రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చారు.
ఉద్యోగ నియామకాల తొలి దశలో భాగంగా 15 ప్రభుత్వశాఖలో ఖాళీగా ఉన్న 15,000 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై జులై 25న ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. అలాగే ఈ ఏడాది జరిపే నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాలను 44 ఏళ్ళకు సడలించాలని కూడా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. నిర్ణయించారు. నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించవసిందిగా సంబంధిత అధికారులను సి.ఎం. ఆదేశించారు.
కానిస్టేబుల్, ఎస్.ఐ. పోస్టులతో సహా పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8,000 ఖాళీలు, విద్యుత్ శాఖలో 2,681 పోస్టులు, వ్యవసాయం, ఉద్యానవనం, వైద్య, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ, రవాణా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో 4,300 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు.