిత్రాత్మక ఒప్పందం కుదిరే దిశగా బాటలు పడ్డాయి. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు ప్రభుత్వం వేసిన గొప్ప ముందడుగుగా భావిస్తున్నాను.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వంతో కూడా స్నేహ సంబంధాలు బలపడ్డాయి. దీనివల్ల మహబూబ్ నగర్ కు సాగునీరు అందించే ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చింది. పోయిన ఎండాకాలంలో తాగునీటి కోసం పాలమూరు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కర్ణాటక నుంచి జూరాలకు ఒక టిఎంసి నీటిని విడుదల చేయించు కోగలిగాం. కేంద్ర – రాష్ట్రాల సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరిస్తున్నది.
ఇటీవలే గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోది గారు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ నదీ జలాలను నల్లాలద్వారా అందించే బృహత్తర కార్యక్రమం ‘మిషన్ భగీరథ’లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గానికి తాగునీరందించే కార్యక్రమం ప్రారంభించారు. ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, ప్రదర్శిస్తున్న నిబద్ధతను గౌరవ ప్రధాన మంత్రి ప్రశంసించడం మనలో స్ఫూర్తిని నింపింది. ఇదే సందర్భంలో ఆరు అభివృద్ధి కార్యక్రమాలు మాననీయ ప్రధాన మంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకున్నాయి.
17 ఏండ్ల క్రితం మూతపడిన రామగుండం ఫర్టిలైజర్ ప్లాంటును తిరిగి తెరిపించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న నేటి తరుణంలో ఈ ప్రయత్నం ఏటికి ఎదురీదడం అని తెలిసినా పట్టువిడవకుండా ప్రయత్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూలంగా స్పందించడమే కాకుండా స్వయంగా ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు శంకుస్థాపన జరిగింది. ఇది ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా నిండు హర్షంతో ప్రకటిస్తున్నాను. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందడమే కాకుండా.. ఎరువుల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగం కలుగుతుంది.
హైదరాబాద్ – కరీంనగర్‌ల మధ్య నేరుగా రైలు నడపాలని నాలుగు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఈ కోరిక నెరవేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించి… మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైను పనులకు ప్రధాన మంత్రిగారు శంకుస్థాపన చేశారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడానికి రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్.టి.పి.సి. విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి, అందులో మొదటి దశ ప్లాంటు నిర్మాణ పనులకు కూడా ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన పనులన్నీ వేగంగా పూర్తి చేస్తామని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కంపెనీ నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ప్రధాన మంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం కావడం మనందరికీ గర్వకారణం.
నేషనల్ హైవేల విషయంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాము. ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండేది. ఈ రెండేళ్లలో కొత్తగా 1,951 కిలోమీటర్ల జాతీయ రహదారి మంజూరు చేయించుకోగలిగాం. దీంతో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు మొత్తం 4,590 కి.మీకు చేరుకుంటున్నది. గతంలో తెలంగాణలో జాతీయ రహదారుల సగటు 2.25 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 4 కిలోమీటర్లకు చేరుతున్నది. జాతీయ సగటు 3శాతం కంటే తక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు జాతీయ సగటును మించుతుండడం సంతోషకరం.
కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి. ఇందుకోసం అటు కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇటు పొరుగు రాష్ట్రాలతోనూ సుహద్భావంతో ఇదే విధంగా వ్యవహరిస్తాం. రాజీ లేని విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తాం.
సంక్షేమం
నిజమైన అభివృద్ధి అంటే పేద ప్రజలకు భరోసా ఇవ్వడం, వారి బతుకులకు భద్రత ఇవ్వడం.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలు అమలు చేస్తున్నది. సంక్షేమరంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఇటీవల కొన్ని కొత్త పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి కార్యక్రమాన్ని బిసిలు, ఇబిసిలకు కూడా అందిస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటికే 230 గురుకులాలు ప్రారంభమై, విద్యాబోధన కూడా జరుగుతున్నది. మరో 20 గురుకులాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కెజి టు పిజి ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బలహీన వర్గాల గురుకులాలతో బీజం పడినందుకు సంతోషిస్తున్నాను.
హాస్టళ్లలో, మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు ఇప్పటికే సన్నబియ్యంతో అన్నం పెడుతున్న సంగతి మీకు తెలుసు. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్ల విద్యా ర్థులకు కూడా సన్నబియ్యం అందిస్తున్నాము. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రతీ రోజు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నా మని తెలియచేసేందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎస్టీలు, మైనారిటీలు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పొందలేదు. ఎస్టీలు, మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి చెల్లప్ప, సుధీర్ కమిషన్లు వేశాము. ఆ కమిషన్లు ఇటీవలే నివేదికలు సమర్పించాయి. త్వరలోనే ఎస్టీలు, మైనారిటీలకు జనాభా దామాషాను అసుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామనీ… వారి సామాజిక, ఆర్థిక స్థోమత పెంచే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామనే శుభవార్తను మీతో పంచుకుంటున్నాను.
అన్ని స్థాయిలలో సామాజిక న్యాయం అమలు కావాలనే ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది.
పేద బ్రాహ్మణుల కోసం బడ్జెట్లో వందకోట్ల రూపాయలను కేటాయించాము. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తగిన పథకాలు త్వరలో రూపొందిస్తాం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరంలో125 అడుగుల విగ్రహాన్ని సమున్నతంగా ప్రతిష్ఠించుకోబోతున్నాం.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని చరిత్రలో నిలిపే విధంగా లుంబినీ పార్కు లో తెలంగాణ అమర వీరుల స్మ ృతిచిహ్నాన్ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది.
కొత్త జిల్లాలు
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభమయింది. తెలంగాణ ప్రజలకు ప్రీతి పాత్రమైన దసరా పండుగ కానుకగా కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని సంతోషంగా ప్రకటిస్తున్నాను.
భారీ ప్రాజెక్టులు
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుపోతున్నది. మన రాష్ట్రానికున్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నది.
ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు
గతం నుంచే నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం పరుగులు పెట్టించింది. అవసరమైన నిధులిచ్చింది. వెంటబడి మరీ పనులు చేయించింది. ప్రభుత్వ కృషి వల్ల ఈ ఖరీఫ్ లోనే ఆయకట్టుకు నీరందింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రస్తుతం నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందుతున్నది. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ నాలుగు ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి చేసుకోవడం వల్ల పాలమూరు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం బీమ్, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్ నుంచి నీరు విడుదల అయింది. దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. వచ్చే ఏడాదికి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయి లక్ష ఎకరాలకు సాగునీరు అందు తుంది. ఖమ్మం జిల్లాలోని పాలెం, కిన్నెరసాని ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ నుంచే నీరందుతుంది.
ముళ్లకంపలు, పొదలు, పగుళ్లు, పూడికతో నిండిన ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలను 200 కోట్లు వెచ్చించి ప్రభుత్వం బాగు చేయించింది. వరంగల్, నల్గొండ జిల్లాల ఆయకట్టుకు, చెరువుల నీరందించడానికి ఇప్పుడు ఆ కాలువలు సిద్దంగా ఉన్నాయి.
మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 46వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాము. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో మొదటి దశలో ఎనిమిది వేల చెరువులు బాగుపడ్డాయి. రెండో దశలో 9వేల చెరువుల పనులు ప్రభుత్వం చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా బాగుపడ్డ చెరువుల్లో ఇప్పుడు జలకళ ఉట్టిపడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 20వేల చెరువులు నిండడం మన రాష్ట్రానికి శుభసూచకం.
వ్యవసాయం
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితిని నివారించింది. రైతులకు చాలినన్ని ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చింది. మొట్టమొదటి సారిగా ఎండాకాలంలోనే విత్తనాలు తెప్పించి, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు దొరకలేదని బాధపడే పరిస్థితి లేకుండా చేసింది. ఈ సారి మంచి వర్షాలు కూడా కురవడం, రైతులు సరైన సమయానికే విత్తనాలు వేసుకోగలగడం సంతోషకరం.
మైక్రో ఇరిగేషన్ : తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు, సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీపై, మిగతా వారికి 80 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్‌ను అందిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడంతో పాటు నాబార్డు నుంచి మరో వెయ్యి కోట్లు సమకూర్చుకుని రాష్ట్రంలో లక్షా26 వేల ఎకరాల్లో ఈ ఏడాది డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడానికి కార్యచరణ సిద్ధమైంది.
గ్రీన్ హౌజ్ : కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి అనువుగా ఉండే పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ కోసం ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తున్నది.
ఫామ్ మెకనైజేషన్: వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నది. 420 కోట్ల వ్యయంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నది. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది.
వ్యవసాయాధికారుల నియాయమకం : రైతులకు అవసరమైన సహాయం అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1311 మంది వ్యవసాయ విస్తరణాధికారులను, 120 మంది వ్యవసాయాధికారులను, 75 మంది హర్టికల్చర్ అధికారుల నియామకం జరుగుతున్నది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయాధికారుల నియామకం ఎన్నడూ జరగలేదు.
హార్టికల్చర్ కార్పొరేషన్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మనం హార్టికల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది.
గోదాములు: రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మిస్తామని నేను గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించాను. చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తగిన సౌకర్యం కల్పిస్తున్నది. తెలంగాణ వచ్చే నాటికి 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. ఈ రెండేళ్లలోనే 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. వీటిలో వంద గోదాములు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగతా గోదాములు రాబోయే రెండు నెలల్లో పూర్తవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 21.24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 506 గోదాములు రాబోయే రోజుల్లో రైతుల కోసం సిద్ధంగా ఉంటాయి. 60 ఏండ్ల సమైక్య పాలనలో గోదాముల నిర్మాణం కోసం 100 కోట్లు ఖర్చు పెడితే, కేవలం రెండేళ్లలో ప్రభుత్వం 1,024 కోట్లు ఖర్చు చేసింది.
విద్యుత్తు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికున్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించగలిగాం. కోతల్లేని విద్యుత్ ను సరఫరా చేసుకోగలిగాము. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం.
మిషన్ భగీరథ
మిషన్ భగీరథ పనులు ఆశించిన వేగంతో నడుస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు గోదావరి నదీ జలాలను నల్లాల ద్వారా అందించే కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయింది. 2018 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా జలాలు అందుతాయి. మిషన్ భగీరథ పైపుల ద్వారా ప్రతీ ఇంటికి మంచినీళ్లు ఇవ్వడంతో పాటు, ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వేసుకుంటున్నాము. సాంకేతిక అభివృద్ధి ఫలితాలు గ్రామీణ ప్రజలకు సైతం అందుబాటులోకి వస్తాయి.
వైద్యం
ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో బెడ్ నిర్వహణకు ప్రతీ నెల సగటున ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. హాస్పిటల్ బెడ్లపైన రోజుకొక రంగు బెడ్ షీట్లు వేయాలని నిర్ణయించాము. రాష్ట్రంలోని మొత్తం 42 ఏరియా ఆసుపత్రులకు గాను, 30 ఆసుపత్రుల్లో కొత్తగా పరుపులు, బెడ్ షీట్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేశాము. మిగతా 12 ఆసుపత్రులకు మరో 20 రోజుల్లో సామాగ్రి అందుతుంది. 600 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల కోసం కొత్త వైద్య సామాగ్రి (మెడికల్ ఎక్విప్ మెంట్) కొనుగోలు చేయడం జరగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలిసిస్ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. వీటి పరికరాల కొనుగోలుకు వైద్య ఆరోగ్య శాఖ ఆర్డర్లు ఇచ్చింది. రెండు నెలల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు ప్రారంభమవుతాయి. ప్రభుత్వాసుపత్రులకు మందుల కొనుగోలు కోసం ఇచ్చే బడ్జెట్ నిధులు కూడా రెట్టింపయ్యాయి. మందుల కొనుగోలుతో పాటు ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను కూడా ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకే అప్పగించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రులలో మరణించిన వారి మృతదేహాలను ఇంటికి చేర్చేందుకు కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం మానవీయ హృదయంతో అర్థం చేసుకుంది. ప్రతీ దవాఖానలో మృతదేహాల తరలింపుకు అంబులెన్సులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
పరిశ్రమలు
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం తెచ్చిన టిఎస్-ఐపాస్ చట్టం మంచి ఫలితాలు అందిస్తున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా పేరు తెచ్చుకున్నది. ఇప్పటికే 2,303 పరిశ్రమలకు నిర్ణీత సమయంలో అనుమతులిచ్చింది ప్రభుత్వం. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి 46వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు లక్షా 75వేల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభించడం సంతోషకరం.
ఐటి
ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నది. 13.26 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం మన రాష్ట్రం 75వేల కోట్లకు పైగా సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేయగలిగింది. కొత్తగా ఐటి కంపెనీలు పెట్టే వారికోసం నెలకొల్పిన టి-హబ్ గా పిలవబడే ఇంక్యుబేటర్ సెంటర్ ఎంతో మంది ఔత్సాహికులకు అండగా నిలుస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఐటి దిగ్గజాల ప్రశంసలు పొందుతున్నది. హైదరాబాద్‌ను ప్రముఖ ఐటి కేంద్రంగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. అందుకే 2018లో జరిగే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు మన హైదరాబాద్ వేదిక కానుందని సగర్వంగా ప్రకటిస్తున్నాను.
ఉద్యోగాలు
ప్రభుత్వం లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నది. లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికే 37 వేల నియామకాలు చేపట్టింది. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే ప్రక్రియ నడుస్తున్నది.
నగరాభివృద్ధి
మన రాష్ట్రంలో దాదాపు 45 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నే జీవిస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హరితహారం
ఒకప్పుడు ఈ భూగోళం మొత్తం నీటితోనూ, అడవులతోనూ నిండి ఉండేది. మనిషి తన అవసరాల కోసం అడవులను చదును చేసి అవాసాలను ఏర్పాటు చేసుకున్నాడు. సాగు భూముల్ని సృష్టించుకున్నాడు. అవసరాల కోసం ప్రారంభమయిన అడవుల నరికివేత రానురాను పరిమితి దాటిపోయింది. విచక్షణా రహితంగా సాగిన అడవుల విధ్వంసం పర్యావరణానికి ముప్పు తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పెను ప్రమాదాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఇటీవల పారిస్ లో జరిగిన వరల్డ్ గ్రీన్ ఎకానమీ సదస్సులో కూడా ప్రపంచ దేశాలన్నీ పర్యావరణానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. మన రాష్ట్రంలో కూడా పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఫలితంగా ప్రతీ రెండు మూడు సంవత్సరాలకొకసారి ఖచ్చితంగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుంచి నేటితరంతో పాటు భవిష్యత్ తరాలను కూడా బయట పడేసేందుకు పచ్చనినీడను (గ్రీన్ కవర్) పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది 46కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం జరిగింది. పచ్చదనం పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అతిపెద్ద మానవ ప్రయత్నాలు మూడు. మొదటి ప్రయత్నం ఆస్ట్రేలియా దేశంలో జరిగింది. రెండవది చైనాలో గోబి ఎడారి విస్తరణను నిరోధించడానికి జరిగింది. మూడోది మన రాష్ట్రంలో మనం తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తున్నది. ఊరూరా వాడవాడనా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఒక్కటై ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వారికి హరితమిత్ర పేరుతో ఈ స్వాతంత్ర దినోత్సవం నుండే అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో లక్ష్యాన్ని మించి మొక్కలు పెట్టించిన కలెక్టర్ యోగితా రాణాకు ఈ సంవత్సరం హరితమిత్ర అవార్డును అందచేస్తున్నట్లు మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తున్నాను. హరితహారం కార్యక్రమంలో మీరంతా పాల్గొని, మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను చంటి బిడ్డల వలె సంరక్షించాలని మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. మనిషికి ఆయువు పెంచడంతో పాటు ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించే చెట్లు పెంచడం ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో భాగంగా భావించాలని ఆకాంక్షిస్తున్నాను.
శాంతి భద్రతలు
శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం దృఢ చిత్తంతో వ్యవహరిస్తున్నది. అరాచక శక్తుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితాలు మీ కళ్లముందే ఉన్నాయి. తెలంగాణ పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నిన్న ప్రకటించిన జాతీయ పోలీస్ అవార్డుల్లో కూడా అత్యధికం తెలంగాణ పోలీసులే దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం. జాతీయ అత్యున్నత పోలీస్ పురస్కారమైన శౌర్యచక్ర అవార్డు సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరికీ దక్కలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా మన తెలంగాణ బిడ్డ, నల్గొండ జిల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కుక్కుడపు శ్రీనివాసులు ఈ ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర పురస్కారానికి ఎంపిక కావడం మనందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం.
రెండు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డులతో పాటు మొత్తం 38 జాతీయ పోలీస్ మెడల్స్ సాధించి దేశంలో తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టడానికి మన పోలీసులు ప్రదర్శిస్తున్న సాహసానికి, చొరవకు యావత్ జాతి గర్విస్తున్నదని మీ హర్షామోదాల మధ్య ప్రకటిస్తున్నాను.
ముగింపు
ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బ్రతుకును పండించే బంగారు తెలంగాణగా మలిచేందుకు ప్రభుత్వం త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్నది. అభివృద్ధి నిరోధక శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజా బలమే అండదండగా భావించి స్థిరంగా పురోగమిస్తున్నది. లక్ష్య సాధనకు అవసరమైన మనో బలాన్ని, మద్దతును ఇవ్వాలని తెలంగాణ ప్రజలను స్వాతంత్ర దినోత్సవ వేళ సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
జై తెలంగాణ
జై హింద్