హుజూర్‌నగర్ శాసన సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నలమాద పద్మావతి పై 43,358 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోలైన ఓట్లలో టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతికి 69,737 ఓట్లు లభించాయి. సైదిరెడ్డికి 56.34 శాతం ఓట్లు, పద్మావతికి 34.74 శాతం ఓట్లు లభించాయి.
ఈ ఎన్నికలో పోటీచేసిన భారతీయ జనతాపార్టీ అభ్యర్థి కోట రామారావుకు 2,639 ఓట్లు రాగా, తెలుగుదేశం అభ్యర్థిని చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, ఇండిపెండెంటుగా పోటీచేసిన సపావత్ సుమన్‌కు 2,697 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్థులతోపాటు ఈ ముగ్గురూ ధరావత్తు కోల్పోయారు.
అక్టోబర్ 21న పోలింగ్ జరుగగా, అక్టోబరు 24న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ గోదాములో పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 22 రౌండ్లు లెక్కింపు జరుపగా, టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి ప్రతి రౌండ్ లోనూ మెజారిటీ పెరుగుతూ వచ్చింది. హజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ టి.ఆర్.ఎస్ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.హుజూర్ నగర్ మండలంలో 8,693, గరిడేపల్లిలో 8,357, నేరేడుచర్లలో 7,073, చింతలపాలెంలో 5,122, మేళ్ళచెర్వులో 6,630, పాలకీడులో 2,761, మఠంపల్లిలో 4,607 మెజారిటీ లభించింది.దీంతో మొత్తం 43,358 ఓట్ల ఆధిక్యతతో టి.ఆర్.ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయంసాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.