Untitled-2రాష్ట్రం ప్రగతిపథంలో నడవాలంటే అన్నిరకాలుగా అభివృద్ధి సాధించాలి. ఇందుకోసం పారిశ్రామికంగా దూసుకువెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఈ విధానంపట్ల ఆకర్షితులైన దిగ్గజసంస్థలు తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ప్రపంచమేటి ఐటి దిగ్గజం ఆపిల్‌ సంస్థ తొలిసారిగా అమెరికా అవతల హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

ఆపిల్‌ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత వస్తు ఉత్పత్తి సంస్థగా ప్రఖ్యాతి గాంచినట్లే తెలంగాణ అదే స్థాయిలో పారిశ్రామిక విధానానికి ప్రఖ్యాతిగాంచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ పురోభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకు నేందుకు ఆపిల్‌ సంస్థ ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధిలో ఆపిల్‌ సంస్థ భాగస్వామ్యం పంచుకోవడాన్ని సిఎం మరో మారు స్వాగతించారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా దినదినాభివృద్ధ్ది చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం హర్షదాయకమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, పరస్పరం అభివృద్ధి చెందేందుకు దోహదపడండి అంటూ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయి పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని, పెట్టుబడిదారులకు ఏ మాత్రం ఇబ్బందులు కలుగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు.

నానక్‌ రామ్‌ గూడాలోని వేవ్‌ రాక్‌లో మే 19న ఆపిల్‌ సంస్థ నూతన కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని వివరిస్తూ ఆపిల్‌ సంస్థ సిఇఓ టిమ్‌ కుక్‌ బృందంతో ప్రత్యేక భేటీ జరిపారు. పలు అంశాలు చర్చించారు.

అనంతరం జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ నిర్ణీత సమయంలో ఎటువంటి ఆటంకాలు లేని పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనకు జవాబుదారీతనంతో కూడిన అనుకూలమైన విధానాలను తాము అమలు పరుస్తున్నామన్నారు. ఇప్పటికే ఆ దిశగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగిస్తున్నాయని సిఎం తెలిపారు. ప్రపంచ ఐటి రంగ దిగ్గజాలయిన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌ బుక్‌, ఆమెజాన్‌ వంటి సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో స్థాపించుకున్నాయని, వాటికి ఆపిల్‌ సంస్థ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని అన్నారు. ప్రపంచ దిగ్గజం ఆపిల్‌ సిఇఒ టిమ్‌ కుక్‌ రాక ద్వారా నూతన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి దిశ నిరూపిత మైందని సిఎం అన్నారు. ”హైదరాబాద్‌కు రండి, పెట్టు బడులు పెట్టండి పరస్పరాభివృద్ధి చెందేందుకు దోహదపడండి” అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆపిల్‌ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని సిఎం ఆకాంక్షించారు.

ఆపిల్‌ సిఇఒ టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం తనకెంతో నచ్చాయని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆపిల్‌ సంస్థకు అందిస్తున్న సహాయ సహకారాలు, సహకరించిన విధానం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సహకారం ఈ దేశ సంస్కృతిని ప్రతిబిం భిస్తుందని అన్నారు. ఆతిథులకు సహకారం అందించడంలో భారతదేశం తమ దేశం కన్నా ముందు నిలుస్తుందని కొనియా డారు. హైదరాబాద్‌ లోను తమ సంస్థ పురోభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం కలిగిందని ప్రకటించిన టిమ్‌ కుక్‌ ఆనందంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 5000 మంది ఉద్యోగులతో ఆపిల్‌ సంస్థ తమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ముఖ్యమంత్రి అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతికుమారి, ముఖ్యమంత్రి స్పెషల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ రెడ్డి, ఆపిల్‌ సంస్థ అధికారులు, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గ్గొన్నారు.

అంతకు ముందు కార్యక్రమ ప్రారంభంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆపిల్‌ సిఇఓ టిమ్‌ కుక్‌, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Other Updates