అనేక వివక్షలుగల మన దేశంలో ఎందరో సంస్కర్తలు సమాజ మార్పుకోసం కృషి చేశారు. వారిలో బి.ఎస్. వెంకటరావు ఒకరు. బి.ఎస్. వెంకటరావు ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్ళలో తెలంగాణ కేంద్రంగా అంబేద్కర్ భావజాల విస్తృతికోసం కృషి చేశారు. ఆయన హైదరాబాద్ అంబేద్కర్‌గా పేరెన్నికగన్నారు. ఆయన పూర్తి పేరు బత్తుల సాయన్న వెంకటరావు.
బత్తుల సాయన్న వెంకటరావు సికింద్రాబాదు, న్యూబోయిగూడలో 11.12.1896లో జన్మించారు. ఆయన తల్లి ముత్తమ్మ, తండ్రి సాయన్న. పెద్ద చదువులు చదువుకోలేదు. అంతరాయాల మధ్య ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆయన సమాజాన్ని లోతుగా అధ్యయనం చేశారు. బతుకుదెరువుకోసం శిల్ప విద్య నేర్చుకొని పూనాలో ఎన్నో శిల్పాలు చెక్కారు. నిజాం ప్రభుత్వంలో ఇంజినీర్ స్థాయిదాకా ఎదుగుతూ తమ సేవలు అందించారు. అట్టడుగువర్గాల ప్రజల దైన్యాన్ని చూసి చలించిపోయి వారి సేవనే జీవితధ్యేయంగా లక్ష్యసాధనవైపు దృష్టిసారించారు. ఆయన సామాజిక అంశాలు ఫలించడానికి ఉద్యోగం ఒక అడ్డంకి అవుతున్నందున రాజీనామా సమర్పించి దళిత ప్రా జనఉద్ధరణకు నడుంకట్టిన ధీశాలి.
బి.ఎస్. వెంకటరావు ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాదు చేరుకున్న నాటినుండే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొ న్నారు. సామాజిక దురాచారాలను రూపుమాపడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దేవదాసితనానికి కుల వైషమ్యాలను నిర్మూలించడానికి కృషి చేశారు. దళితులలో విద్యాభివృద్ధికి పాటుబడ్డారు.అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో అంటరాని ప్రజలపక్షాన ఉద్యమిస్తున్న భాగ్యరెడ్డివర్మ ప్రభావం బి.ఎస్. వెంకటరావు మీద ఉంది. అలాగే దళితుల జీవితాలలో వెలుగురేఖలు ప్రసరిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, ఆయన సామాజిక న్యాయ స్రవంతి బిఎస్‌రావును గొప్పగా కదిలించింది.
ఆయన ప్రజల కోసం ఉద్యమమార్గాన్ని ఎంచుకున్న నాటినుండి త్రిముఖ వ్యూహాన్ని ఎంచుకున్నారు. అవి ఒకటి, తన మేధా సంపత్తిపై ఆధారపడి సామాజిక ఉద్యమాలు నిర్మించడం. రెండు రాజకీయ వ్యూహంతో ప్రభుత్వాన్ని ఒప్పించడం. మూడు తనకున్న వనరులను ఆర్థిక సంపత్తితో అణగారిన దళిత ప్రజలను ఆదుకోవడం వీటితో దళితులలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఈ మూడు పద్ధతులు పాటించారు. ప్రచార ఆర్భాటాలకు తావీయని ఆచరణశీలి. హైదరాబాద్‌లో ఎక్కడ అవసరమైతే అక్కడ సంఘాలు స్థాపించారు. సంఘ సంస్కారం కోసం 1926లో ఆదిహిందూ మహాసభను ఏర్పాటు చేశాడు. మద్యపానానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. జాతి సంపద, అవకాశాలు, సౌకర్యాలు వనరుల పంపిణీ సమంగా జరగాలనే న్యాయసూత్రాన్ని ప్రతిపాదించారు. సమాజం మారాలంటే కుటుంబంనుండే మార్పు రావాలని నమ్మారు.
1936వ సంవత్సరం జనవరి నెలలో మహారాష్ట్ర యూత్ కాన్ఫరెన్స్ బి.ఎస్. వెంకటరావుని ఆహ్వానించింది. ఆ సమావేశాలలోనే డా||బి.ఆర్. అంబేద్కర్‌తో తొలి పరిచయం ఏర్పడింది. అక్కడినుండి అంబేద్కర్ భావజాలాల ప్రచారాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. 17.05.1936లో సికింద్రాబాద్ న్యూబోయిగూడాలో ‘అంబేద్కర్ యూత్ లీగ్’ను ఏర్పాటు చేశారు. తెలుగు నేలమీద తొలిసారిగా అంబేద్కరిజానికి అడుగులు పడ్డాయి. ఈ సంస్థకు బి.ఎస్. వెంకటరావు అధ్యక్షులు. దళితుల అభ్యున్నతికి, ఐక్యతకు ఈ సంస్థ కృషి చేసింది.
30.5.1936న బొంబాయిలో ప్రథమ మెహర్ సదస్సు జరిగింది. ఈ సభకు బి.ఎస్. వెంకటరావు అధ్యక్షత వహించారు. అంబేద్కర్ స్వయంగా బి.ఎస్. వెంకటరావుని ఏనుగు-అంబారీమీద సమావేశ స్థలానికి తీసుకొని పోయారు. సభికులు బి.ఎస్. వెంకటరావుని హైదరాబాద్ అంబేద్కర్‌గా ప్రశంసించారు. ఈ సమావేశాల తర్వాత ఆయన సేవలు నాగపూర్, పూనా, బొంబాయి, గుల్బర్గా, పూర్ణా, బాల్కి, మోమినాబాద్ మొదలైన ప్రాంతాలకు విస్తరించాయి. 1937లో నిజాం ప్రభుత్వం బి.ఎస్. వెంకటరావు ప్రజా సేవలను గుర్తించి ‘హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సభ్యునిగా నియమించింది. ఆయన 1938లో అంబేద్కర్ యూత్‌లీగ్‌ను ‘హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్’గా మార్చారు.
దళిత ప్రజలకోసం ఆయన కృషి ఏనాడూ ఆగలేదు. 1940లో ఆనాటి ప్రభుత్వానికి పది డిమాండ్లతో ఒక మెమొరాండం సమర్పించారు. అందులో దళితపేద విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు, పారితోషికాలు, అర్హులైన విద్యార్థులను విదేశీ విద్యకు పంపాలనే సామాజిక అవసరాలు ఉన్నాయి. మహారాష్ట్ర, నాగపూర్‌లలో జరిగిన ఆలిండియా డిప్రెస్డ్ మహాసభలలో బి.ఎస్. వెంకటరావు చురుకుగా పాల్గొన్నాడు. తన పని విధానంతో ప్రజల ఆదరణతో అంచెలంచెలుగా ఎదిగాడు. 1943లో ప్రభుత్వం డిపెన్స్ కౌన్సిల్ సభ్యునిగా, సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సభ్యునిగా 1943లో నియమించింది. ఆయన నిజాం శాసనసభకు 1946లో ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
నిజాం ప్రభుత్వానికి వినతిచేసి కోటి రూపాయల ఆర్థిక మంజూరీని ప్రతిపాదించారు. ప్రభుత్వం వెంటనే డబ్బు విడుదల చేయగా దాన్ని ‘డిప్రెస్డ్ క్లాసెస్ సంక్షేమనిధి’గా వాడారు. ఆయన ప్రతిభకు ముగ్ధుడై నిజాం విద్యాశాఖమంత్రిగా నియమించారు.
ఆస్తి ఉన్నా గరీబుగానే జీవించాడు. ప్రభుత్వంవద్ద డబ్బులేని పరిస్థితిలో బి.ఎస్. వెంకటరావు, నిజాం అనుమతి తీసుకొని తన స్వంత భవనాలను కూడా కుదువబెట్టి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు.
బి.ఎస్. వెంకటరావు నిర్వాసితులకు ఆశ్రయం కల్పించాడు. మిలటరీలో ఉద్యో గం పోయిన రెండువందల కుటుంబాలకు అల్వాల్ లోతుకుంటలలో సొంత స్థలాన్ని ఇచ్చారు. పాఠశాలలకోసం స్థలాలు విరాళాలుగా ఇచ్చాడు. ఈ ప్రాంతపు వెంకటాపురం ఆయన పేరుమీదుగా ప్రజలు పెట్టుకున్న జ్ఞాపకాల పిలుపు. ఆయనను ప్రజలు ‘రావు సాహెబ్’ అని ప్రేమగా పిలుచుకున్నారు.
నిగర్వి. నిరాడంబరజీవి. పేదరికాన్ని చూసి చలించిపోయే స్వభావం గలవారు. దళితుల విద్యాభివృద్ధికి పాటుబడ్డారు. ఆనాడే స్కాలర్‌షిప్‌లను, హాస్టల్ వ్యవస్థలను ఏర్పర్చారు. కల్లుపాక స్థానంలో పాఠశాలల ఏర్పాటు ఆయన నినాదం. పత్రికలను జర్నలిస్టులను చేరదీశాడు. ప్రఖ్యాత జర్నలిస్టు బుక్కాపట్నం రామానుజాచారి మరణం తర్వాత ఆయన ‘డెయిలీ న్యూస్’ను కొనుగోలుచేసి ఎం.ఆర్. చారి సంపాదకత్వంలో పత్రిక నడిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా (భాగ్యరెడ్డివర్మ) ‘వీరరత్న’ బిరుదు ప్రదానం చేశారు. నిజాం ప్రభుత్వం ‘ఖుస్రూ-ఎ-దక్కన్’ బిరుదు ఇచ్చింది. 1950 సంవత్సరం తర్వాత కూడా ఆయన రాజకీయాలనుండి వైదొలగలేదు. 1952లో సాధారణ ఎన్నికలలో ఓడిపోయినా, హైదరాబాద్ అసెంబ్లీనుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
దళిత నాయకునిగానేకాక, ప్రజాసేవకునిగా నేతగా ఆయనకు గొప్ప పేరుంది. బి.ఎస్. వెంకటరావు 4.11.1953న కన్నుమూశారు. ఆ రోజులలోనే తెలంగాణ ప్రాంతంలో సమాజ సంస్కారాన్ని కోరి కృషి చేసిన బి.ఎస్. వెంకటరావు మనం తెలుసుకోవలసి మనవాడు.
డా|| బెల్లంకొండ సంపత్‌కుమార్