హైదరాబాద్‌లో హైందవ సంస్కృతికి అద్దంపట్టేల 10 కోట్ల రూపాయల వ్యయంతో ‘బ్రాహ్మణ పరిషత్ భవనం’ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఆలయాలలో ధూప, దీప నైవేద్యం కోసం ప్రస్తుతం ప్రతి నెలా అందిస్తున్న రూ. 2,500 మొత్తాన్ని మార్చి నెల నుంచి రూ. 6,000కు పెంచనున్నట్టుకూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.
వరంగల్‌లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 9న నిర్వహించిన తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక సేవలందిస్తూ శాంతికోసం కృషి చేస్తున్న అర్చకులకు మేలు చేయాలని భావిస్తున్నామని, త్వరలో అందుకు సంబంధించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ పరిషత్‌ను ప్రారంభించింది తానేనన్న విషయాన్ని కె.సి.ఆర్. ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రయివేటు వేదపాఠశాలలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, భవిష్యత్ తరాలకు మన సంపదను అందించేలా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఆలయాలకోసం గత ప్రభుత్వాలు చేసిందేమీలేదు. ఒక్క ఎకరం భూమి కేటాయించలేదు. రాజులు, జమీందారులు, భక్తులు అందించిన కానుకలే ఆలయాల ఆస్తులుగా ఉన్నాయి. ప్రజావసరాలకోసం మాన్యాలను వినియోగించినా, ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఆలయాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.
హైందవ సమాజానికి గట్టి పునాదులు ఉన్నాయని చెపుతూ.. ‘‘ఏ తల్లి అయినా జో అచ్యుతానంద జోజో ముకుందా… లాలి పరమానంద రామ గోవిందా’’ అని, ‘రామాలాలీ మేఘశ్యామ లాలీ’ అని పాడుతుంది తప్ప, ‘జో రావణానంద అనో, జో కుంభకర్ణానందా అనో పాటపాడదు. తన బిడ్డ రాముడో, గోవిందుడో కావాలని కోరుకుంటుంది’’ అని చంద్రశేఖరరావు సభికుల హర్షధ్వానాలమధ్య చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో వేదపాఠశాలలకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కేటాయించే విషయాన్ని ఆలోచిస్తానని అన్నారు.
ముందుగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి మంగళాశాసనం చదివి ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా కాకుండా ప్రాచీనతను కాపాడే ఆధ్యాత్మిక, శక్తి కేంద్రాలుగా చూడాలని ఆయన సూచించారు. కె.సి.ఆర్. పాలనలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని, ఆ విషయంలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.