సి.ఎం. ఢిల్లీ పర్యటన
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం రాబట్టేందుకై మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను ఉన్నతాధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన సహాయానికి సంబంధించి వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు, అధికారులు తెలంగాణాకు సహాయం చేయడానికి సానుకూలంగా స్పందించారు. సుమారు 4,700 కోట్లు అదనంగా నిధులు వచ్చే విధంగా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వివరించారు. అక్టోబర్ 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు ను కలిసి హైకోర్టును విభిజించాల్సిందిగా విన్నవించారు. ఉమ్మడి హైకోర్టు ఉండడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో కలిసి పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్నుల రాయితీ ఇవ్వాలని వ్యాట్ కు సంబంధించిన వాటాను విడుదల చేయాలని ఆర్థికమంత్రిని కోరారు. విద్యుత్ విషయంలో కేంద్రం సహాయ సహకారాలు అందించాలని, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సమస్యలు లేకుండా సహకరించా లని విన్నవించారు. ఈ విషయంలో ఎన్.టి.పి.సి. సి.యం.డి., అరూప్‌రాయ్ చౌదరితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పి ఉత్పత్తిని ప్రారంభించడానికి అవసరమైన చర్చలను జరిపారు. రామగుండంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ప్రధాని మోడి చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించే విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్‌టిపిసీ సి.యం.డి.తో చర్చించారు. అలాగే తెలంగాణ రా ష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీితో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఢిల్లీ పర్యటన సుహృద్భావ వాతావరణంలో జరిగింది. కేంద్రానికి సంబంధించిన మంత్రులు అధికారులు సానుకూలంగా స్పందించడంతో కేంద్రం నుంచి ఎక్కువ సహాయ సహకారాలు లభించే విధంగా పర్యటన జరిగింది.