ఈఏడాది వర్షాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి. ఆయకట్టు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజి నుంచి ఈ వర్షాకాలంలో నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని, ఆ నీటిని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములకు తరలిస్తామన్నారు. ఈ రెండు డ్యాముల్లో కలిపి 50 టిఎంసిల నిల్వ సామర్థ్యం ఉంటుందని, ఆ నీటితో ఎస్.ఆర్.ఎస్.పి. కాల్వల ద్వారా అన్ని చెరువులను నింపాలని ఆదేశించారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయి, పనులు చేయడానికి నిధులిస్తున్నాం, అయినా పంట పొలాలకు నీరందించకుంటే పాపం చేసిన వారమవుతామని సిఎం వ్యాఖ్యానించారు.
ఎస్.ఆర్.ఎస్.పి. పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకశంగా చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందో గుర్తించి, దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించారు. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
”గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నం. ఈ ఏడాది వర్షాకాలం నుంచే మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోసి మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములకు తరలిస్తాం. అలా తరలించిన నీటిని ఎస్.ఆర్.ఎస్.పి. కాల్వల ద్వారా అన్ని చెరువులకు మళ్లించాలి. చెరువులను నింపడమే ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలి. దీనికోసం ఎస్.ఆర్.ఎస్.పి. కాల్వలన్నింటినీ మరమ్మతు చేయాలి. కావాల్సిన చోట తూములు వెంటనే నిర్మించాలి. భూ సేకరణ పూర్తి చేయాలి. రెండో ఫేజులో నిర్మించిన కాల్వలకు లైనింగ్ పూర్తి చేయాలి. అవసరమైతే కాల్వల క్యారీయింగ్ కెపాసిటీ (నీటి ప్రవాహ ఉధతి సామర్థ్యం)ని పెంచుకోవాలి. ఎక్కడ ఏ పనిచేయాలో నిర్ణయించడానికి వెంటనే 50 మంది ఇంజనీర్లను నియమించండి. యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి, అంచనాలు రూపొందించాలి. కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేస్తాం. పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అన్ని పనులూ పూర్తి చేసి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలానికి ఎస్.ఆర్.ఎస్.పి. పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకు నీరు అందాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు:
- కాకతీయ కాలువ- వరద కాలువ మధ్యనున్న లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ పనుల కోసం సర్వే నిర్వహించి, పనులు ప్రారంభించాలి
- ఎస్.ఆర్.ఎస్.పి. స్టేజ్ 2లో అన్ని డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ చేయాలి. దీనికోసం వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవాలి. ఎండాకాలంలోపు పనులు పూర్తి కావాలి
- ఎస్.ఆర్.ఎస్.పి కాల్వల పనులు చేయడానికి ఎక్కడికక్కడ ఎక్కువ మంది కాంట్రాక్టర్లను నియమించాలి. అన్ని చోట్ల పనులు సమాంతరంగా జరగాలి
- అన్ని ప్రాజెక్టుల కాల్వలకు సంబంధించిన హద్దులను నిర్ణయించాలి. ప్రాజెక్టుల భూముల సమగ్ర వివరాలను (ఇన్వెంటరీ) రూపొందించాలి
- కడెం గేటు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి
- ఎస్.ఆర్.ఎస్.పి పంట కాల్వలను ఎవరైనా దున్నుకుంటే, వాటిని పునరుద్ధరించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపి, రైతులను ఒప్పించాలి
- అన్ని ప్రాజెక్టుల ప్రొఫైల్ తయారు చేయాలి. ప్రతీ ప్రాజెక్టుకు ఆపరేషన్ రూల్స్ తయారు చేయాలి
- ప్రాజెక్టుల నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. ఆ నిధులను బడ్జెట్‌లోనే కేటాయిస్తాం
- చనాఖా -కొరాటా పనులు మే 15 నాటికి పూర్తి కావాలి
- దేవాదుల నీటిని తరలించే రామప్ప, లక్నవరం, ఘణపూర్, పాఖాల కాల్వల పనులను ఈ ఎండాకాలంలోనే పూర్తి చేయాలి
- దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలి.