హైదరాబాద్‌తో   నెహ్రూ   అనుబంధంతన భార్య కమలా నెహ్రూ ఆరోగ్య నిమిత్తం జవహర్‌లాల్‌ నెహ్రూ 1931వ సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు తన భార్య కమల, కూతులు ఇందిరతో కలిసి శ్రీలంకలో విశ్రాంతి తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు దక్షిణభారతంలోని ప్రముఖ సంస్థానాలైన ట్రావెంకూర్‌. కొచ్చిన్‌ (కేరళ), మైసూరు (కర్ణాటక) హైదరాబాద్‌లను సందర్శించారు. ఆనాటి వారి పర్యటన ఎన్నో ఉత్తేజకరమైన విషయాలను వెల్లడి చేస్తోంది.

ఆ రోజులలో హైదరాబాద్‌ సంస్థానం నిజాం పరిపాలనలో ఉండి ముస్లిం మహిళలు బురఖాలు ధరిస్తే, హిందూ మహిళలు తలనిండా కొంగు కప్పుకునేవారు. రాచరిక సంస్కృతి అలరారే రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య వాది అయిన నెహ్రూ దర్శించడమే గొప్ప విషయం. సరోజినీ నాయుడు, ఆమె కూతుళ్లు పద్మజా, లీలామణిల ఆహ్వానాన్ని కాదన లేక ఆయన ఇక్కడికొచ్చారు. ఇది నెహ్రూ వ్యక్తిగత పర్యటన. కనుక ఆయన ఏలాంటి కాంగ్రెస్‌ సన్మానాలను అంగీకరించలేదు. అప్పటికే జవహర్‌లాల్‌ నెహ్రూ భారత యువకులకు ఆరాధ్యదైవం.

నెహ్రూ కుటుంబం ప్రయాణం చేసిన రైలు బండి జూన్‌ 3వ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. సరోజినీ దేవి, ఆమె కూతుళ్లిద్దరు వారికి హార్థిక స్వాగతమిచ్చారు. నెహ్రూకు స్వాగతం పలకటానికి వచ్చిన వారిలో బారిష్టర్‌ రామచంద్రనాయక్‌, జాతీయ ముస్లిం నాయకులైన సిరాజుల్‌ హసన్‌ తిర్మాజి, మౌలానా జాఫర్‌ అలీ మొదలైన ప్రముఖులున్నారు. పోలీసు కమీషనర్‌ రాజా బహదుర్‌ వెంకట రామారెడ్డి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘మహాత్మాగాంధీకి జై, జవహర్‌లాల్‌ నెహ్రూ జిందాబాద్‌, భారత్‌మాతాకి జై’ అనే నినాదాలతో ఆనాడు హైదరాబాద్‌ నగరం మారుమోగింది. నెహ్రూను చూడాలని నాంపల్లి స్టేషన్‌కు కనీసం ఏడెనిమిది వందల మంది వచ్చారు. వారి అభినందనలను నెహ్రూ మందహాసంతో స్వీకరించారు. జనం స్టేషన్‌ నిండిపోయారు. రైలు డబ్బాలోనుంచి నెహ్రూ కుటుంబం దిగటానికే 15 నిమిషాలు పట్టింది. అనంతరం స్వాగత కార్యక్రమాలు మరో 45 నిమిషాలు తీసుకుంది. దీంతో విసుగెత్తిపోయిన నెహ్రూ, ”మేము చాలా బడలికతో ఉన్నాం. మీరు సరోజినీ నాయుడు ఇంటికి రేపు వస్తే తీరికగా మాట్లాడుకుందాం” అని వాళ్ళని సాగనంపడానికి చాలా కష్టమైంది.

మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకే జనం గోల్డన్‌ థ్రెషోల్డ్‌ (సరోజనీ నాయుడు ఇల్లు)కు చేరుకున్నారు. ప్రాంగణంలో నిల్చున్న నెహ్రూ వారికి కనిపించలేదు. దీంతో కలకలం ప్రారంభమైంది. ఇక పని కాదనుకొని నెహ్రూ కాంపౌండు గోడమీద నిలబడ్డారు. దీంతో ప్రజలు ఆయనను సంతృప్తిగా దర్శించుకున్నారు. కొందరు పాదాభివందనం చేయడానికి వస్తే నెహ్రూ ‘ఇదేంపని’ అని ఛీత్కరించుకున్నారు. అయిదు నిమిషాలు చిన్నపాటి సందేశమిచ్చారు.

ప్రజానీకం వెళ్లిపోగానే నెహ్రూ కుటుంబం గోల్కొండ కోట, హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌, చార్మినార్‌, మక్కా మసీదు, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి భవనాలు చూసి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. విరామ విశ్రమానంతరం తిరిగి నాలుగు గంటలకు వారి కార్యక్రమం ప్రారంభమైంది. రెసిడెన్సీ బజారులోని హష్మంత్‌గంజ్‌ ప్రాంతంలో తంతుకార సంఘం వారి సహకార ఖాదీ భాండాగారాన్ని నెహ్రూ ప్రారంభించారు. ఆనాటి రాత్రి నెహ్రూ గౌరవార్ధం సరోజినీ నాయుడు ఇచ్చిన తేనేటి విందులో నగర ప్రముఖులైన మాడపాటి హనుమంతరావు, కాశీనాధరావు వైద్య, లతీఫ్‌ ఉద్దౌలా, సర్‌ అక్బర్‌ హైదరీ, సర్‌ అమీన్‌జంగ్‌, అక్బర్‌ యార్‌జంగ్‌, కొత్వాల్‌ వెంకటరామారెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు. కమలా నెహ్రూని చూడటానికి పరదా ధరించిన స్త్రీలు రావడం విశేషం. మూడవ రోజు ఉదయం అంటే జూన్‌ 5వ తేదీన నెహ్రూ కుటుంబం మరొకసారి గోల్కొండ కోట సందర్శించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తనను చూడటానికి వచ్చిన కార్మిక నాయకులతో నెహ్రూ సంభాషించారు. తరువాత లండన్‌లో తన సహోధ్యాయుడైన బారిస్టర్‌ శ్రీకిషన్‌ ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్టేటు కాంగ్రెసు కార్యవర్గ నిర్వాహక సంఘం సభ్యురాలైన కమలాబాయి ఇంటికి నెహ్రూ సకుటుంబంగా వెళ్ళారు. అక్కడికొచ్చిన స్త్రీలనుద్దేశించి ప్రసంగిస్తూ తీరిక సమయంలో ఖాదీ దుస్తులు విక్రయించాలని నెహ్రూ కోరారు. ఆ తరువాత లాలాగూడ వెళ్ళి రైల్వే కార్మికుల సభలో ప్రసంగించారు. కార్మికులు సంఘటిత శక్తిగా ఉంటెనే ట్రేడ్‌ యూనియన్లు బలపడతాయని చెప్పారు.

ఆ రోజు కమలా నెహ్రూ కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కందస్వామి మార్కెట్‌ వద్ద గల స్వదేశీ హాల్‌లో ఆమె చేసిన ప్రసంగం అందర్ని ముగ్ధులుగా చేసింది.

సభ ప్రారంభంలో మాడపాటి సరోజనీదేవి జాతీయ గీతాలాపన చేశారు. కమలా నెహ్రూ తన ప్రసంగంలో స్త్రీలు ఖద్దరు దుస్తులు ధరించాలని, పురుషులతో సమానంగా స్వాతంత్రోద్యమాలలో పాల్గొనాలని కోరారు. అనంతరం ప్రసంగం పిడుగు పాటే అయింది. అదేమిటంటే ‘ పురుషులు పోరాడుతున్నది బ్రిటిష్‌ ప్రభుత్వం అనే శత్రువుతో మీరు పోరాడవలసింది ఇద్దరు శత్రువులతో ఆ రెండు శత్రువులు ఎవరో కాదు. మీ భర్తలు’ అని ఆమె ఉద్వేగంతో అనగానే సభలో మిన్ను ముట్టే కరతాళాలు చెలరేగాయి. ఉపన్యాసానంతరం మనోరంజితమ్మ సోదరి కూతురు వాయించిన సితారు వాద్యం అందరినీ పరవసింపజేసింది. శ్రీమతి సుందరమ్మగారి కృతజ్ఞతా వాక్యంతో ఆనాటి మహిళా సభ ముగిసింది.

నెహ్రూ హైదరాబాద్‌ పర్యటన స్వర్ణాక్షరాలతో లిఖింపదగిన సంఘటన. హైదరాబాద్‌ ప్రజలకు తాను పరాయివాడను గానని, హైదరాబాద్‌ ఒక ప్రత్యేక ద్వీపముగా ఉండజాలదని ఆయన పలుమార్లు ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని మంచీ చెడ్డలు రెండునూ ఆయనను ముగ్దుణ్ని చేసినాయి. హైదరాబాద్‌ సంస్కృతి కూడా జవహర్‌లాల్‌ నెహ్రూను ఆకర్షించినవి. ఉత్తర, దక్షిణ భారత సంగమస్థానమైన భారతదేశానికి ప్రతిబింబంగా రూపొందించిన హైదరాబాద్‌ నెహ్రూ అభిమానాన్ని అమితంగా చూరగొన్నది. హైదరాబాద్‌ మహిళలపై నెహ్రూ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

1948లో హైదరాబాద్‌ మీద పోలీసు చర్య జరిగింది. 1950లో నెహ్రూ మొదటిసారి ప్రధాన మంత్రిగా హైదరాబాద్‌ కొచ్చారు. సికిందరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలో మహాసముద్రమని చెప్పుకోదగిన బహిరంగసభలో నెహ్రూ మహోపన్యాసం చేశారు. 1953లో హైదరాబాద్‌లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ మహాసభలలో నెహ్రూ పాల్గొన్నారు.

1956 మార్చినెలలో నిజామాబాద్‌లో జరిగిన భారత సేవక్‌ సమాజ్‌ కార్యక్రమాలలో పాల్గొనటానికి నెహ్రూ హైదరాబాద్‌ వచ్చారు. రాష్ట్రంలోని ముఖ్యమైన అన్ని ప్రాజెక్టులను జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1955 డిసెంబర్‌లో ఆయన నాగార్జున సాగర్‌ శంకుస్థాపన చేశారు. 1957-58లో ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ పరిపాలన ప్రారంభోత్సవం చేశారు. ఆ మహానుభావుడు మన హృదయాలలో వెలిగించిన దీపాలు సర్వదా మనకు వెలుగు దారులు చూపుతున్నాయి. భారతమాతను అలంకరించిన దివ్య కాంతులతో నెహ్రూ ఎన్నటికీ వాడనీ, వాసన వీడని ఒక అపురూప పుష్పం.

Other Updates