అంగరంగ వైభోగంగా జరిగిన కల్యాణ ఘట్టాన్ని వర్ణించాలంటే కవులు, రచయితలు సాధారణంగా ‘ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీఠమేసి’ అని సంబోధిస్తూ వుంటారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రం కందనూలులో జరిగిన 165 జంటల సామూహిక వివాహాల వేడుకను చూసిన వారెవరైనా ‘ఆకాశమంత పందిరి’ అంటే అర్థం తెలిసివచ్చిందని తప్పక ఒప్పుకుని తీరుతారు. సామూహిక వివాహాలు జరిపితే ఎదో ఒక్క రోజులో తంతు ముగించేస్తారు. కానీ ఇక్కడ జరిగిన ఈ వేడుక నాలుగు రోజులపాటు అతివైభోగంగా, ధనవంతుల ఇళ్లల్లో నిర్వహించిన పెళ్లిళ్ల లాగా ఘనంగా నిర్వహించారు.

ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలో 165 జంటలు, ఏడడుగులు నడిచి, మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. వేదమంత్రోచ్చారణలతో మార్మోగిన ఈ కల్యాణోత్సవాలకి ముఖ్యఅతిధిగా రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. బతుకునిచ్చిన సమాజానికి, నిరుపేదలకు ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో మర్రి జనార్దన్‌ రెడ్డి సమాజ సేవ చేయడం సంతోషకరమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించే విధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, ఆయన సతీమణి జమునారాణిలు సమాజ అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ….. మానవ సేవే మాధవ సేవ అనే దృక్కోణం నుంచి పుట్టిందే ఎంజేఆర్‌ ట్రస్ట్‌ అని అన్నారు. సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యం తో 2012 లో మా తండ్రిగారి పేరు మీద ఈ ట్రస్ట్‌ ను స్థాపించానని తెలిపారు. పెళ్లి చేయాలంటే ఎన్ని తిప్పలు పడవలసి వస్తుందో, తన చెల్లెలి పెళ్లి సందర్బంగా తాను స్వయంగా అనుభవించానని అని తెలియజేస్తూ, అందుకే ఈ ట్రస్ట్‌ ద్వారా వివాహాలు జరిపిస్తే, ఆడపిల్లలున్న పేద తల్లితండ్రులకు ఎంతో భారం దూరమౌతుందని ఆలోచించి 2014 లో సామూహిక వివాహాలకు రూపకల్పన చేసి 85 జంటలకు కళ్యాణం జరిపించినట్లు తెలిపారు. అది మొదలు ఆ తర్వాత సంవత్సరం 125 జంటలకు, మరోసారి 135 జంటలకు, ఇపుడు 165 జంటలకు వివాహాలు జరిపించడం జరిగిందన్నారు. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం పరిసర గ్రామీణ ప్రాంతాలలో వుండే ప్రభుత్వ పాఠశాలలకు 15 -20 లక్షల వరకు ఖర్చు చేసి ఆయా పాఠశాలల్లో ఆధునిక హంగులు ఏర్పాటు చేసి, కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేవిధంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ ట్రస్ట్‌ ద్వారా చేసే సేవల్లో భాగంగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి 50 లక్షల రూపాయల ఖర్చుతో ఆధునీకరణ చేసి ప్రైవేట్‌ ఆసుపత్రులకు ధీటుగా రూపొందించడం జరిగిందన్నారు. ఇంతేకాకుండా 15 లక్షల రూపాయలతో 108 వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందన్నరు. ఈ వివాహా వేడుకలగురించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి ఒకేసారి 165 జంటలకు పెళ్లి రోజునే కల్యాణ లక్ష్మి చెక్కులను పీటలమీదే అందజేయడం జరిగిందన్నారు.



ఈ కల్యాణ వేడుకల క్రతువులో సంగీతవిభావరి, డిజిటల్‌ వీడియోగ్రఫీ, కోలాటం వంటి కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వివాహా వేడుకలకు హాజరైన దాదాపు 20 వేల మందికి సాయి గార్డెన్స్‌ లో విందుభోజనం ఏర్పాటు చేశారు.

ట్రస్ట్‌ ద్వారా అందజేయబడిన పట్టు వస్త్రాలని ధరించిన జంటలు ఉదయమే కల్యాణ మండపానికి చేరుకోగా, ఆయా జంటల తరపున బంధువులు వేలాదిగా తరలిరాగా, కందనూలు జనసందోహంగా మారింది. దాంతో పట్టణం నలుదిశలా కల్యాణ సందడి కనపడింది. పెళ్ళిళ్ళ తంతు ముగిశాక, సాయంత్రం నూతన వధూవరులకు ఒక లక్ష రూపాయల విలువైన బీరువా, మంచాలు తదితర సామాగ్రిని కూడా ట్రస్ట్‌ పక్షాన అందజేయడం జరిగింది.

ఈ కల్యాణోత్సవాలకు వివిధ శాఖల నుండి పలు హోదాల అధికారులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌ లు, జెడ్‌ పీ చైర్మన్లు, మాజీ మంత్రులు తదితరులు హాజరయ్యారు.


ఈ వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్థికశాఖా మంత్రి హరీశ్‌ రావు, ఎంజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారు అందజేసిన ఒక అంబులెన్సును నాగర్‌ కర్నూల్‌ జిల్లా దవాఖానకు అప్పగించారు. గత నెల నిర్వహించిన ఒక రక్తదాన శిబిరం కార్యక్రమంలో దవాఖానకు అంబులెన్సు లేక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని విలేకరులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ దృష్టికి తీసుకు రాగా, దానికి స్పందించిన జనార్దన్‌ రెడ్డి, దవాఖానకు త్వరలోనే తనవంతుగా ఎంజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నుండి అంబులెన్సును ఇప్పిస్తానని, అలాగే దానికి ఒక డ్రైవర్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అంబులెన్సు తో పాటు డ్రైవర్‌ ను ఏర్పాటు చేసి మంత్రి హరీశ్‌ రావు ద్వారా ప్రారభింపచేశారు.

Other Updates