tourismవివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలమధ్య సాంస్కృతిక-పర్యాటక రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. దివంగత సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఏక్‌భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, హర్యానా రాష్ట్రాలమధ్య ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మహేశ్‌శర్మల సమక్షంలో సాంస్కృతిక-పర్యాటక రంగంలో అక్టోబర్‌ 31న ఢిల్లీలో ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక-పర్యాటక రంగాల్లో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం కుదరడం విశేషం. హర్యానా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ధీరాఖండేల్వాల్‌, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

‘ఏక్‌భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌’అనే నినాదం గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, ఇలాంటి కృషి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పగలుగుతుందని అన్నారు.

ఈ అంశాన్ని గురించి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రస్తావిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో హర్యానా రాష్ట్రంతో అవగాహనా ఒప్పందం కుదుర్చు కోవడం సంతోషంగా ఉందని అన్నారు. ‘ఏక్‌భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం హర్యానాతో కుదిరిన ఒప్పందం రానున్న నాలుగేండ్లలో జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లతోకూడా ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంతో కుదిరే ఈ ఒప్పందం ద్వారా రెండు రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహార వ్యవహారాలు ఒకదానితో మరొకటి పంచుకునే వీలు ఉంటుందని అన్నారు. రాష్ట్రాలు వేరైనా ఒక రాష్ట్రంలోని ప్రజల సంస్కృతి మరో రాష్ట్రంతో పంచుకోవడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని అన్నారు.

Other Updates