ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హోంగార్డులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్లను నెరవేర్చారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన హోంగార్డులు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకే పనికి వేతనాలలో వ్యత్యాసం ఉండకూడదనే ఉద్ధేశ్యంతో హోంగార్డులకు కూడా వేతనాలుపెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఇస్తున్న వేతనం నెలకు రూ. 12వేల నుంచి రూ. 20వేలకు పెంచుతున్నట్లు హోంగార్డుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల ఇంక్రిమెంటు ఇవ్వనున్నట్లు తెలిపారు.
హోంగార్డులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించనున్నట్లు పేర్కొన్నారు. ఇదేకాకుండా ఆరోగ్యపరంగా కూడా వారిని ఆదుకుంటామని, వారికి, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్సు కవర్ చేస్తామని తెలిపారు. ట్రాఫిక్‌లో పనిచేస్తున్న హోంగార్డులకు ఇతర పోలీసుల మాదిరిగానే 30శాతం అదనపు వేతనం ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం నాలుగు యూనిఫామ్స్ ఇస్తామని తెలిపారు. మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు, భార్య ప్రసూతి అయిన సందర్భంగా పురుష ఉద్యోగులకు 15 రోజులు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. బందోబస్తు డ్యూటీ చేసే హోం గార్డులకు కానిస్టేబుళ్ళతో సమానంగా డైట్ చార్జీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంత్యక్రియలకు చెల్లించే రూ. 5వేలను రూ. 10వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.కానిస్టేబుళ్ళ మాదిరిగానే హోంగార్డులకు పోలీస్ ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహిస్తామన్నారు. కానిస్టేబుళ్ళ ఎంపిక సమయంలో హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్లను పెంపు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు
హోంగార్డుల జీతాలు పెంచడంతో పాటు వారి సంక్షేమానికి పలు నిర్ణయాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హోంగార్డుల ఇబ్బందులను మానవత్వంతో అర్థం చేసుకుని వారికి న్యాయం చేకూర్చారన్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఎంతో కృషి చేస్తున్నదని ఆయన కొనియాడారు.