హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఎయిర్ పోర్టు సిటి నిర్మాణంపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, నవీన్ మిత్తల్, హెచ్‌ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, జిఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జున రావు, ఎయిర్ పోర్టు బిజినెస్ ఛైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల, బిజినెస్ ఛైర్మన్ బివిఎన్‌రావు, ఎయిర్ పోర్టు సీఇవో ఎస్.జి.కె. కిశోర్, డైరెక్టర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
2008లో ప్రారంభమయిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎయిర్ పోర్టుగా నిలిచిందని, ఐటి వినియోగం సహా అనేక విషయాల్లో అగ్రగామిగా ఉందని జిఎంఆర్ ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టుకు రోజుకు 400 విమానాలు వచ్చిపోతున్నాయని, ఏడాదికి కోటి 70 లక్షల(17 మిలియన్) మంది ప్రయాణీకులు హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారని వారు వివరించారు. తెలంగాణ ఏర్పడకముందు 7 శాతం ఉన్న రద్దీ వృద్ధ్ది రేటు, ప్రస్తుతం 20.4 శాతానికి పెరిగిందని, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని వారు అంచనా వేశారు. ప్రస్తుతమున్న టర్మినల్, రన్ వే దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రయాణీకుల రాకపోకలకు అనువుగా ఉందని వెల్లడించారు. అయితే ప్రస్తుతమున్న వృద్ధిరేటును అంచనా వేస్తే, టర్మినల్ విస్తరణ, రెండో రన్‌వే నిర్మాణం అవసరమవుతుందని వారు చెప్పారు. రెండో రన్ వే నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. దీనికి ప్రభుత్వ సహకారం కావాలని వారు కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
”హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, మెరుగైన శాంతి భద్రతలు తదితర కారణాల వల్ల వందలాది అంతర్జాతీయ సదస్సులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. దీంతో విమానాశ్రయంలో రద్దీ పెరుగుతున్నది. రాబోయే 25 ఏళ్లకు ఏర్పడే రద్దీని కూడా అంచనా వేసుకుని టర్మినల్ విస్తరణ, రెండో రన్ వే నిర్మాణం చేపట్టాలి. ఐదు కోట్ల మంది ప్రయాణీకులు వచ్చిపోయినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలి. ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహించుకునే విధంగా 12 వేల మంది పట్టే కాన్ఫరెన్స్ హాలు, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఎగ్జిబిషన్ హాల్స్, స్టార్ హోటళ్లు, మాల్స్, హాస్పిటల్స్, ఉద్యానవనాలు, విశాలమైన పార్కింగ్ స్థలంతో కూడిన ఎయిర్ పోర్టు సిటీని 600 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించాలి. ఎయిర్ పోర్టు సిటీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచే విధంగా ఉండాలి. త్వరలోనే ఎయిర్ పోర్టు సిటీ నిర్మాణానికి నేనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తా. విమానాశ్రయం పదేళ్ల వేడుకలో పాల్గొంటా” అని జిఎంఆర్ ప్రతినిధులకు సీఎం మాటిచ్చారు.
”ఎయిర్ పోర్టు సిటి నిర్మాణం, టర్మినల్ విస్తరణ, రెండో రన్ వే నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారుల నిర్మాణం, విస్తరణ, విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, సానిటేషన్, డ్రైనేజి తదితర పనులు ప్రభుత్వ పరంగా చేయాలి. హైదరాబాద్ మెట్రో రైలును విమానాశ్రయం వరకు పొడిగించాలి. మెట్రో రైలు విమానాశ్రయం వరకు ఉంటే, ఢిల్లీలో మాదిరిగా చాలా వరకు రైలులోనే విమానాశ్రయం చేరుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మెట్రో రైలును విమానాశ్రయం వరకు విస్తరించే పనులు వెంటనే ప్రారంభమయ్యేలా త్వరలోనే జిఎంఆర్, ఎల్ అండ్ టి, హెచ్‌ఎంఆర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రూ.12.28 కోట్ల డివిడెండ్ అందించిన జిఎంఆర్
2016-17 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా(13శాతం) కింద రూ.12.28 కోట్ల రూపాయల చెక్కును జిఎంఆర్ గ్రూప్ ఛైైర్మన్ మల్లిఖార్జున రావు సీఎం కేసీఆర్‌కు అందించారు.