– ప్రధాని మోదికి కేసీఆర్ విజ్ఞప్తి .. విజయవంతమైన ఢిల్లీ పర్యటన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి, జల వనరులశాఖా మంత్రి ఉమాభారతిని కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారు. ముఖ్యంగా హైకోర్టు విభజన, నదీజలాల పంపిణీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధుల విడుదల తదితర అంశాలపై ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించారు. మిషన్ భగీరథను తన స్వంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ప్రారంభించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. జూలై 16న ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి మూడు రోజులు అక్కడే ఉన్నారు. 16న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్నారు. 18న రాష్ట్ర సమస్యలను వివరించడానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, ఉమాభారతిలను కలుసుకున్నారు.
పార్లమెంటులో ప్రధానిని కలుసుకున్న కేసీఆర్ సుమారు 35 నిమిషాల పాటు చర్చించారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు చొరవచూపాలని కోరారు. రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలైనా సొంత హైకోర్టు లేకుండా పోయిందని వివరించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కింది కోర్టుల న్యాయమూర్తులు మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆందోళనలో పాల్గొన్నారని సీఎం వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు ఆందోళన విరమించి విధులకు హజరయ్యారని తెలియజేశారు. విభజన ప్రక్రియ తాము చూసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకుని, సమస్య ప్రాధాన్యతను గ్రహించి వెంటనే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున వారికి దీర్ఘకాలం లబ్ధి చేకూర్చే విధంగా ఉండే పలు పథకాలను తాము ప్రవేశపెట్టామని, వాటికి నిధులు విడుదల చేయాలని కోరారు.
వినూత్నంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయకు రూ. 5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. జనాభాలో 60శాతం ఉన్న ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేసీఆర్ ప్రధాని మోదీకి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.
అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణం మంజూరీకి ఆదేశాలివ్వాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీల అమలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు జీడీపీలో 3.5శాతం మేర రుణాన్ని పొందడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, పలు సాంకేతిక కారణాలతో అవి విడుదల కావడంలేదని, వాటిని ఇప్పించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు నీతిఆయోగ్ చేసిన సిఫారసుల మేరకు రూ. 24.205 కోట్లను విడుదల చేయాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ. 450 కోట్లు తొలివిడతగా విడుదల చేశారని, మలి విడతగా మరో రూ. 450 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.
కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని సీ.ఎం. కేసీఆర్ కలుసుకున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద చేపట్టే ప్రాజెక్టులకు నాబార్డ్ ద్వారా ఇచ్చే రుణాలను ఎఫ్‌ఆర్‌బిఎంతో ముడిపెట్టవద్దని ఆయన ఉమాభారతిని కోరారు. అలాగే రిపేర్, రినెవేషన్, రెస్టోరేషన్ (త్రిబుల్ ఆర్) నిధుల కింద తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. కృష్ణాజలాల విషయంలో ఏర్పడిన సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. కాగా మిషన్ కాకతీయ పథకాన్ని ఉమాభారతి ప్రశంసించారు.