సువిశాల భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 17వ లోక్‌ సభకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోడా మార్చి 10న ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆనాటి నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు తొలిదశలో ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియకూడా ముగిసి, ప్రచార పర్వం కొనసాగుతోంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లో కూడా 25 పార్లమెంటు స్థానాలకు, ఆ రాష్ట్ర శాసన సభకు 175 స్థానాలకు తొలిదశలోనే, ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరుగనుంది.

మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆనాటి నుంచి మార్చి 25 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం, మార్చి 26న నామినేషన్ల పరిశీలన జరిగాయి. మార్చి 28న

ఉపసంహరణలతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక ఏప్రిల్‌ 11న పోలింగ్‌ కు రంగం సిద్ధమైంది.

దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల మొత్తం 543 లోక్‌ సభాస్థానాలకు ఏప్రిల్‌ 11నుంచి మే 19 వరకూ ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అంటే, తొలిదశలో పోలింగ్‌ జరిగిన ప్రాంతాల ఫలితాల కోసం దాదాపు నెలన్నర రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిసా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఈ.వి.ఎంతో పాటు వి.వి. ప్యాట్లు ఉపయోగించడం ఇదే ప్రథమం. బ్యాలెట్‌ యూనిట్‌ పై రాజకీయపార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతోపాటు, ఈసారి ప్రథమంగా సదరు వ్యక్తి ఫోటో కూడా ముద్రించనున్నారు.

మొత్తం ఏడు దశలలో జరుగనున్న పోలింగ్‌ కు సంబంధించి మొదటి దశలో ఏప్రిల్‌ 11న 20 రాష్ట్రాలలోని 91 లోక్‌ సభా స్థానాలకు, రెండవ దశలో ఏప్రిల్‌ 18న 13 రాష్ట్రాలలోని 97 స్థానాలకు, మూడవ దశలో ఏప్రిల్‌ 23న 14 రాష్ట్రాలలోని 115 స్థానాలకు, నాలుగవ దశలో ఏప్రిల్‌ 29న 9 రాష్ట్రాలలోని 71 స్థానాలకు, ఐదో దశలో మే6న 7 రాష్ట్రాలలోని 51 స్థానాలకు, ఆరో దశలో మే 12న 7 రాష్ట్రాలలోని 59 స్థానాలకు, ఏడోదశలో మే 19న 8 రాష్ట్రాలలోని 59 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాలు (అండమాన్‌ నికోబార్‌, దాద్రానాగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి, చండీగఢ్‌)లలో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.

కాగా, కర్ణాటక, మణిపూర్‌, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాలలో రెండు దశలలోనూ, అస్సాం, ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రాలలో మూడు దశలలోనూ, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర. ఒడిసా రాష్ట్రాలలో నాలుగు విడతలలోనూ, జమ్ముకశ్మీర్‌ లో ఐదువిడతల్లో, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో ఏడు విడతల్లోనూ పోలింగ్‌ నిర్వహిస్తారు.

17 స్థానాలకు పోటీలో 443 మంది

తెలంగాణలోని 17పార్లమెంటు నియోజకవర్గాలలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 443 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీటిలో అత్యధికంగా నిజామాబాద్‌ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య

నిజామాబాద్‌ – 185

సికింద్రాబాద్‌ – 28

నల్గొండ – 27

ఖమ్మం – 23

చేవెళ్ళ – 23

పెద్దపల్లి – 17

హైదరాబాద్‌ – 15

కరీంనగర్‌ – 15

వరంగల్‌ – 15

మహబూబాబాద్‌ – 14

భువనగిరి – 13

జహీరాబాద్‌ – 12

మల్కాజిగిరి – 12

మహబూబ్‌నగర్‌ – 12

నాగర్‌కర్నూల్‌ – 11

ఆదిలాబాద్‌ – 11

మెదక్‌ – 10

Other Updates