cm-kcrరామగుండం ఫర్టిలైజర్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.)ను పునరుద్ధరించడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు. నేషనల్‌ ఫర్టిలైజర్‌ సిఎండి మనోజ్‌ మిశ్రా, ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. సిఇఓ వివేక్‌ మల్హోత్రా, సిఎఫ్‌ఓ సునిల్‌ భాటియా జనవరి 18 క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆర్‌.ఎఫ్‌.సి. ఎల్‌. పునరుద్ధరణపై చర్చించారు. 4.95 లక్షల టన్నుల యూరియా, 2.97 లక్షల టన్నుల అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.ను 1980లో ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల 1990లో మూత పడింది. 3వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నందున ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.ను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో కేంద్రం కూడా ముందుకొచ్చింది. 2018 జూన్‌ నాటికి ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పునరుద్ధరణపై సిఎం సమీక్ష నిర్వహించారు.

ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.కు మిషన్‌ భగీరథ పైపులైన్‌ ద్వారా ఎల్లంపల్లి ఇన్‌ టేక్‌ వెల్‌ నుంచి 0.55 టిఎంసిల నీరు సరఫరా చేయాలని, ఫ్యాక్టరీకి అవసరమయ్యే 40 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. కోరిన మరిన్ని అంశాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన టిఎస్‌-ఐపాస్‌ చట్టానికి అనుగుణంగా ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.కు సహకారం అందించాలని సిఎం నిర్ణయించారు. సమావేశంలో ఎంపిలు జితేందర్‌ రెడ్డి, బి.వినోద్‌ కుమార్‌, బాల్క సుమన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, సిఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

Other Updates