హైదరాబాద్‌కు పదేళ్ల ప్రణాళిక రచించాలని, అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచి ప్రతీ పని చేసుకుపోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే 30 ఏళ్లకు ఏర్పడే అవసరాలకు తగినట్లు ప్రణాళిక సిద్ధం చేయాలని, పదేళ్ల కోసం కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. నగరం కోసం రెండు మంచినీటి రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు రహదారులు, మురికి కాలువలు, వరద కాలువలు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, రవాణా సదుపాయాలు, మార్కెట్లు, టాయిలెట్లు, పచ్చదనం తదితర అంశాల్లో నగరం ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, టి. హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫజీ యుద్దీన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ, నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, హెచ్‌ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, వాటర్ వర్క్స్ కమిషనర్ దానకిషోర్, పిసిసిఎఫ్ ప్రశాంత్ కిషోర్ ఝా, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘హైదరాబాద్ నగరం శరవేగంగా పెరుగుతున్నది. పెరిగే జనాభాకు అనుగుణంగా అవసరాలు కూడా పెరుగుతాయి. వీటిని దృష్టిలో వుంచుకుని మనం ప్రణాళికలు వేయాలి. రాబోయే 30 ఏళ్లకు ఈ నగరం ఎలా ఉంటుంది? జనాభా ఎంత పెరుగుతుంది? అప్పుడు ఏర్పడే అవసరాలు ఏమిటి? అనే కల్పన ఉండాలి. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ఎలా చేయాలి? అని ఆలోచించాలి. కనీసం పదేళ్ల కోసం కార్యాచరణ ప్రణాళిక వేయాలి. ఇప్పటి నుంచి చేసే ప్రతీ పని ఆ ప్రణాళికలో భాగం అయి ఉండాలి’ అని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
హైదరాబాద్ మంచినీటి సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన రెండు రిజర్వాయర్లు నిర్మించాలి. గోదావరి నదిమీద కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రిజర్వాయర్ ను, కృష్ణా నది మీద కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో రిజర్వాయర్ ను నింపాలి. గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేసి, 10-15 టిఎంసిల నీరు నిల్వ ఉండే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలి. దీనికోసం సాంకేతిక అంశాలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలి.
నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి. అందుకోసం బస్తీ కమిటీలు వేయాలి. ప్రతీ డివిజన్‌కు 10 కమిటీలు ఉండాలి. ప్రజలందరినీ కలుపుకుని బస్తీలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం తదితర విషయాల్లో ఆ కమిటీలు కీలకంగా పనిచేస్తాయి.
గండిపేట, హిమాయత్ సాగర్, శామీర్ పేటతో పాటు నగరంలో, నగరం చుట్టూ అనేక చెరువులున్నాయి. వాటిలో పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్యం చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మురికి నీరు చెరువుల్లోకి చేరకుండా ప్రత్యేక కాల్వలు నిర్మించాలి.
నగరంలో కొత్తగా కట్టే నిర్మాణాలకు అనుమతి ఇచ్చే సందర్భంలో అధికారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. అనుమతులు ఇచ్చే సందర్భంలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలి. మూసీ నదిలో మురికి నీరు చేరకుండా చూడాలి. మురికి నీరు పోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మూసీకి రెండు వైపులా ఉద్యానవనాలు అభివద్ధి చేయాలి. మూసీ మీదుగా ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు రహదారి నిర్మించాలి. మూసీ నది దాటడానికి పలు చోట్ల వంతెనలు నిర్మించాలి.
నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలి. ఇండ్లపై తీగలను తొలగించాలి. నగరంలో పెరిగే డిమాండ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.
ఎస్.ఆర్.డి.పి.లో భాగంగా నిర్మించే రహదారుల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉప్పల్ లాంటి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అండర్ పాస్‌లు నిర్మించే సందర్భంలో వర్షం, వరద నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలి.
హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్నది. గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది. నగరం చుట్టూ ఉన్న వేలాది అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచాలి. నాగోల్, నారపల్లి ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిది వేల ఎకరాల అటవీ భూమి ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో ఓఆర్‌ఆర్ అవతల మరో 16వేల ఎకరాల అటవీ భూమి ఉంది. నర్సాపూర్, శివంపేట ప్రాంతంలో దాదాపు 40 వేల అటవీ భూమి ఉంది. నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో అటవీ భూమి ఉంది. వీటన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. ఓఆర్‌ఆర్ పొడవునా ఇరువైపులా వేప, గుల్మొహర్, రావి చెట్లు నాటాలి. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో పచ్చదనం ఉండాలి. మున్సిపల్ శాఖ మంత్రి పేషీలో కేవలం నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షించడం కోసం ఓ ఐఎఫ్‌ఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలి.
ప్రజలకు నిరంతరం కరెంటు అందివ్వడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. అందులో విజయం సాధించాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతులకు సాగునీరు అందివ్వడం కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టులు బాగా సాగుతున్నాయి. ఇక ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించే విషయంలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది. తెలంగాణలో నగరాలు, పట్టణాల్లో నివసించే జనాభా విపరీతంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా వసతులు కల్పించాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే కోటి జనాభా ఉంది. ఈ నగరంపై అత్యంత ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రణాళికా బద్ధంగా పనులు చేసుకుంటూ పోవాలి..
– ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖరరావు