maga

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సమావేశానికి వేదిక కానుంది. భారత్‌ – అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్‌ సమ్మిట్‌ (జి.ఈ.ఎస్‌) ఈ ఏడాది నవంబర్‌ 28-30 తేదీల మధ్య హైదరాబాదులో జరగనున్నది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌, ఇంకా దేశవిదేశాల నుండి వేలాది మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఈ సమావేశానికి ఏర్పాట్లన్నీ నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంతర్జాతీయ సమావేశానికి వచ్చే అతిథులకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ సమకూర్చేందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది.

ఈ ఏడాది సదస్సు ప్రధానంగా ”విమెన్‌ ఫస్ట్‌, ప్రాస్పెరిటీ ఫర్‌ ఆల్‌” అనే అంశంపై ఉంటుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివద్ధిని పెంపొందించడం అనేది ప్రధాన ఎజెండాగా ఉంటుంది.

2010లో మొదలైన ఈ సమ్మిట్‌ దక్షిణాసియాలో జరగడం ఇదే తొలిసారి. ఈ సారి జరగనున్న సమావేశంలో నూతన ఆవిష్కరరణలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అంకుర పరిశ్రమలకు మన దేశంలో అందిస్తున్న తోడ్పాటుపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మెరుగుపరిచే అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలు, స్టార్టప్‌ కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అనవసరమైన ప్రభుత్వ నియంత్రణలు సరళీకరించి వ్యాపార వాణిజ్య అభివృద్ధికి బాట వేయడం ఇత్యాది అంశాలన్నీ ఈ సదస్సులో చర్చిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 1500 ప్రతినిధులు జి.ఈ.ఎస్‌ 2017 సదస్సుకు హాజరుకానున్నారు. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఈ సదస్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర పరిశ్రమలు తమ తమ వ్యాపార ఆలోచనలను పంచుకుని, దానికి అవసరమైన పెట్టుబడిని ఇన్వెస్టర్ల నుండి సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఇప్పటికే ఐటి రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌, యువ ఐటి మంత్రి కేటీఆర్‌ కార్యాచరణ ఫలితంగా దినదిన ప్రవర్ధమానమవుతున్న హైదరాబాద్‌ నగరానికి ఈ సదస్సును నిర్వహించడానికి అవసరమైన హంగులు అన్నీ ఉన్నాయి. అనేక గ్లోబల్‌ ఐటి కంపెనీలు ఇక్కడే తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం అంకుర పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు నెలకొల్పిన టి-హబ్‌ ఇప్పటికే విశ్వవేదికపై తన సత్తా చాటుతోంది.

ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సు సాక్షిగా భారత యువతరం చేస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం లభిస్తుంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ నూతన ఆవిష్కరణలే పరిష్కారాలు సూచించగలవన్న సందేశం కూడా ఈ వేదిక ఇవ్వనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయవలసిన ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఆహూతులకు తెలంగాణ రాష్ట్ర ఆతిథ్యం మరపురానివిధంగా ఉండేందుకు వివిధ శాఖలు సమాయత్తం అవుతున్నాయి.

– దిలీప్‌ కొణతం

Other Updates