magaరాష్ట్రమంతటా వ్యవసాయానికి 24గంటలు విద్యుత్‌ సరఫరా చేయడానికి కసరత్తు ప్రారంభించామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇది వచ్చే రబీ సీజన్‌ నుంచి అమలవుతుందన్నారు. ప్రయోగాత్మకంగా మొదట ఉమ్మడి మెదక్‌, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో 24 గంటలు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనితో 20శాతం విద్యుత్‌ సరఫరా డిమాండ్‌ పెరిగిందన్నారు. ఈ మూడు జిల్లాల్లో 9.85 లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. 2016 జులైలో 6890 మెగావాట్ల డిమాండ్‌ ఉంటే, ఈ ఏడాది జులైలో 8300 మెగావాట్ల డిమాండ్‌ ఏర్పడిందన్నారు.

రాష్ట్రంలోని 22లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో సరఫరా చేస్తున్న అనుభవాలు, అధ్యయనం చేయడం ద్వారా తెలిసిందేమంటే రాష్ట్రమంతటా నిరంతరం వ్యవసాయానికి 24గంటలు సరఫరా చేస్తే పీక్‌ డిమాండ్‌ 11వేల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. 16వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మూడు సంవత్సరాలుగా పటిష్టపరిచామని తెలిపారు.

ఇప్పుడు వ్యవసాయానికి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయడానికి మరో 1600 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని తెలిపారు. దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ను అందించడానికి కూడా సన్నద్దమవుతున్నామని ప్రభాకరరావు పేర్కొన్నారు.

రైతులు సహకరించాలి…

ప్రభుత్వం రైతులకు 24గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న నేపథ్యంలో రైతులు కూడా ప్రభుత్వానికి, విద్యుత్‌శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ తమ బావుల వద్ద విద్యుత్‌ మోటార్లకు అమర్చిన ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని సూచించారు. వీటిని తొలగించడం వల్ల విద్యుత్‌, నీరు వృధా కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఇదే విషయాన్ని రైతులకు విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు. ప్రస్థుతం తాము 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ప్రాంతాలలో స్పెషల్‌ డ్రైవ్‌ చేసి ఆటో స్టార్టర్లను తొలగిస్తున్నట్లు ప్రభాకరరావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు, ఏర్పడిన తరువాత విద్యుత్‌ పంపిణీ, సరఫరాలలో గణనీయమైనమార్పులు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. 2013-14లో గరిష్ట డిమాండ్‌ 6660 మెగావాట్లు కాగా, విద్యుత్‌ వినియోగం 123 మిలియన్‌ యునిట్లు ఉండేదన్నారు. 2016-17లో గరిష్ట డిమాండ్‌ 9191 కాగా 31 మార్చి 2017 నాటికి వినియోగం 148 మిలియన్‌ యునిట్లు ఉందన్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఇప్పటికే 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తుండగా, త్వరలోనే వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. దీనితో అన్ని వర్గాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసిన వారమవుతున్నామన్నారు. విద్యుత్‌ విషయంలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదని ఆయన స్పష్టం చేశారు.

Other Updates