సెమీఫైనల్లో కష్టపడి గెలిచాను : సింధు
కొత్త సీజన్‌లో శుభారంభం లభించింది. ఇదో గొప్ప విజయం. ఫైనల్‌తో పోలిస్తే టాప్ సీడ్ సుంగ్ జీ హున్‌తో జరిగిన సెమీఫైనల్లో కష్టపడి గెలిచాను. ఫైనల్లో ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకున్నాను. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడినా… అప్పటికి ఇప్పటికీ నా ఆటతీరులో చాలా మార్పు వచ్చింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు కొత్త ఏడాదిలో శుభారంభం చేసి కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. ఈ హైదరాబాద్ అమ్మాయి మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది.
జనవరి 24న ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రీి గోల్డ్ టోర్నమెంట్‌లో సింధు చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-15, 21-9తో ప్రపంచ 20వ ర్యాంకర్ కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై గెలిచింది. విజేతగా నిలిచిన సింధుకు 9000 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎనిమిదేళ్ల చరిత్ర కలిగిన మలేసియా మాస్టర్స్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండుసార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా సింధు గుర్తింపు పొందింది. 2013లో సింధు మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను తొలిసారి సాధించి సీనియర్ స్థాయిలోనూ గొప్ప విజయాలు సాధించే సత్తా తనలో ఉందని చాటిచెప్పింది.
సెమీఫైనల్లో టాప్ సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించిన సింధు ఫైనల్లోనూ నిలకడగా ఆడింది. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడిన అనుభవమున్న సింధు ఈసారి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్ షాట్‌లతో పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో తొలుత 5-2తో, ఆ తర్వాత 12-6తో, 18-10తో సింధు ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆటతీరుకు గిల్మౌర్ వద్ద సమాధానం లేకపోయింది.
మొదట్లో సింధు 9-6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు నెగ్గి 16-6తో ముందంజ వేసింది. గిల్మౌర్‌కు ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు తుదకు 32 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన సింధు మూడు గంటల 46 నిమిషాలపాటు కోర్టులో గడిపింది.
‘బాయ్’ నజరానా రూ. 5 లక్షలు
మలేసియా ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఇదే విధంగా రాణిస్తూ మున్ముందు ఆమె మరిన్ని టైటిల్స్ గెలవాలని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా ఆకాంక్షించారు.