తెలంగాణ సమస్యపై ప్రధాని ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు సూచించడానికై ప్రజాసమితి 1971 జనవరి 3న పధ్నాలుగు మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘంలో డా|| చెన్నారెడ్డి, వి.బి. రాజు, నూకల రామచంద్రారెడ్డి, ఎస్.బి. గిరి, మదన్ మోహన్, జి. వెంకటస్వామి, జె. ఈశ్వరీ బాయి తదితరులున్నారు.
ప్రధాని ప్రతిపాదనలను తిరస్కరించిన ప్రజాసమితి
జనవరి 4న సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గం ప్రత్యేక రాష్ట్ర అభ్యర్థనను లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో సమస్యగా చేయరాదన్న ప్రధాని సూచనను త్రోసిపుచ్చింది.
మధ్యంతర ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ప్రజాసమితి సహకారం కావాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూ ప్రధాని నిర్ద్వందంగా ప్రకటించాని ప్రజాసమితి కోరింది. ప్రధానికి ప్రభుత్వం పక్షాన ఇట్టి ప్రకటన చేయడం ఇబ్బందిగా ఉంటే తమ పార్టీ ఎన్నికల మేనిఫోస్టోలోనో లేదా పార్టీ వర్కింగ్ కమిటీ తీర్మానంలోనో పొందుపర్చాలని ప్రజా సమితి సూచించింది.
ఇలాంటి ప్రకటన చేసినప్పుడే లోకసభ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజాసమితి వ్యతిరేకించరాదన్న ప్రతిపాదనను పరిశీలించడానికి అవకాశముంటుందని తీర్మానం స్పష్టం చేసింది.
ప్రధాని ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో స్పష్టమైన వాగ్దానం చేయని పక్షంలో ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మారి 14 లోకసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టగలదని ఆ తీర్మానం స్పష్టం చేసింది. రాత్రి 11.15 గంటలకు పూర్తి అయిన తర్వాత సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ చెన్నారెడ్డి, ఇతర సభ్యులు తీర్మానాంశాలను వెల్లడిచేయ నిరాకరించారు. మరుసటి రోజు వెల్లడిస్తానని చెప్పారు.
ప్రజాసమితి సమావేశం జరుగుతుండగా అనేక మంది ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు సమావేశం జరుగుతున్న హాలుకు వెలుపల నిలబడి ప్రత్యేక తెలంగాణా అభ్యర్థన విషయంలో రాజీకి వీల్లేదని నినాదాలు చేశారు. సమావేశంలో పాల్గొన్న సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ప్రజా సమితి సమావేశాలు మూడు రోజుల పాటు జరిగినవి. డా|| చెన్నారెడ్డి ఇంట్లో 1971 జనవరి నాల్గవ తేదీ ఉదయం 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఉప సంఘం 1977 ఎన్నికల తర్వాత విధానసభలోని తెలంగాణ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు కోరే పక్షంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రధాని ప్రతిపాదనకు బదులుగా 1972 ఎన్నికల తర్వాతే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల”ని ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఉపసంఘం నివేదికను చర్చిండానికే ప్రజాసమితి కార్యవర్గం నాల్గవ తేదీ రాత్రి ఉద్రిక్త వాతావరణం మధ్య సమావేశమైంది.
ప్రజాసమితి కార్యవర్గ తీర్మానాలను డా|| చెన్నారెడ్డి జనవరి 5న పత్రికా గోష్ఠిలో విడుదల చేశారు. ఒక తీర్మానంలో ‘తెలంగాణా ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చాలని, తమ ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్టు తెలంగాణాలోని 14 లోక సభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాల”ని స్పష్టం చేసింది.
మరో తీర్మానంలో ”తెలంగాణా సమస్యను 1977 వరకు అపరిష్కృతంగా ఉంచడం ప్రజలలో ఉద్రేకం కొనసాగడానికి అవకాశం ఇవ్వడం కన్నా ప్రధాని ఇందిరా గాంధీ ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు వెను వెంటనే అధికార కాంగ్రెస్ లోనూ, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ స్థాయిలోనూ నిర్ణయం గైకొనాల”ని పేర్కొన్నది.
ప్రధాని ఇందిరాగాంధీ జాతీయ స్థాయిలో తీసుకునే విధానాలను బేషరతుగా బలపరుస్తామని, అధికార పార్టీపై పోటీ చేయడమనేది షరతులతో కూడుకున్నదని డా|| చెన్నారెడ్డి అన్నారు. ఎన్నికల్లో మెజారిటీ రాకుంటే ప్రజా సమితిని మూసివేస్తామని కూడా డా|| చెన్నారెడ్డి ప్రకటించారు.
ప్రజాసమితి నిర్ణయంతో నష్టమేమీ లేదు – పిసిసి అధ్యక్షుడు”ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మారి సమితి పక్షాన ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన అది తమ పార్టీపై ఎలాంటి ప్రభావాన్నీ కలిగించజాలద”ని అధికార కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సారెడ్డి జనవరి 5న హైదరాబాద్‌లో ప్రకటించారు. ”తెలంగాణలోని 14 లోకసభ స్థానాలతో బాటు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను నిలిపేందుకు పార్టీ ఇదివరకే నిర్ణయించింది. అయితే భావ సారూప్యత గల పార్టీతో ఎన్నికల ఒప్పందానికి సిద్ధమే”నని ఆయన అన్నారు.
ఇదే సమయంలో ఢిల్లీలో అధికార కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్జీవన్‌రామ్ ఒక పత్రికా గోష్ఠిలో మాట్లాడుతూ ”తెలంగాణా సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం కనుగొనడానికి ప్రయత్నిస్తామ”ని అన్నారు.
ప్రజాసమితిని పార్టీగా మార్చడంపై కొండా లక్ష్మణ్ విమర్శ
”ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చుతున్నట్లు చెన్నారెడ్డి వర్గం ప్రకటించడం తన స్వప్రయోజనాలు ఆశించి చేసినట్టిదే”నని తెలంగాణా కాంగ్రెస్ నేత కొండా లక్ష్మణ్ ఒక పత్రికా ప్రకటనలో విమర్శించారు.
”ప్రజా సమితిలో చేరి తెలంగాణ కోసం ఎంతో కృషి చేసిన అనేక మంది ఇతర పార్టీలకు చెందిన వారి పట్ల తృణీకార ధోరణిని చూపెట్టడమే ఈ తీర్మానం ధ్యేయం. తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ప్రజా సమితి పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడం నీతి నిజాయితీలతో తెలంగాణా రాష్ట్రం కోసం ఇన్నాళ్ళూ పోరాడిన కాంగ్రెస్ పార్టీ వారికి, ఇతర పార్టీలకు చెందిన వారికి ఒక సవాలు వంటిద”ని కొండా లక్ష్మణ్ బాపూజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
”ప్రజాసమితి సవాలును ఎదుర్కొనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యేక రాష్ట్ర వాదులు రాష్ట్ర సాధనకై తెలంగాణా కాంగ్రెస్‌లో చేరాల”ని ఆయన పిలుపునిచ్చారు.
చెన్నారెడ్డి, తాను రాజమండ్రి జైళ్ళో ఉన్న రోజుల్లోనే ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చాలని పథకం వేసుకున్నాడనీ, అప్పటి నుండి ఆయన క్రమంగా ఆ పథకాన్ని అమలు జరుపుతూ ఎన్నికల సమయం ఆసన్నం కాగానే ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చారని కొండా లక్ష్మణ్ ఆరోపించారు. ఈ ఆలోచనల అమలులో భాగంగానే ప్రజా సమితిలోని తన అనుయాయులను ఖైరతాబాద్, సిద్ధిపేట శాసనసభ ఉప ఎన్నికలలో శాసన సభ్యులుగా గెలిపించుకున్నారని అన్నారు.
”తెలంగాణా కాంగ్రెస్ 14 లోకసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెడుతుంది. ఈ నిర్ణయాన్ని ప్రజలు పరిశీలించి తమ సహాయ సహకారాలందించాల”ని కొండా లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాసమితితో కొనసాగలేము – ఈశ్వరీ బాయి
”ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత సమితిలో గల సభ్యులకు రెండు సభ్యత్వాలుండే వీలులేదని డా|| చెన్నారెడ్డి జనవరి 5న పత్రికా గోష్ఠిలో ప్రకటించినందున ప్రజా సమితిలోని ఇతర రాజకీయ పక్షాలకు చెందిన ప్రజా సమితి నాయకులకు వీడ్కోలు పలికినట్లయింది. ఈ నిర్ణయం మూలంగా తెలంగాణా ప్రజా సమితి కార్యవర్గ సభ్యులైన ఎస్.ఎస్.పి. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బద్రీ విశాల్ పిట్టీ, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ఈశ్వరీ బాయి తదితరుల సభ్యత్వాలు ప్రజాసమితిలో రద్దయిపోయినవి.
సమితి నిర్ణయం దృష్ట్యా తెలంగాణా ప్రాంతంలోని ఆర్.పి.ఐ., ఎస్.ఎస్.పి, స్వతంత్ర, జనసంఘ్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య లోకసభ ఎన్నికలలో అవగాహన కుదుర్చుకునే అవకాశాల గురించి ఈశ్వరీ బాయి సూచించారు.
”ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించేందుకు ప్రధాని సూత్ర ప్రాయంగా అంగీకరించిన పక్షంలో అధికార కాంగ్రెస్‌లో చేరడానికి ప్రజా సమితిలోని ఇతర సభ్యులు నిర్ణయించార”ని ఈశ్వరీ బాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ”అందువల్ల ప్రజా సమితితో తమ సంబంధాలు ఇక కొనసాగబోవ”ని ఆమె ప్రకటించారు.
ప్రజా సమితి నిర్ణయం పట్ల హర్షం:
ప్రధాని ఇందిరా గాంధీ సూచనలను ప్రజాసమితి త్రోసివేయడం పట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి హర్షం ప్రకటించారు. ప్రజా సమితి అభ్యర్థులను గెలిపించడానికి విద్యార్థులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సదాలక్ష్మి విమర్శ:
ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చడం పై సమితి మాజీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి, తెలంగాణా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సదాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
”తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేసి ఏర్పాటు చేసుకున్న ప్రజా సమితిని డా|| చెన్నారెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ సాధనకై కృత నిశ్చయంతో ఉన్న ఇతర పక్షాల ప్రత్యేక తెలంగాణా వాదులను సమైక్య పర్చకుండా వారిని ప్రజాసమితి నుండి గెంటివేస్తూ మరో వైపు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే సమైక్యతా వాదులతో డా|| చెన్నారెడ్డి చేతులు కలుపుతున్నార”ని సదాలక్ష్మి ఒక పత్రికా ప్రకటనలో విమర్శించారు.
”తమ స్వార్థం కోసం ప్రజా సమితి నాయకత్వం అధికార కాంగ్రెస్‌తో రాజీ పడే ప్రమాదమున్నది. దీన్ని ప్రతిఘటించడానికై విద్యార్థులు, ప్రజలు తిరిగి చైతన్యవంతులు కావాల”ని ఆమె అభ్యర్థించారు.
పాత కాంగ్రెస్, ఎస్.ఎస్.పి స్వతంత్ర పార్టీల విమర్శ:
తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చడాన్ని, లోక్‌సభ మధ్యంతర ఎన్నికలపై డాక్టర్ చెన్నారెడ్డి అనుసరిస్తున్న వైఖరిని పాత కాంగ్రెస్, ఎస్.ఎస్.పి. స్వతంత్ర పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సర్దుబాట్లపై చర్చలు సాగించే నిమిత్తం జనవరి 6న హైదరాబాద్‌లో సమావేశమైన ఈ పార్టీల నేతలు సంయుక్తంగా ఆమోదించిన తీర్మానం ఇలా వుంది.
”తెలంగాణా ప్రజా సమితి రాజకీయ పార్టీగా మార్చడం దురుద్దేశ్యంతో, కావాలని గైకొన్న చర్య. తెలంగాణ ఉద్యమాన్ని హృదయ పూర్వకంగా సమర్ధించిన రాజకీయ పార్టీలకు సమితి నుండి ఉద్వాసన చెప్పేందుకు, తెలంగాణా ప్రజల కోర్కెలకు తీరని నష్టం వాటిల్ల జేసిన ప్రధానికి అనుకూల వాతావరణం కల్పించేందుకే ఈ చర్య గైకొన్నారు. తెలంగాణ ప్రజల భావాలను, ముఖ్యంగా తెలంగాణా విద్యార్థుల చారిత్రక త్యాగాలను పూర్తిగా విస్మరించి ప్రధాని ఇందిర అభిమానం చూరగొనేందుకు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రితోనూ, కేంద్ర స్థాయిలో ప్రధానితో, కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్జీవన్ రామ్‌తోనూ డాక్టర్ చెన్నారెడ్డి ఇటీవల సాగించిన స్వార్థపర యత్నాలు గమనించిన వారికి ప్రజాసమితి కార్యవర్గ తీర్మానం, దాని తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి విడుదల చేసిన విరుద్ధ ప్రకటన విస్మయం కలిగించలేద”ని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
పాత కాంగ్రెస్ నాయకుడు పి. వెంకట సుబ్బయ్య పత్రికల వారితో మాట్లాడుతూ ”తెలంగాణా నాయకుణ్ణి ముఖ్యమంత్రి చేసే నిమిత్తం బ్రహ్మానంద రెడ్డి పదవి నుండి వైదొలగాలని 1969 జూలై 6న జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి తమ పార్టీ ట్టుబడి ఉంటుంద”ని అన్నారు. ఈ తీర్మానాన్ని అమలు పర్చకపోతే ఫజల్ అలీ కమీషన్ నివేదికను ఆమోదించాల”ని అన్నారు.
ప్రజా సమితిని ‘పార్టీ’గా మార్చడంపై చెన్నారెడ్డి వివరణ
ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ వాదులు కొందరు విమర్శిస్తుండడంపై డా|| చెన్నారెడ్డి జనవరి 7న పత్రికలకు ‘వివరణ’నిస్తూ ప్రకటన పంపారు.
ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా ఒక సంస్థ కావాలని, క్రమ శిక్షణాయు తంగా పని చేయాలని ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం వంటి మహత్తరమైన లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చడం అవసరమని ఒక సంవత్సరం క్రితమే ప్రతిపాదన పరిశీలనకు వచ్చిందనీ, సమితిలోని అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువకులు, విద్యార్థుల అభిమతాన్ని బట్టి సమితిని రాజకీయ పార్టీగా మార్చామని డా|| చెన్నారెడ్డి స్పష్టం చేశారు.
సమితిని రాజకీయ పార్టీగా మార్చడంపై వచ్చిన విమర్శలను, వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాజకీయ పార్టీగా ఉంటేనే లోకసభ మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికి ఎన్నికల చిహ్నాన్ని ఎన్నికల కమీషన్ వారు ఇస్తారని, కమీషన్ గుర్తింపు లభిస్తుందని, అందువల్లనే తప్పనిసరిగా సమితిని రాజకీయ పార్టీగా మార్చవలసి వచ్చిందని డా|| చెన్నారెడ్డి ఆ ప్రకటనలో వివరించారు.
పాత కాంగ్రెస్, స్వతంత్ర, ఎస్.ఎస్.పి. పార్టీలు ఎన్నికల సంఘటనగా ఏర్పడినవని, వాటి పట్ల ప్రజా సమితికి ఎప్పుడూ వ్యతిరేకత లేదని, పాత కాంగ్రెస్ కానీ, స్వతంత్ర పార్టీ కానీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని నిర్ణయం తీసుకోలేదని డా|| చెన్నారెడ్డి అన్నారు.
ఎస్.ఎస్.పి. విషయంలో ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చాలనే ప్రతిపాదనను పరిశీలించడానికి వేసిన ఉపసంఘానికి ఆ పార్టీ నాయకుడైన బి. సత్యనారాయణ రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించారని, రాజకీయ పార్టీగా మార్చాలనే తుది నిర్ణయం తీసుకున్న సమావేశానికి ప్రముఖ ఎస్.ఎస్.పి. నాయకుడు బద్రీ విశాల్ పిట్టీ హాజరైనారని డాక్టర్ చెన్నారెడ్డి పేర్కొన్నారు.
ఏ ఒక్కరిని ప్రజాసమితి నుండి గెంటివేయడానికి దానిని రాజకీయ పార్టీగా మార్చడం జరుగలేదని, బహుళ సంఖ్యాకుల కోర్కెను అనుసరించే రాజకీయ పార్టీగా మార్చామని, ఇతర పార్టీలు, లక్ష్యాల పట్ల విధేయత కలవారు సమితిలో ఉండాలో లేదో వారే తేల్చుకొనాలని, ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా కలవారంతా ప్రజాసమితిలో ఉండి కృషి చేయాలని, ఇతర రాజకీయ పార్టీలతో ప్రజాసమితికి ఎట్టి విభేదాలు లేవని డా|| చెన్నారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఎన్.జి.ఓ.లు చేసిన విస్తృతమైన త్యాగాలకు ఫలితాలను సాధించడానికి ఈ మధ్యంతర ఎన్నికల పోరాటంలో సమితిని అన్ని వర్గాల వారు సర్వ విధాలా బలపర్చాలని, అవసరమైన త్యాగాలు చేయాలని డాక్టర్ చెన్నారెడ్డి కోరారు.
చెన్నారెడ్డితో విభేదించిన బద్రీవిశాల్, నాయని నరసింహారెడ్డి
ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని సంయుక్త సోషలిస్టు పార్టీ (ఎస్.ఎస్.పి) నాయకులు శాసన సభ్యుడు బద్రీ విశాల్ పిట్టీ, పార్టీ నేత నాయని నరసింహారెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజా సమితిలో చెన్నారెడ్డి నాయ కత్వాన ఉన్న వర్గం ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి పోయి, ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని వదిలి, ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్లకై ఎగబడుతూ ప్రజా సమితిని అధికార కాంగ్రెస్‌కు తోకగా మార్చివేసి క్రమంగా సమితిని రద్దు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరు గారి పోకుండ చూడడం ఎంతైనా అవసరమని, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవలసిన అవసరమున్నదని గుర్తించే వారందరూ ఈ ఆశయ సాధనకై భవిష్యత్ కార్యక్రమం రూపొందించు కోవాలని దీనికై జనవరి 10న రాంకోఠిలోని సరోజినీ దేవి హాల్‌లో తాము నిర్వహిస్తున్న సమావేశానికి రావాలని తెలంగాణ వాదులకు పిలుపు నిచ్చారు.
రాష్ట్ర విభజనకు ప్రధాని వ్యతిరేకం – పి.సి.సి. అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి అధికార కాంగ్రెస్ అసలే అంగీకరించదని, వేర్పాటు ధోరణిని, ప్రాంతీయ తత్వాన్ని వదలుకోవాలని రాష్ట్ర ప్రజలను, నాయకులను ప్రధాని ఇందిరాగాంధీ కోరుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పి. నరసారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రాంతీయ విభేదాలు, వేర్పాటు ధోరణులను విడనాడి జాతీయ లక్ష్యాల సాధనకై ఐక్యతతో కృషి చేయాలని, తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ‘వేర్పాటు’ కాదని, కేవలం ఉద్రేకాలలో పడి కొట్టుకు పోవటానికి బదులు, అష్టసూత్ర పథకం అమలుకు అవకాశం ఇచ్చి చూడాలని ప్రధాని కోరుతున్నారని నరసారెడ్డి పత్రికా ప్రకటనలో వివరించారు.
చెన్నారెడ్డిని ప్రజా సమితి నుండి తొలగిస్తూ తీర్మానం
సరోజినీ దేవి హాలులో పలువురు విద్యార్థి నాయకులు, ఎస్.ఎస్.పి. స్వతంత్ర, పాత కాంగ్రెస్, రిపబ్లిక్ పార్టీలు సంయుక్తంగా జనవరి 10న నిర్వహించిన సమావేశం డా|| చెన్నారెడ్డిని ప్రజాసమితి నుండి తొలగిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సభకు పది జిల్లాల నుండి తెలంగాణ వాదులు హాజరైనారు.
”తెలంగాణా ప్రజా సమితి అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులకు, విద్యార్థులకు, యువకులకు, అశేష ప్రజానీకానికి సమానంగా ప్రాతినిథ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందని, అలాంటి ప్రజా సమితిని ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ను బలపర్చడానికి వినియోగపడేందుకు వీలుగా ఒక రాజకీయ పార్టీగా మార్చడం ద్వారా డా|| చెన్నారెడ్డి వంటి నాయకులు తెలంగాణా ఉద్యమానికి ద్రోహం తలపెట్టార”ని తీర్మానంలో పేర్కొన్నారు.
డాక్టర్ చెన్నారెడ్డిని, ఆయన వర్గాన్ని ప్రజా సమితి నుంచి తొలగిస్తూ తెలంగాణ ప్రజా సమితిని యథాపూర్వకంగా వివిధ రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు, అశేష ప్రజానీకానికి ప్రాతినిథ్యం వహించే బృహత్తర సంస్థగా పునర్వ్యవస్థీకరిస్తూ ఈ సమావేశంలో తీర్మానించారు.
ఈ తీర్మానాన్ని తెలంగాణా ఉద్యమాన్ని ప్రారంభించిన యువకులలో ఒకరైన ప్రతాప్ కిషోర్ ప్రతిపాదించారు. ఈ సమావేశానికి ఎస్.ఎస్.పి. నాయకుడు బి. సత్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోని నాయిని నరసింహారెడ్డి, బద్రి విశాల్ పిట్టీ, జె. ఈశ్వరీ బాయి, విద్యార్థి నాయకుడు రమాకాంత్ తదితరులు ప్రసంగించారు.
ప్రజా సమితికి మల్లికార్జున్ విజ్ఞప్తి:
అధికార కాంగ్రెస్‌తో ఏ విధమైన ఎన్నికల సర్దుబాట్లనూ చేసుకోరాదనీ, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతునివ్వరాదనీ ప్రజా సమితిని కోరుతూ తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘం మల్లికార్జున్ అధ్యక్షతన సమావేశమై తీర్మానించింది.
ప్రజా సమితి ఆదేశాన్ని త్రోసిరాజని పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులుగా కూర్చోడానికి నిరాకరించిన వారికి తిరిగి ప్రజా సమితి టికెట్లివ్వరాదని సంఘం కోరింది. కొందరు విద్యార్థులు తెలంగాణ ప్రజాసమితి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రజాసమితితో కేంద్ర నాయకులు చర్చలు జరిపే ప్రసక్తి లేదు – సిఎం తెలంగాణ ప్రజాసమితితో ఇక తానుకానీ, కేంద్ర నాయకులు కానీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని సిఎం బ్రహ్మానంద రెడ్డి అన్నారు.
కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పి. నరసారెడ్డి చేసిన ఇలాంటి ప్రకటనే ప్రధాని అంతరంగాన్ని తెలియజేసింది.
ప్రధాని ప్రతిపాదనలను ప్రజాసమితి తిరస్కరించడం బహుశా ఆమెకు కోపం తెప్పించి వుంటుంది.
14 లోక సభ స్థానాలకు ప్రజా సమితి అభ్యర్థులు
తెలంగాణ ప్రజా సమితికి ‘పార’ గుర్తును ఎన్నికల కమీషన్ కేటాయించిందని డా|| చెన్నారెడ్డి జనవరి 13న హైదరాబాద్‌లో తెలిపారు. తెలంగాణలోని 14 లోకసభ నియోజకవర్గాల్లో ప్రజాసమితి అభ్యర్థులు ‘పార’ గుర్తు పైనే పోటీ చేస్తారని, ఏ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని ఆయన ప్రకటించారు. ఎస్.ఎస్.పి., పాత కాంగ్రెస్, రిపబ్లిక్ పార్టీల ప్రతినిధులు తమ తమ స్వంత చిహ్నాలపై పోటీ చేయడానికి సీట్లు కేటాయించాలని తమను కోరినారని డా|| చెన్నారెడ్డి తెలిపారు. సమితి ‘పార’ గుర్తుపై పోటీ చేయాలని తమ పార్టీ కార్యవర్గం తీర్మానించింద”న్నారు.
వచ్చే సంచికలో… ”మల్లికార్జున్ బహిష్కరణ”