చరిత్రాత్మక టీ.ఎస్.బీ-పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం
భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ శాసనసభలో ఆమోదించిన టిఎస్-బీపాస్ బిల్లు దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైనదని, ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ముందు ముందు అమలు చేసేందుకై ప్రయత్నిస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టీ. రామారావు అన్నారు. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన బిల్లును శాసన సభలో మంత్రి కెే.టీ.రామారావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ, టీఎస్ బీ-పాస్ తో 95 శాతం పేదు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ విధానంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేదంటే 22 వ రోజు డీమ్ అప్రూవల్ గా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే పది రోజుల్లోనే దరఖాస్తును తిరస్కరించడం జరుగుతుందని అన్నారు. 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఏవిధమైన అనుమతులు అవసరం లేదని, నిబంధనల మేరకు ఉన్న ఈ నిర్మాణాలను దరఖాస్తు చేసుకోగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
టీ.ఎస్.బీ-పాస్ తో మరింత పారదర్శకత
టీ.ఎస్. బీ-పాస్ తో భవన నిర్మాణ అనుమతుల్లో వంద శాతం పారదర్శకత ఏర్పడుతుందని, దీనితో 95 శాతం పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 75 నుంచి 600 గజాల వరకు స్థలం ఉన్న వారు ఆన్‌లైన్‌లోనే ఇన్‌స్టంట్ పర్మిషన్ తీసుకోవచ్చని, 600 గజాల పైన స్థలం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 21 రోజుల్లో పర్మిషన్ రాకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ జారీ చేసినట్టుగా భావించవచ్చని, 22వ రోజునే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ కమీషనర్ సంయుక్తంగా సంతకం చేసిన అనుమతి సర్టిఫికేట్ జారీ చేస్తారని పేర్కొన్నారు. దీనితో, రుణాలను బ్యాంకు నుండి పొందవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ అనుమతి సర్టిఫికెట్ తో భవన నిర్మాణ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తామన్నారు.
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఈ బిల్లు అమలు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జోనల్ కమీషనర్ల ఆధ్వర్యంలోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు, జీహెచ్‌ఎంసి స్థాయిలో కమీషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని, ఏవైనా ప్రతిబంధకాలుంటే పరిష్కార మార్గాలు సూచిస్తారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చట్టం పట్ల ప్రజలకు భయం, గౌరవం ఉండాలి. అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ టీ.ఎస్.బీ-పాస్ తో భవన నిర్మాణ అనుమతుల్లో వంద శాతం పారదర్శకత ఏర్పడుతుందని, దీనితో 95 శాతం పట్టణ పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పేర్కొన్నారు.
21 రోజుల్లోనే అనుమతులు జారీ
- టీఎస్-ఐపాస్ మాదిరి ఈ విధానానికి కాల పరిమితి నిర్ణయించామన్నారు. ఈ విధానంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేదంటే 22 వ రోజు డీమ్డ్ అప్రూవల్ గా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుందని అన్నారు. గతంలో వారి దయ, మా ప్రాప్తం అనే విధంగా భవన నిర్మాణ అనుమతు జారీ ఉండేదని, ఇకనుండి ఇలా ఉండదని స్పష్టంచేశారు. నిర్మాణ అనుమతులు జారీ పత్రాల్లోనే ఆయా అనుమతులకు సంబంధించి జియో కోఆర్డినేట్లు,జియో టాగింగ్‌ను పేర్కొనడం జరుగుతుందని ప్రకటించారు.
- చట్టాలంటే భయం లేకపోవడంతోనే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ కట్టడాలు ప్రభుత్వం, చట్టం అంటే భయం లేకపోవడం వల్లే నగరాలు, పట్టణాలలో అక్రమ కట్టడాలు ఇబ్బడి, ముబ్బడిగా వస్తున్నాయని, ఇక నుండి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలో జరిగే అక్రమ నిర్మాణాలను ఏ విధమైన నోటీసులు లేకుండానే కూల్చివేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఎంతో అధ్యయనం చేసి, పలు రకాలుగా ఆలోచించి రూపొందించామని తెలిపారు.
నేడు తెలంగాణ అమలు చేసినదాన్నే రేపు దేశం ఆచరించనుందనే పద్ధతిలో పారదర్శకంగా ముందుకుసాగుతున్నామని మంత్రి అన్నారు. నిర్మాణ అనుమతుల్లో ఏవైనా కేంద్ర ప్రభుత్వ శాఖ అనుమతులు కావాల్సి ఉంటే, తాను ఆయా కేంద్ర మంత్రులతో స్వయంగా మాట్లాడుతానని చెప్పారు. పన్ను బకాయి చెల్లింపు పథకం మరో నెలన్నర పొడిగింపు
- రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీ లో 90 శాతం మాఫీ పథకాన్ని మరో 45 రోజులపాటు పొడిగిస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి ప్రకటించారు. జీ.హెచ్.ఎం.సి తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ మాఫీ ని అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నామని అన్నారు.