శ్రీధర్ రావు దేశ్‌పాండే
19వ శతాబ్దం చివరి నాటికి దేశంలో అనేక బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో పెద్ద నదులపై ఆనకట్టలు, డ్యాంల నిర్మాణం చేసినారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఇంజనీరింగ్, టెక్నాలజీని సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యంలోకి తీసుకొచ్చాడు. భారీ ప్రాజెక్టుల సాంకేతికతను అందిపుచ్చుకున్న మొదటి సంస్థానం హైదరాబాదే.
ఘన్‌పూర్ ఆనకట్ట :
తొలుత మెదక్ జిల్లాలో మంజీరా నదిపై కుల్చారం మండలం ఘన్‌పూర్ వద్ద ఆనకట్టని ప్రారంభించారు. 1896-97లో సంభవించిన కరువును చూసి, ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఘన్‌పూర్ ఆనకట్ట నిర్మాణానికి అనుమ తించినాడు. 18 లక్షల ఖర్చుతో 1904లో ఆనకట్ట పూర్తి అయి 42.80కి.మీ. పొడవున్నకుడి కాలువ ద్వారా 11,500 ఎకరాలకు నీటి సరఫరా జరిగింది. కుడి కాలువకు నిజాం పేరుతో మహబూబ్‌నగర్‌గా నామకరణం చేసినారు. ఆ తర్వాత నవాబ్ అలీ నవాజ్ జంగ్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా ఇరిగేషన్ విభాగంలో పని చేస్తున్న కాలంలో ఘన్‌పూర్ ఆనకట్టకు ఫతేనహర్ పేరుతో 12.80 కి.మీ. ఎడమ కాలువని తవ్వించినాడు. ఫతేనహర్ ద్వారా 10,200 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ :
1908 సెప్టెంబరు 28న మూసీ నదికి అసాధారణమైన వరదలు సంభవించినాయి. సెప్టెంబర్ 26,27న కురిసిన వర్షపాతం 32.5 సెంటీ మీటర్లుగా నమోదు అయ్యింది. ఇది హైదరాబాద్ చరిత్రలో అతి పెద్ద వర్షపాతం. 800 చదరపు మైళ్ళ మూసీ పరివాహక ప్రాంతంలో 788 చెరువులు ఉన్నాయి. ఇందులో దాదాపు 221 చెరువులు తెగిపోయినాయి. ఈ వరద బీభత్సానికి మూసీకి రెండు వైపులా చదరపుమైలు విస్తీర్ణంలో 19 వేల ఇండ్లు కూలిపోయినాయి. 80 వేల మంది నిరాశ్రయులు అయి నారు. 10 నుండి 15 వేల మంది వరదల్లో కొట్టుకు పోయి నారు. మూసీకి వరదలు తగ్గు ముఖం పట్టినాక ఆ బీభత్స దృశ్యాలు వర్ణించనలవికానంత దుర్భరంగా ఉన్నాయి. ఎటు చూసినా కూలిన ఇండ్లు, చెట్లు, బండరాళ్ళు, బురద, మనుషుల, పశువుల మృతదేహాలు, హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది.
ఈ వరద సష్టించిన విధ్వంసం వలన రాజధాని హైదరాబాద్ నగరంలో విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడంతో ఎడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మూసీ వరద నివారణకు తగిన చర్యలు సూచించమని ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించినాడు. 1909లో ప్రభుత్వం ఆయనను కన్సల్టింగ్ ఇంజనీర్‌గా నియమించింది. ఆయన కు సహాయకుడిగా ఇరిగేషన్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ప్రతిభావంతుడైన ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌ని నియమించింది. వారికి అప్పగించిన బాధ్యతలు మూడు. 1. హైదరాబాద్ నగర పునర్ నిర్మాణానికి కార్యాచరణ తయారు చేయాలి. 2. భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి నివారణ పథకాలు తయారు చేయడం 3. హైదరాబాద్ నగర డ్రైనేజీ వ్యవస్థ కోసం ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేయడం.
అలీ నవాజ్ జంగ్ ప్రాథమికంగా మూసీ, ఈసీ నదులపై సమగ్ర సర్వే నిర్వహించినాడు. సర్వే నివేదికలను, హైడ్రాలాజికల్ అంశాలని విశ్లేషించిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికి , ఎగువన వరదను ఇముడ్చుకునేందుకు తగినంత నిల్వ సామర్థ్యం కలిగిన రెండు జలాశయాలను నిర్మించాలని ఇద్దరు ఇంజనీర్లు ప్రతిపాదించినారు. ఒకటి హైదరాబాద్ నగరానికి ఎగువన 8.5 మైళ్ళ దూరంలో మూసీకి అడ్డంగా 8.4 టి.యం.సి నిల్వ సామర్థ్యంతోఉస్మాన్ సాగర్ డ్యాం, 6.5 మైళ్ళ దూరంలో ఈసీకి అడ్డంగా 11.95 టి.ఎం.సిల నిల్వ సామర్ధ్యంతో హిమాయత్ సాగర్ డ్యాం నిర్మించాలని ప్రతిపాదన.
ప్రభుత్వం వారిద్దరూ ప్రతిపాదించిన పథకాలను యధాతథంగా ఆమోదించింది. ఉస్మాన్ సాగర్ నిర్మాణానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 23 మార్చ్ 1913న పునాదిరాయి వేసినాడు. ఉస్మాన్ సాగర్ నిర్మాణం 1918 లో పూర్తి అయింది. హిమాయత్ సాగర్ నిర్మాణం 1918 లో ప్రారంభమై 1926 లో పూర్తి అయింది. ఉస్మాన్ సాగర్ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 55 లక్షలు. హిమాయత్ సాగర్ నిర్మాణానికి అయిన ఖర్చు 86 లక్షల 75 వేలు.ఈ రెండు జలాశయాల నిర్మాణాన్ని పర్యవేక్షించిన వారు హైదరాబాద్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. వీటి నిర్మాణం జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం శాశ్వతంగా వరదల నుంచి విముక్తి పొందింది. అంతేకాక ఈ రెండు జంట జలాశయాలు ఆ రోజుల్లో మొత్తం హైదరాబాద్ , సికిందరాబాద్ జంట నగరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేవి.
1970 దశకం దాకా హైదరాబాద్ నగరంలో 24 గంటలు నల్లాల్లో నీళ్ళు వచ్చేవట. ”సర్కారీ నల్లా బారా ఘంటా ఖుల్లా” అన్న నానుడి కూడా పుట్టింది. ఉస్మాన్ సాగర్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుతో నిర్మాణం అయితే, హిమాయత్ సాగర్ బేరార్ రాకుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరు మీద నిర్మితమయింది. ఈ రెండు జలాశయాలు విశ్వేశ్వరయ్య, అలీ నవాజ్ జంగ్ జంట హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలకు ఇచ్చిన అపూర్వ కానుకలు.
అదే సమయంలో హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి వెళుతున్న మూసీకి ఇరు వైపులా ఎత్తైన రాతి గోడలను నిర్మించి మూసీ, ఈసీల నుంచి వచ్చే అదనపు జలాలను సాఫీగా దిగువకు పోయేందుకు వీలు కల్పించినారు. హైదరాబాద్ నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థని ప్రతిపాదించి నిర్మింపజేసిన ఘనత కూడా వారిదే. ఆ రోజుల్లో ఇటువంటి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన నగరాలు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి అభివృద్ధి చెందినా దేశాల్లోనే ఉండేది. అరవైఏండ్ల ఉమ్మడి పాలనలో హైదారాబాద్ నగర్ డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆధునీకీకరణకు నోచుకోక, నాలాలు, చెరువులు కబ్జాలకు గురి అయి వర్షపు నీరు పోయేందుకు చోటులేక రోడ్లను, కాలనీలను ముంచుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ నగర రోడ్లు చెరువులుగా మారే పరిస్థితి ఉత్పన్నం అయ్యింది. హైదరాబాద్ నగరానికి విశ్వేశ్వరయ్య, అలీ నవాజ్ జంగ్‌లు అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థను కానుకలుగా ఇస్తే వలస పాలకులు విధ్వంసం చేసినారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల నిర్మాణం జరగడానికి కొద్దిగా ముందుగానే మంజీరా ఉపనది, ఆలేరు వాగుపై నిజామాబాద్ జిల్లాలో పోచారం ప్రాజెక్టు కూడా నిర్మాణం జరిగింది. ఖమ్మం జిల్లాలో 1922లో వైరా ప్రాజెక్టుకు శంకు స్థాపన జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఖమ్మం జిల్లాలోనే పాలేరు నదిపై మరో డ్యాం నిర్మాణానికి పునాదిరాయి వేసినారు. ఈ ప్రాజెక్టులన్నీ మంజీరా నదిపై నిర్మాణం అయిన భారీ ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు పైలట్ ప్రాజెక్టులుగా పని చేసినాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో గడించిన అనుభవంతో అలీ నవాజ్ జంగ్ బహాదూర్ నిర్మాణ సారధ్యంలో ఇంజనీర్లు నిజాంసాగర్ నిర్మాణానికి పూనుకున్నారు.
నిజాంసాగర్:
నిజాంసాగర్ ప్రాజెక్టుని మంజీరా నదిపై నిజామాబాద్ జిల్లాలో అచ్చంపేట గ్రామం వద్ద నిర్మించారు. ఆ కాలంలో మంజీరా నది అంతర్రాష్ట్ర నది కాదు. మంజీరా నది ప్రవహించే కర్నాటక,మరాఠ్వాడా జిల్లాలు కూడా హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి. నిజాం ప్రభుత్వం 1923 సెప్టెంబర్ 19లో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. మంజీరా జలాలను వీలయినంత ఎక్కువగా వాడుకోవడానికి వీలుగా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినారు చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్. ప్రాజెక్టు నిర్మాణం 1923 ప్రారంభమయి 1933లో పూర్తి అయ్యింది. డ్యాం నిర్మాణం, కాలువల నిర్మాణం ఏకకాలంలో జరిగేటట్టు ప్రణాళిక తయారు చేసుకున్నారు. 1930 నాటికే డ్యాం నిర్మాణం పూర్తి అయ్యింది. ప్రధాన కాలువ 60 మైళ్ళు పూర్తి అయ్యింది. 1930 లో ప్రధాన కాలువలోకి నీటి విడుదల ప్రారంభమయ్యింది. 1933 నాటికి కాలువ వ్యవస్థ పూర్తిఅయి పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడం ప్రారంభమయ్యింది.
ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. రాళ్ళు, ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రిని తరలించడంలో రైతులు ఎడ్ల బండ్లను నడిపి ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్నారు.నిర్మాణ సమయంలో ఉపాధిని పొందారు. ఆయకట్టు రైతుల భాగస్వామ్యం వల్లనే ప్రాజెక్టు నిర్మాణం పదేండ్ల కాలంలో పూర్తి కాగలిగిందని ఆనాటి నిపుణులు వ్యాఖ్యానించారు.అలీ నవాజ్ జంగ్ దార్శనికత , పరిపాలనా దక్షతకు ఇదొక తిరుగులేని దాఖలా. నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు యంత్రాల సహాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలీ నవాజ్ జంగ్ మానవ శ్రమనే నమ్ముకున్నారు. దానికి రెండు కారణాలు
ఉన్నాయి. ఒకటి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, రెండు యంత్రాలపై ఖర్చయ్యే భారీ మొత్తాలను ప్రాజెక్టు పనుల కోసం ఖర్చు చెయ్యడం. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల సౌకర్యం కోసం వెచ్చించడం.
నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అందమైన ఉద్యానవనం, కొండపై కుటీరాలు నిర్మాణం అయినాయి. ఆ కొండపై నుంచి నిజాంసాగర్ అందాలు కనువిందు చేస్తాయి. 57 వ మెయిలు వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్( థానా చెరువులో) వద్ద అంతం అవుతుంది. ఈ జలాశయాన్నే అలీ సాగర్ గా పిలుస్తారు. అలీ నవాజ్ జంగ్ స్మారకార్థమే ఈ జలాశయాన్ని అలీసాగర్‌గా నామకరణం చేసినట్లుగా నిజామాబాద్ జిల్లా వాసులకే తెలియదు.
ఉమ్మడి పాలనా కాలంలో మన చరిత్ర కనుమరుగు అయ్యింది. ఆలీసాగర్ కూడా అందమైన ప్రదేశం. రెండు కొండల నడుమ డ్యాం నిర్మాణం అయ్యింది. ఎడమ వైపు కొండపై విశ్రాంతి భవనం, డ్యాం దిగువన ఉద్యానవన ఏర్పాటు కావడంతో నిజామాబాద్ జిల్లాలో అదొక టూరిస్టు కేంద్రంగా మారింది.
నిర్మాణం జరిగినప్పుడు నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 29.70 టి.ఎం.సి.లు. రాతి డ్యాం పొడవు 10,100 అడుగులు. జలాశయం విస్తీర్ణం 50 చరపు
మైళ్ళు. స్పిల్ వే గేట్ల సంఖ్య 28. మొత్తం ఆయకట్టు 2.75 లక్షల ఎకరాలు.ప్రధాన కాలువ పొడవు 72.50 మైళ్ళు. డ్యాం నిర్మాణానికి గ్రానైట్ రాళ్ళు, డంగు సున్నం వినియోగించినారు. కాలక్రమేణ పూడిక వలన నిజాం సాగార్ నిల్వ సామర్థ్యం 17 టి.ఎం.సి.లకు పడిపోయింది. ఎగువన మంజీరాపై సింగూరుడ్యాం, ఆ పైన కర్నాటక, మహారాష్ట్రాల్లో ఆనేక ప్రాజెక్టులు నిర్మాణం కావడంతో నిజాంసాగర్‌కు నీటి ప్రవాహాలు తగ్గిపోయినాయి. సాగు అయ్యే ఆయకట్టు కూడా గణనీయంగా తగ్గిపోయింది.
నిజాం సాగర్ నిర్మాణం జరిగిన తర్వాత నిజామాబాద్ జిల్లా రూపు రేఖలు మారిపొయినాయి.హైదరాబాద్ రాజ్యంలోనే సంపద్వంతమైన జిల్లాగా మారింది. కాలువల కింద వరి, చెరుకు పంటలను ప్రభుత్వం ప్రోత్సహించింది. చెరుకు పండించడానికి సాగునీరు, దానికి మార్కెట్ కల్పించడానికి నిజాం ప్రభుత్వం ఆసియాలోనే అతి పెద్ద చక్కర కార్మాగారాన్ని నిర్మించడానికి నిర్ణయించింది. బోధన్ పట్టణానికి దగ్గరలో నిజాంసాగర్ కాలువ కింద 15,000 ఎకరాల భూమిని చక్కర ఫ్యాక్టరీ కోసం కేటాయించినారు. ఫ్యాక్టరీ నిర్మించిన ప్రాంతాన్ని శక్కర్ నగర్‌గా నామకరణం చేసినారు. ఫ్యాక్టరీ స్వంత భూముల్లోనే కాక చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా వేలాది ఎకరాల్లో చెరుకు పండించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. రోజుకు 3 వేల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ సంవత్సరానికి 7 లక్షల క్వింటాళ్ళ చక్కరను ఉత్పత్తి చేసేది. ఇది ఆనాటికి ఆసియాలోనే అతి పెద్ద చక్కర ఫ్యాక్టరీ. 1937 లో నిజాం షుగర్స్ ప్రారంభం అయ్యింది. అయితే దేశానికి తలమానికంగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని నష్టాలపాలు చేసి ప్రైవేటు పరం చేసిన ఘనత ఉమ్మడి పాలకులది.
భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు :
- హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం జరిగే నాటికి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు, హైదరాబాద్‌లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఖమ్మం జిల్లాలో పాలేరు, వైరా, కరీంనగర్ జిల్లాలో అప్పర్ మానేరు, మహబూబ్‌నగర్ జిల్లాలో డిండీ, రాయనిపల్లి, సింగభూపాలం, కోయిల్ సాగర్, తుంగభద్ర, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టులు నిర్మాణం అయినాయి.
- ఇవికాక నిజాం ప్రభుత్వం మరి కొన్ని భారీ ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసింది. గోదావరి పై 400 టీ.ఎం.సీ.ల పోచంపాడు (కుస్తాపురమ్) ప్రాజెక్టును, 350 టీ.ఎం.సీ.ల ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును, మంజీరానదిపై 38 టీ.ఎం.సీల దేవనూరు ప్రాజెక్టును, కృష్ణా నదిపై 132 టీ.ఎం.సీల నందికొండ ప్రాజెక్టును, 54.4 టీ.ఎం.సీల అప్పర్ కృష్ణ్ణా ప్రాజెక్టును, తుంగభద్ర నదిపై 65 టీ.ఎం.సీల తుంగభద్ర ఎడమ కాలువ, రాజోలి బండ మళ్ళింపు పథకము, భీమా నదిపై 100 టీ.ఎం.సీల భీమా ప్రాజెక్టును, పెండ్లిపాకల జాలాశయం, మూసీ నదిపై మూసీ ప్రాజెక్టు, మరాఠ్వాడాలో పూర్ణా, పెన్‌గంగ ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
- మొత్తంగా తెలంగాణలో 1365 టీ.ఎం.సీ.ల కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు ఉన్నవి. రాష్టాల పునర్వ్యవస్థీకరణ జరిగి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో కొన్ని ప్రాజెక్టులను లిస్టులోంచి తొలగించారు. కొన్నింటి సామర్థ్యాన్ని కుదించారు. మరికొన్నింటిని సుప్తావస్థలో ఉంచారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తరువాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ తీవ్ర వివక్షకు లోనైంది. ఇదంతా తెలంగాణా రాష్ట్ర సాధనా ఉద్యమ సమయంలో విస్తతంగా చర్చించుకున్నాము. తెలం గాణ ఉద్యమ చైతన్యంలో నీటి దోపిడి, వివక్ష అనివార్యంగా ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. తలాపున గోదావరి, కృష్ణా నదులు పారు తున్నా తెలంగాణకు ఈ నీటి గోస ఎందుకు? అన్న ప్రశ్న గ్రామీణ ప్రజలను తట్టి లేపింది. నీటి దోపిడి అంశం ఉద్యమానికి విశాల ప్రజానీకం మద్దతు లభించింది. ఈ ప్రజా పునాది కారణంగానే ఉద్యమం సుదీర్ఘకాలం మనగలిగింది. రాజకీయ నాయకత్వాన్ని మెడలు వంచి తన వైపు నిలబెట్టుకోగలిగింది. అంతిమంగా విజయాన్ని అందుకోగలిగింది.
- తెలంగాణా ప్రభుత్వం ప్రజల సాగునీటి ఆకాంక్షలని నెరవేర్చే కృషిలో ఉన్నది. తెలంగాణాని కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ప్రణాలికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నది. 1. గత ప్రభుత్వాలు ప్రారంభించి పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులని తెలంగాణా అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్ చేసుకొని త్వరితగతిన పూర్తి చేయడం, 2. గత ప్రభుత్వాలు ఆనుమతించి అటకెక్కించిన ప్రాజెక్టులని వేగవంతంగా పూర్తి చేయడం, 3. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురి అయి శిథిలమైపోయిన పాత ప్రాజెక్టులను, ఆధునీకరించుకొని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకొని గ్యాప్ ఆయకట్టుని సాగులోనికి తీసుకురావడం. విలీనం తర్వాత ఆగిపోయిన సాగునీటి రంగ అభివృద్ధి క్రమం తెలంగాణా ఏర్పాటుతో వేగం పుంజుకున్నది.తెలంగాణా ప్రజల సాగునీటి ఆకాంక్షలు సాకారం అయ్యే విధంగా తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తున్నది.
- కాళేశ్వరం, ప్రాణహిత, పాలమూరు-రంగారెడ్డి, డిండీ, చనాక-కొరాటా, సీతారామ , శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం, తుపాకుల గూడెం తదితర ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి రాష్ట్ర బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించడమే కాక, జాతీయ బ్యాంకుల ద్వారా నిధులను సమకూ ర్చుతున్నది. 2018 నాటికి ఈ ప్రాజెక్టుల ద్వారా పాక్షిక ప్రయోజనాలు నేరవేరనున్నాయి.