harithamశ్రీ రవిప్రతాప్‌ చావ్లా

తెలంగాణ రాష్ట్రాన్ని హరిత వనంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం గ్రీనరీని 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘తెలంగాణకు హరితహారం’ అనే వినూత్న పథకానికి సీఎం కేసీఆర్‌ గత ఏడాది అంకురార్పణ చేశారు. మూడేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని సంకల్పించారు. అందులో 120 కోట్ల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో 100 కోట్ల మొక్కలను డీ గ్రేడ్‌ అయిన అటవీ ప్రాంతంలో, మరో 10 కోట్ల మొక్కలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ పరిధిలో నాటాలని ప్రణాళికను రచించారు.

ప్రభుత్వ పరంగానే నర్సరీలలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు ఇతర శాఖల ద్వారా 4,213 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టారు. 120 కోట్ల మొక్కలలో ప్రతి ఏడాది 40 కోట్ల చొప్పున మొక్కలను నాటాలని ప్రణాళికలను రూపొందించారు. ప్రతి ఏడాది ప్రతి అసెంబ్లీ నిమోజకవర్గ పరిధిలో 40 లక్షల మొక్కలను, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది దాదాపు 16 కోట్ల మొక్కలను నాటగలిగారు. ప్రస్తుత సంవత్సరం వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే ఈ ఏడాది విరివిగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభించేందుకు సర్కార్‌ సన్నద్ధమవుతోంది. పర్యావరణంతోనే అందరి భవిష్యత్తు ముడిపడి ఉన్నందున, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

మొక్కలు నాటే పౌరులకు ప్రోత్సాహం… మొక్కకు రూ. 5 ఆర్థిక సాయం :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విస్తృతంగా మొక్కలు నాటడానికి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలు అమలు చేయనుంది. 50 మొక్కలు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటే వ్యక్తులకు, సంస్థలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కకు రూ. 5 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటే కార్యక్రమాన్ని, మొక్కల సంరక్షణ కోసం చర్యలు చేపట్టనున్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను కేటాయించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చెట్లు ఉంటేనే వానలు పడుతాయని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్న అవగాహన ప్రజలలో పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మొక్కలు నాటే పౌరులకు, యువజన, ప్రజా సంఘాలకు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలను ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అవార్డుల ద్వారా మొక్కలు నాటే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు.

199 రకాల మొక్కలు సిద్ధం

గ్రామాలు, మండలాలు, పట్టణాలు, కాలనీలు, బస్తీలలో ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పోరేట్‌ సంస్థలు, విద్యాసంస్థలు సమష్ఠిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నాయి. అన్ని జిల్లాలు, మండల కేంద్రాలలో రహదారులకు ఇరువైపులా పచ్చని పందిరిలాగ మార్చడానికి రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ రంగం సిద్ధం చేసింది.

ఇటీవల గాలి, వాన కారణంగా పెల్లోఫారమ్‌, గుల్‌మోహర్‌, డెలోనిక్స్‌, రెయిన్‌ ట్రీ లాటి విదేశీ జాతికి చెందిన అలంకృత చెట్లు నెలకొరగడంతో ఈ సారి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ఆ జాతి మొక్కలను నాటరాదని నిర్ణయించారు. వాటికి బదులుగా దేశీయంగా దృఢమైన, సంప్రదాయ వృక్షజాతి మొక్కలను మాత్రమే నాటనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఖాళీ స్థలాల్లో మేలైన పళ్ల మొక్కలను నాటడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే విషయంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆయా విద్యా??????ల ప్రిన్సిపల్స్‌, ప్రధానోపాధ్యాయులకు మొక్కలను రక్షించే బాధ్యతను అప్పగిస్తున్నారు. అందుకు గాను మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తిని నియమించుకోవడానికి, నెలకు రూ. 4 వేలు ఇవ్వాలని అధికారులు తాజాగా నిర్ణయించారు.

మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన 4600 చెరువుల గట్లపై ఈత, తాటి చెట్లను విరివిగా నాటే బాధ్యతలను డ్వామాకు అప్పగించారు. రాష్ట్రంలో 4,213 నర్సరీలలో 40 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. దాదాపు 199 రకాల మొక్కలను నాటడానికి రంగం సిద్ధం చేశారు. మామిడి, తాటి, ఈత, దానిమ్మ, చింత చెట్లు, ఉసిరి, కానుగ, జామ, జమ్మి చెట్టు, టేకు, వేప, నిమ్మ, గచ్చకాయ, ఎర్రమద్ది, తెల్లమద్ది, అనాస, గురువింద, ఆస్ట్రేలియా తుమ్మ, సపోట, మారేడు, పెద్దమాను, జిట్టరేగి, తునికి, మర్రి, రావి, సుబాబుల్‌, నల్లజీడి, సిల్వర్‌ ఓక్‌, ఇప్ప, సంపంగి, తులసి, నందివర్ధనం, అశ్వగంధం, నల్లరేణి, పారిజాతం, గులాబి, నిద్రగన్నేరు, శ్రీగంథం, ఎర్రచందనం, గోరింటాకు, తదితర 199 రకాల మొక్కలను నాటనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని నర్సరీలలో 5 కోట్ల 40 లక్షలు, నల్లగొండలో 5 కోట్ల 37 లక్షలు, మహబూబ్‌నగర్‌లో 5 కోట్ల 85 లక్షలు, కరీంనగర్‌లో 4 కోట్ల 16 లక్షలు, మెదక్‌లో 4 కోట్ల 59 లక్షలు, వరంగల్‌లో 4 కోట్ల 78 లక్షలు, ఖమ్మంలో 3 కోట్ల 99 లక్షలు, నిజామాబాద్‌లో 4 కోట్ల 74 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3కోట్లు, హైదరాబాద్‌ జిహెచ్‌ఎంసి నర్సరీలలో కోటి మొక్కలు, హెచ్‌ఎండీఎ పరిధిలో 3 కోట్ల 35 లక్షల మొక్కలు మొత్తం 46 కోట్ల 30 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.

Other Updates